బలహీన పార్టీల పొత్తుపై ఇంత గగ్గోలు ఎందుకు?

ఏపీలో ఓ పక్క మూడు రాజధానులపై అమరావతిలో ఉధృతంగా ఆందోళనలు జరుగుతుండగానే మరో పక్క ఈ ఆందోళనల మధ్యనే జనసేన-బీజేపీ హడావుడిగా పొత్తు పెట్టుకున్నాయి. సాధారణంగా ఇలాంటి హడావుడి పొత్తు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల…

ఏపీలో ఓ పక్క మూడు రాజధానులపై అమరావతిలో ఉధృతంగా ఆందోళనలు జరుగుతుండగానే మరో పక్క ఈ ఆందోళనల మధ్యనే జనసేన-బీజేపీ హడావుడిగా పొత్తు పెట్టుకున్నాయి. సాధారణంగా ఇలాంటి హడావుడి పొత్తు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కనబడుతుంది. కాని ప్రస్తుతం ఆ ఎన్నికలు లేవు. కాని త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు పార్టీలు 'దోస్త్‌ మేరా దోస్త్‌' అంటూ పాడుకోవడం ప్రారంభించాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో భూకంపం వచ్చినట్లుగా, తుపాను వచ్చినట్లుగా టీడీపీ మినహా మిగిలిన పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అధికార వైకాపా, కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 

ఈ మూడు పార్టీలకు ఇంతగా గగ్గోలు పెట్టాల్సిన అవసరమేమిటో అర్థం కావడంలేదు. ఈ రెండు పార్టీల పొత్తుపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విమర్శలు చేశాయంటే, విరుచుకుపడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అవి జనసేనతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. అయినా ఫలితం దక్కలేదనుకోండి. అది వేరే విషయం. జనసేన కాషాయ పార్టీతో కలవడంతో వామపక్షాలకు తోడు లేకుండాపోయింది. వచ్చే ఎన్నికల  వరకు బీజేపీతో పవన్‌ స్నేహం కంటిన్యూ అయితే వామపక్షాలు ఒంటరిగా పోటీ చేయాల్సివస్తుంది. అందులోనూ పవన్‌ పొత్తు పెట్టుకున్నది మతతత్వ (వారి దృష్టిలో) బీజేపీతో కాబట్టి అవి సహించలేకపోతున్నాయి. ఇక వైకాపా ఒకవిధంగా చెప్పాలంటే వామపక్షాల కంటే ఎక్కువగా జనసేనను కడిగిపారేస్తోంది. 

జనసేన-బీజేపీ పొత్తు అనేది అది వాటి అంతర్గత వ్యవహారం. రాష్ట్రంలో అవి రెండు బలహీన పార్టీలనేది అందరికీ తెలుసు. వైకాపా కూడా అలాగే విమర్శలు చేస్తుంటుంది. ఈ రెండు బలహీన పార్టీలు పొత్తు పెట్టుకొని ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చలేవు. వైకాపా సర్కారును కూలదోయలేవు. ఆంజనేయుడు శరీరం పెంచి ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు ఎదిగిపోలేవు. ఈ సంగతి వైకాపాకు తెలియంది కాదు. అయినప్పటికీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోగానే వైకాపా నాయకులు వరుసగా విమర్శలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ప్రధాని మోదీపై చేసిన విమర్శలను, ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను, బీజేపీపై చేసిన కామెంట్లను 'సాక్షి'లో ప్రముఖంగా హైలైట్‌ చేసింది. 

వైకాపా తీరు చూస్తే ఈ రెండు పార్టీల పొత్తు కారణంగా కంగారు పడినట్లు, కలవర పడినట్లు కనపించింది. దీంతో జనసేన, బీజేపీలను చూసి వైకాపా భయపడుతోందని ఈ రెండు పార్టీల నాయకులు కామెంట్‌ చేశారు. పవన్‌ నిలకడ లేని రాజకీయ నాయకుడని, ఆయన రాజకీయాలకు అనర్హుడని, ఎప్పుడేం చేస్తాడో తెలియదని వైకాపా నాయకులు విమర్శిస్తుంటారు. అలాంటి పవన్‌ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అంతగా కంగారు పడాల్సింది ఏముంది? సాధారణ ఎన్నికలు జరిగేది 2024లో. అప్పటివరకు ఈ పొత్తు సజావుగా సాగుతుందని గ్యారంటీ ఇవ్వగలమా? 

పవన్‌ ఎప్పుడేం చేస్తాడో, ఎప్పుడేం మాట్లాడుతాడో నిజంగానే ఎవరికేమీ అర్థం కాదు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కలిసి వస్తాదు టైపులో తయారవుతాయనుకోవడం భ్రమే. బీజేపీ నేతలు ఎంతవరకు పొత్తు ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటారనేది అనుమానమే. సాధారణంగా పవన్‌ కళ్యాణ్‌ తాను గొప్ప నాయకుడినని, తన పార్టీ చాలా బలమైందని భావిస్తుంటాడు. జనసేన ప్రధానమైన పార్టీ అనుకోబట్టే కదా బీజేపీ పొత్తు పెట్టుకున్నది. పొత్తు కోసం ఢిల్లీ వెళ్లిన పవన్‌కు ప్రధాని దర్శనం కాలేదు. అమిత్‌ షా మొహం చూపించలేదు. దీన్నిబట్టే బీజేపీ ఆయనకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 

పవన్‌ కంటే ముందు ఢిల్లీ వెళ్లిన నటుడు మోహన్‌బాబుతో, ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ అరగంటకు పైగా గడిపారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మోహన్‌బాబు అమిత్‌ షాను కూడా కలిశాడు. మరి మోహన్‌బాబుకు ఏదైనా గొప్ప పదవి ఉందా? ఏదైనా పార్టీ అధ్యక్షుడా? ఏదీ కాకపోయినా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ ప్రాధాన్యం పవన్‌కు లభించలేదు. కాబట్టి బీజేపీ-జనసేన పొత్తుపై వైకాపా నేతలు కంగారు పడటం అనవసరం.