మీ మెడ‌ల్స్ మీరే వేసుకోండి

కోవిడ్ దెబ్బ‌తో ఎన్నెన్నో మార్పులు. అన్ని రంగాల్లోనూ ఈ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఒలింపిక్స్‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ప్ర‌ముఖుల చేతుల…

కోవిడ్ దెబ్బ‌తో ఎన్నెన్నో మార్పులు. అన్ని రంగాల్లోనూ ఈ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఒలింపిక్స్‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ప్ర‌ముఖుల చేతుల మీదుగా మెడ‌ల్స్ మెడ‌లో వేయించుకోవ‌డం ఓ మ‌ధురానుభూతిగా క్రీడాకారులు భావించేవారు. అయితే కోవిడ్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఒలింపిక్స్ నిర్వాహ‌కులు వినూత్న నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ ద‌ఫా ఒలింపిక్స్ గేమ్స్‌కు టోక్యో ఆతిథ్యం ఇస్తోంది. అక్క‌డ‌ ఇప్ప‌టికే ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఎందుకంటే అక్క‌డ బుధ‌వారం ఒక్క‌రోజే 1149 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. ఆరు నెల‌ల్లో ఇదే అత్య‌ధికం కావ‌డంతో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఒలింపిక్స్ క్రీడా నిర్వాహ‌కులు నిర్ణ‌యించారు.

ఒలింపిక్స్‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన అథ్లెట్స్‌కు ఇక‌పై పోడియం మీద నిల‌బెట్టి మెడ‌లో మెడ‌ల్స్ వేసే సంప్ర‌దాయానికి స్వ‌స్తి ప‌లికారు. ఈ ద‌ఫా ఎవ‌రి మెడ‌ల్స్‌ను వాళ్లే త‌మ మెడ‌ల్లో వేసుకోవాల‌ని నిర్వాహ‌కులు తేల్చి చెప్పారు. అలాగే ఆనందంలో కౌగిలింత‌లు లాంటివి కూడా ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

మెడ‌ల్స్‌ను ట్రేలో పెట్టే ముందు చేతుల‌కు గ్లోవ్స్ వేసుకుంటారు. వాటిని ఇచ్చేవాళ్లు, అథ్లెట్లు కూడా మాస్కులు వేసుకుంటారు. అథ్లెట్ల వ‌ద్ద‌కు ఓ ట్రేలో మెడ‌ల్స్ తీసుకొస్తే.. పోడియంపై ఉన్న అథ్లెట్లు వాటిని తీసుకొని మెడ‌లో వేసుకోవాల్సి వుంటుంది. ఈ విష‌యాల‌న్నీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ అధ్య‌క్షుడు థామ‌స్ బాక్ చెప్పుకొచ్చారు.