ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తంచేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీనీ ఈ రెండేళ్లలోనే అమల్లోకి తీసుకొచ్చామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
“దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాం. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం.”
ఇకపై కూడా సంక్షేమమే లక్ష్యంగా తన ప్రయాణం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అనుక్షణం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తానని అన్నారు.
“ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను.”
రెండేళ్లు పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కరోనా లాంటి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని వీడకుండా, పేదల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిని అంతా మెచ్చుకుంటున్నారు. ''జగన్ అనే నేను'' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.