ఎన్టీఆర్-చంద్రబాబు-జగన్ కు ఎవరు మార్గదర్శి?

ఒక్కో నాయకుడిది ఒక్కో స్టయిల్. మంచో, చెడో ఎవరి తరహా వారిది. అయితే గడచిన తరం నాయకుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం వర్తమాన నాయకులకు వుంటుంది. ఒక్కోసారి గడచిన తరం నాయకులకు వర్తమాన…

ఒక్కో నాయకుడిది ఒక్కో స్టయిల్. మంచో, చెడో ఎవరి తరహా వారిది. అయితే గడచిన తరం నాయకుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం వర్తమాన నాయకులకు వుంటుంది. ఒక్కోసారి గడచిన తరం నాయకులకు వర్తమాన తరం నాయకులకు సారూప్యాలు కనిపిస్తుంటాయి. అంత మాత్రం చేత వారు వీరైపోరు. వీరు వారైపోరు. కానీ ఇదో తరహా యాధృచ్ఛికం అనుకోవాల్సిందే.

ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఎన్టీఆర్ కు, వర్తమాన రాజకీయాల్లో కొత్త సంచలనం గా మారిన వైఎస్ జగన్ కు కొన్ని విషయాల్లో ఇలాంటి సారూప్యాలు కనిపిస్తున్నాయి. ఎవరి ఆశయం ఏదైనా తొమ్మిది నెలల పాటు అవిశ్రాంతంగా ఆంధ్రదేశం అంతా పర్యటించి, జనాలను ఆకట్టుకుని అద్భుతమైన విజయం స్వంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఎంతో మంది కొత్తవారిని, అనామకులను తన క్రేజ్ తో గెలిపించుకున్నారు.

జగన్ కూడా ఇంతే. నెలల తరబడి ఎండనక, వాననక పాదయాత్ర చేసి అఖండ విజయం స్వంతం చేసుకున్నారు. చాలా మంది జగన్ పేరు  మీదే గెలిచారు. సరే, ఈ పర్యటనలు , గెలవడాల సంగతి అలా వుంచితే గెలిచిన తరువాత సంగతి చూద్దాం.

గెలవగానే ఎన్టీఆర్ సంక్షేమ పథకాల బాట నడిచారు. తమిళనాట అమలులో వున్న పథకాలు ఆయనకు దారి చూపించాయి. రెండు రూపాయల బియ్యం, గ్రామీణ క్రాంతి పథం, కర్షక పరిషత్, బిసి లకు పెద్ద పీట వేయడం లాంటివి పలు కార్యక్రమాలు చేపట్టారు. జగన్ కూడా ఇదే విధంగా స్టార్ట్ చేసారు. ఆయన వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు మార్గం చూపాయి. 

పాఠశాలలు, ఆసుపత్రులు నాడు నేడు పేరిట రూపు రేఖలు మార్చారు. ఎన్టీఆర్ గ్రామీణ క్రాంతి పథం విషయంలో పనులు ఆ గ్రామాల జనాలకే వదిలేసారు. జగన్ ఆయా స్కూళ్లు, ఆసుపత్రుల కమిటీలకు వదిలేసారు. కర్షక పరిషత్ టైపులో రైతు భరోసా కేంద్రాల స్టార్ట్ చేసారు. జగన్ కూడా బిసిలకు పెద్ద పీట వేస్తున్నారు.

సరే ఈ పథకాల సంగతికేమి? ఏ సిఎమ్ అయినా ఏవో పథకాలు ప్రవేశపెట్టాల్సిందే. ఇంకేంటీ సారూప్యాలు? వున్నాయి. సినిమా రంగం లో ఎదురులేని హీరోగా వుంటూ వచ్చిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా అలాగే వుండాలనుకున్నారు. తన ఫొటోతో గెలిచిన వారంతా ఆల్ మోస్ట్ ఆయనకు జూనియర్ ఆర్టిస్టులు మాదిరిగా కనిపించారు. పేరుకే మంత్రి వర్గం, పేరుకే ఎమ్మెల్యేలు. ఎన్టీఆర్ దే హవా..ఎన్టీఆర్ దే చరిష్మా.

జగన్ కూడా దాదాపు ఇదే బాటలో వెళ్తున్నారు. ఎమ్మెల్యేలకు నో పవర్స్, మంత్రులకు అంతంతమాత్రం. అన్నింటా ఆయనవే నిర్ణయాలు, ఆయనదే పాలన. రెండున్నరేళ్ల తరువాత మంత్రులను రోటేషన్ పద్దతిలో మార్చేస్తా అన్నారు జగన్. చేస్తారో చేయరో తరువాత సంగతి. ఎన్టీఆర్ కు కోపం రాగానే ఒక్క సంతకంతో మంత్రులందరి చేత రాజీనామాలు చేయించారు.  మద్యపాన నిషేధం వైపు మొగ్గు చూపారు ఎన్టీఆర్. తనదైన స్టయిల్ లో మద్యపాన నిషేధం చేసి చూపిస్తా అంటున్నారు జగన్.

ఎన్టీఆర్ వి ఒక విధంగా ఒంటెద్దు పోకడలే అన్నది స్పష్టం. వాటివల్లే ఆయనకు రెండు సార్లు వెన్నుపోట్లు తప్పలేదు. రెండో సారి వెన్నుపోటులో ఆయనకు సరైన మద్దతు పార్టీ సహచరుల నుంచి లభించకపోవడానికి కారణం కూడా ఎన్టీఆర్ వ్యవహారశైలే. ఎన్టీఆర్ పక్కన వుండడం కన్నా బాబు పక్కన వుండడమే బెటర్ అని ఎమ్మెల్యేలు అనుకోవడానికి కారణం అదే కావచ్చు కూడా.

ఇక్కడే జగన్ పాఠం నేర్చుకోవాల్సింది. వెన్నుపోటు వుంటుందని కాదు.  కానీ జగన్ ను ఎవరైనా వెన్నుపోటు పొడవాలని లేదా, జగన్ ను పక్కకు తప్పిస్తే, పార్టీని చీల్చడం సులువు అవుతుందని కాచుక్కూర్చుని రాజకీయ గోతికాడ నక్కలు అనేకం వుంటాయి. అలాంటి వాటిని కాచుకోవాలి అంటే తన వాళ్లను కాచుకోవడం ముఖ్యం. అందుకోసమైనా తన సహచరుల అభిమానం సదా నిలబెట్టుకోవాల్సి వుంటుంది.  

కానీ ఇక్కడో సమస్య వుంది. ఎన్టీఆర్ లా నియంతమాదిరిగా పార్టీ మీద వ్యవహరిస్తే సరైన సమయంలో ప్లేటు తిరగేసారు. అలా అని చంద్రబాబు ఫుల్ గా పగ్గాలు వదిలేసి, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతే, ఎవరి లెవెల్ లో వారు తినేసారు.జనాల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఇప్పుడు జగన్ ఏం చేయాలి?

పార్టీని ఫుల్ కంట్రోల్ లో వుంచి, మంత్రులను ఎమ్మెల్యేలను అవినీతికి దూరంగా కట్టడి చేసారు. అందువల్లే జగన్ పాలన మీద ఇన్నిన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యతిరేక మీడియా అవినీతి అంటూ యాగీ చేయలేకపోతోంది. కేవలం మద్యం వ్యవహారంలోనే తప్ప, మరే విధంగానూ మాట్లాడలేకపోతోంది. మంత్రుల విషయంలో కానీ, ఎమ్మెల్యేల విషయంలో కానీ చాన్స్ తీసుకోలేకపోతోంది. జగన్ విషయంలో చిన్న పిన్ హోల్ దొరికితే చాలు, ఏకంగా చెరువు తవ్వేయగల సమర్థత, అవసరం, అక్కసు  వున్న బాబుగారి అను'కుల'మీడియా ఈ విషయంలో సైలంట్ గా వుండిపోవడానికి కారణం జగన్ పగ్గాలు గట్టిగా పట్టుకోవడమే.

కానీ దీని వల్ల మైనస్ కూడా లేకపోలేదు. రాజకీయం అంటే మనదేశంలో ఓ మాంచి లాభసాటి వ్యాపారం. ఎంత పెడితే అంతకు అంతా సంపాదించుకోవచ్చు. అది ఏ పార్టీ అయినా సరే. వైకాపా లో కూడా ఇలాంటి రాజకీయ వ్యాపారులకు లోటేం లేదు. కనీసం పది కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు పార్టీ కోసం ఖర్చు చేసిన జనాలు వున్నారు. గడచిన రెండేళ్లలో వీరు రూపాయి సంపాదించుకోలేదు. కక్కలేక, మింగలేక అన్నట్లుంది వీరి పరిస్థితి.

ఇక ప్రజా ప్రతినిధుల సంగతి సరేసరి, తొంభై శాతం మంది పది కోట్లకు పైగానే ఎన్నికల కోసం ఖర్చుచేసారు. మరి రివకరీ? నియోజకవర్గంలో పనులు లేవు. సంపాదన మార్గాలు మూసుకుపోయాయి. సాధారణంగా నియోజకవర్గ పరిధిలో పనులు జరుగుతూ వుంటే ఎమ్మెల్యేలకు లాభసాటిగా వుంటుంది. కానీ జనాలకు కేవలం డబ్బులు పంచుతూ పోతే ఏం వుంటుంది.  పైగా ఈ మధ్య జగన్ మరో పని చేసారు. రోడ్ల మరమ్మతులు అన్నీ గంప గుత్తగా ఎత్తేసి ఒకరిద్దరికే ఇచ్చేసారు. అక్కడా ఏ అవకాశం లేదు. ఇసుక ను కూడా అదే దారి పట్టించారు.

వచ్చే ఎన్నికలకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, తాను చూసుకుంటానని జగన్ పార్టీ జనాలతో చెబుతూ వుంటారు. ఈ మధ్య తిరుపతి ఎన్నికకు డబ్బు ఖర్చుచేయలేదు. నిజమే. కానీ రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలు అలా వుండవు. ఒక మహా సంగ్రామంగా వుండబోతున్నాయి. సకల శక్తులు మోహరిస్తాయి. కోట్లు కుమ్మరించగలిగిన వాడే పోరులో నిల్చోగలడు. సరే అప్పటి సంగతి జగన్ చూసుకుంటారు అనుకుందా. మరి ఇప్పటికే ఖర్చు చేసి, ఖాళీ కంచాలు ముందు వేసుకుని కూర్చున్న వారి సంగతి.

రాజకీయాలు అంటే డబ్బు సంపాదన కాదు కదా, జగన్ అవినీతి ప్రోత్సహించాలా? అని అడిగేయడం సులువు. కానీ నడిపితే తెలుస్తుంది యవ్వారం. పోనీ డబ్బు సంపాదన సంగతి అలా వుంచుదాం. కనీసం కానిస్టేబుల్ బదిలీ కూడా తమ వల్ల కాకపోతే ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? ఇలా చాలా మందికి చాలా విధాలైన అసంతృప్తి వుంది. అది పచ్చి నిజం.

కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. జగన్ కు వచ్చిన సమస్యలు లేవు. జగన్ ను ఇప్పటికిప్పుడు ఢీకొట్టి చేసేది, సాధించేది లేదు.అందుకే ఎవరికి వారు మౌనంగా వున్నారు. కానీ ఎన్నికల వేళకు ఇలా  వుండదు పరిస్థితి. లేదా మధ్యలో ఏమైనా తేడా వచ్చినా ఇలా వుండదు వ్యవహారం.

అందుకే జగన్ ఆలోచించాల్సి వుంది. మొండి వాడు రాజుకున్నా, జగన్ అనే వాడు మొండివాడి కన్నా బలవంతుడు అయితే కావచ్చు. కానీ రాజకీయాల్లో మహా మహులు కూడా దెబ్బతిన్న సందర్భాలు వున్నాయి. ఈ విషయాన్ని జగన్ పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రజా బలం వుంటుంది. మననేం చేస్తారు అన్నది అతి ధీమానే? ఎన్టీఆర్ కు కూడా ప్రజాబలం వుంది.కానీ బాబు వెన్నుపోటు పొడిస్తే ఏ జనం వెంట నడిచారు? అంతకు కొన్నేళ్లు ముందే ఎన్టీఆర్ పై చూపించిన అభిమానం ఎక్కడికి పోయింది. రెండు రూపాయల కిలో బియ్యం అందుకున్న కృతజ్ఞత ఏమైపోయింది. ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఇచ్చిన అన్న వరం ఏమయింది. ఇవన్నీ కలిసి ఎన్టీఆర్ ను ఆదుకోలేకపోయాయి.

బాబు మీడియా మేనేజ్ మెంట్ ముందు, వ్యవస్థల మేనేజ్ మెంట్ ముందు అన్నీ వెలవెలబోయాయి. ఈ విషయంలో బాబు టాలెంట్ ను, ఆయనకు వున్న మీడియా బలాన్ని, ఆయనకు మాత్రమయ్యే  టక్కు టమార విద్యలను జగన్ తక్కువ అంచనా వేయడానికి లేదు.

ఇలాంటి నేపథ్యంలో జగన్ ఎంచుకోవాల్సింది? ఎన్టీఆర్ మార్గమా? బాబు మార్గమా? లేక ఈ రెండింటికి మధ్యేమార్గమా? దీనికి జవాబు అంత సులువు కాదు. చాలా రాజకీయ చతురత కావాలి. అదృష్టం సదా వెన్నెంటి వుండాలి. లేదూ అంటే జేజేలు పలికిన నోళ్లే విమర్శలు కురిపిస్తాయి. 2014 నుంచి 2019 మధ్యలో ఇలాంటివి జగన్ కు అనుభవమే. 

అందువల్ల ఏ విధంగా జగన్ ముందుకు వెళ్లబోతున్నారన్నది ఆసక్తికరం. కనీసపు జాగ్రత్తలు తీసుకోవడం, పార్టీ జనాలను అభిమానంతో తన దగ్గర వుండేలా చూసుకోగలగడం ముఖ్యం. చూడాలి రాబోయే మూడేళ్లు ఎలా గడుస్తాయో?

చాణక్య