వైఎస్ జగన్మోహనరెడ్డి రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలు అత్యంత సానుకూల అంశంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. పాదయాత్రలో ప్రచారానికి ప్రజల ఆమోదానికి ప్రధాన అస్త్రంగా పెట్టుకున్న నవరత్నాలనే సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ తన నిబద్దతకు కొలబద్దలుగా ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నం చేస్తున్నా రు.
వారంలో ప్రతిరోజూ ఏదో ఒక పథకానికి నిధుల విడుదల దానిగురించి వివరించడం, గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావించడం ఒక ఫార్ములాగా చేసుకున్నారు. అయితే సహజంగానే సానుకూల అంశాలకు తోడు సవాళ్లు సమస్య లు సవాళ్లు కొనసాగుతూనే వున్నాయి. ఉదాహరణకు సరిగ్గా ఈ రెండేళ్ల పూర్తి సందర్భంలోనే తెలుగుదేశం వర్చ్యువల్ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారీ టెర్రరిజం పెరిగిపోయిందని ఆరోపించడం ఇందుకో ఉదాహరణ. ఈ రెండింటి మధ్యలోనే జగన్ ప్రభుత్వ పనితీరును ఫలితాలను సమీక్షించవలసి వుంటుంది.
రాజకీయ మార్పు
మొదటగా వైసీపీ నూటయాభై స్థానాలకు పైగాతెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏపీలో కొత్త రాజకీయ పరిస్థి తిని ఆవిష్కరించింది.ఉమ్మడి ఏపీని లేదా విభజిత ఏపీని కాంగ్రెస్ తెలుగుదేశం మాత్రమే పాలించాయి. అలాటిది ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడి పదేళ్లలోనే అత్యధిక మెజార్టి తో అధికారానికి రావడం దేశంలో కూడా బలాబలాల పొం దికపై ప్రభావం చూపించే అంశమైంది. కొన్ని ఇతర రాష్ట్రాల లోవలె ఏపీలో రెండుప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ సమరం కేంద్రీకృతమైంది.
చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డి పరస్పర ప్రత్యర్థులుగా పోరాడిన నేపథ్యంలో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన వైఎస్ కుమారుడు విజయం సాధించడం వయస్సుల రీత్యా కొత్త వాతావరణాన్ని ప్రతిబింబించింది. జగన్‌పై సిబిఐ కేసులు ఆయనను 16 మాసాలు జైలులో వుంచడంపై టీడీపీ విమర్శ కేంద్రీకృతమైనా ప్రజలు ఆయ నను ఎన్నుకోవడం ఇప్పటికీ టీడీపీ జీర్ణించుకోలేని విషయం గానే వుంది.
జగన్‌ను ఫేక్ ముఖ్యమంత్రి అని పదేపదే అపహాస్యం చేయడం గతంలో ఎవరి విషయంలోనూ చూడని విపరీతం. అంతేగాక ఈ కాలంలో చాలా సార్లు జగన్ జైలుకు వెళతారనీ, ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగదనీ ప్రధానప్రతిపక్షం, కొన్ని మీడియా సోషల్ మీడియాసంస్థలు ప్రచారం చేస్తూ వచ్చాయి.
ఉన్నత న్యాయస్థానాలలో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడల్లా ఉనికికే ముప్పు వచ్చిందన్న దుమారం నడిచింది. అవేవీ నిజం కాకపోగా ముఖ్యమంత్రి తన అధికారాన్ని బలంగానే స్థిరపర్చుకోవడం గమనించదగ్గ విషయం. గతంలో ప్రకటించిన ప్రకారం మరో ఆరు మాసాలలో ఆయన మంత్రివర్గాన్నిదాదాపు పూర్తిగా మార్చేస్తే అంతర్గతంగా ఆయన పట్టు మరింత పెరుగుతుంది.
నవరత్న ఖచితమే, సమస్యలూ సత్యమే
ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన నవరత్నాలే తన పరిపాలనకు దిక్సూచి అని ముఖ్యమంత్రి జగన్ నిరంతరం ప్రకటిస్తున్నారు. ఆయన మంత్రులు పార్టీ నేతలు కూడా అదే అంటున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యాదీవెన ఈ పథకాల కింద ఏటా దాదాపు 90 వేల కోట్ల రూపాయలకు పైగా నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేసినట్టు బడ్జెట్ లోనూ చెప్పారు. ఇవి గాక ఇతర ప్రభుత్వ పథకాలు కొన్ని అమలవుతుంటాయి గనక లక్ష కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి బదలాయింపబడుతున్నాయని భావించవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సమస్యలు జీవన వ్యయం పెరుగుదల తాజా గా కరోనా విలయతాండవం మధ్య ఇది ప్రజలకు ఉపశమ నం కలిగించే అంశమే. లోపాలున్నా పథకాలకు కట్టుబడివున్నామనే సందేశాన్ని ప్రభుత్వం జయప్రదంగా తీసుకువెళ్లగలిగింది. ఈ పథకాల అమలులో లోపాలు కూడా వున్నాయి.పలు సందర్భాలలో అర్హులందరికీ అందకపోవడం, అనర్హులకు అందడం, లబ్ధిదారుల జాబితాను కుదించడం కోసం రకరకాల ఆంక్షలు తీసుకురావడం జరుగుతూనే వుంటుంది. రేషన్‌కార్డుల విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.
రైతులలో కౌలు రైతులు 34 లక్షల మంది వుంటే లక్షన్నర మందికే సహాయం అందుతున్నది. రైతు భరోసా కేంద్రాలలో దాన్యం కొనుగోలులో మిల్లర్లు రకరకాల గారడీలతో గిట్టుబాటు ధరకు గండి కొడితే సరిచేయడానికి చాలాసమయం పట్టింది. ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయిస్తే తాజా బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే వుంది. రాష్ర్టంలో వ్యవసాయ రంగమే కొంచెం మెరుగ్గా అభివృద్ది సాధిస్తున్న పరిస్తితులలో ఆ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానాలు కేటాయింపులు పాక్షికంగానే వుంటున్నాయి.అధిక ధరలు ,వుద్యోగాల లేమి, మద్యం అమ్మకాలు వంటివి సమస్యాత్మకంగానే వున్నాయి.
అప్పుల భారం, అతి అంచనాలు
ఈ పథకాలు అమలు చేయడానికి అవసరమైన ఆర్థికశక్తి వుందా అనేది మరో సమస్య.మనం అంచనాలకు మించి అప్పు చేస్తున్నాం.అందుకు కేంద్రం అనుమతి పొందడం కోసం వారి పథకాలను నెత్తినెత్తుకుని ప్రజలపై చెత్తపన్ను విద్యుత్భారాలు వ్యవసాయ మీటర్లు వంటివి తెచ్చిపెడుతు న్నాం. ఇప్పటికే రాష్ట్రం 3లక్షల యాభై అయిదు వేల కోట్ల అప్పులో వుండగా మరో యాభై వేల కోట్లు అప్పు తేవాలని బడ్జెట్ ప్రతిపాదించారు, వడ్డీలేక 23 వేల కోట్లు కట్టాల్సి వస్తున్నది. పారిశ్రామిక సేవా రంగాలలో అభివృద్ధిలేదు.
జాతీయ అభివృద్దిరేటు ఎనిమిది శాతం పడిపోగా మనం రెండు శాతం అభివృద్ధిరేటు కలిగివుండటమే గొప్ప విషయంగా ఆర్థిక మంత్రి చెబుతున్నారు కాని , 2020-21లోపన్ను ఆదాయం 300 కోట్లు పడిపోగా ఖర్చు 1వేలకోట్లుపెరిగింది. కాని కేంద్రం నుంచి వచ్చేదాంతో కలిసి ఈ ఏడాది 54వేల కోట్లు అదనంగా సమకూరుతుం దని వేసిన లెక్క అతిశయోక్తి మాత్రమే.వాస్తవానికి కేంద్రం నుంచి అదనపు సాయంరాకపోగా రావలసినదే 4 శాతం లేదా 9వేల కోట్లు తగ్గిపోయింది.కనుక ఏదో అదనపు ఆదాయం వచ్చేస్తుందని ఆశించడానికి ఆధారమే లేదు.
కేంద్రాన్ని గట్టిగా అడిగేకళ కనిపించడంలేదు. వనరుల కోసం ప్రభుత్వ స్థలాలను బిల్డ్ ఏపీ పేరుతో అమ్మకానికి పెట్టవలసి వస్తుంది. 17 అభివృద్ది అంశాలపై శ్రద్దపెట్టినట్టు చెబుతున్నా సంక్షేమ పథకాలతో పోలిస్తే దీర్ఘకాలిక సమగ్రాభి వృద్ధిపై దృష్టి కొరవడింది.ఇప్పుడు 16 వేల కోట్ల పెట్టుబడు లు వస్తున్నాయని చెబుతున్నారు గాని అవి ఆచరణలోకి రావాలి. నవరత్నాలే తారకమంత్రం అన్న భావన నుంచి బయిటపడి రాష్ర్ట సమగ్రాభివృద్ధికి ప్రత్యామ్నాయ వనరుల సమీకరణకు చర్యలు చేపట్టడం, ఉద్యోగులు చిరుద్యోగులు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ తదితరులను ఆదుకోవడం ముఖ్యం.
రాజధాని ప్రతిష్టంభన,రాజకీయ వివాదాలు
వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం అనవసరంగాతెచ్చిపెట్టిన మూడు రాజధానుల ప్రతిష్టంభన రెండో సంవత్సరమంతా కొనసాగింది. హైకోర్టు విచారణ 2021 చివరి వరకూకొన సాగి ఆ పైన సుప్రీం కోర్టులో అప్పీలు వంటివి లెక్కలోకి తీసుకుంటే మూడేళ్లు పూర్తి కావచ్చు.విశాఖకు ఇదిగో అదిగో తరలింపు అంటూ వూరిస్తూనే వాస్తవంలో అడుగేయడానికి వెనకాడక తప్పని పరిస్థితి. ఇప్పుడు కొత్తరాజధానికి 500 కోట్లు కేటాయింపు అంటే అది దేనికి ఎంత వెచ్చిస్తారో కూడా అర్థం కాని అయోమయం.అన్ని పార్టీలూ ఆంగీకరించిన హైకోర్టు తరలింపు దిశలో అడుగులు పడకపోవడం విచిత్రం.
తప్పులపై చర్యలు తీసుకోవచ్చు గాని ఆ పేరుతో ఆకస్మిక టీడీపీ నేతల అరెస్టులు,ఆక్రమణల పేరిట అనుమతి లేదనే పేరిట కూల్చివేతలుఒక నిరంతర తతంగంగా మారా యి. పోలీసులు అధికార పక్షం చెప్పినట్టే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిరంతరమయ్యాయి.హైకోర్టు ఎడతెగని కేసులతో ఒక రాజకీయ రణక్షేత్రంగా మారింది. పత్రికలు ఛానల్స్ కూడా రాజకీయంగా రెండు శిబిరాలుగా మారిపోవడం, సోషల్ మీడియాలో ఇరు పక్షాల ప్రాయోజిక శక్తుల ప్రకో పాలు కలసి ఆడియో విజ్యువల్ వార్‌గా మారుతున్నది.
ప్రమాణ స్వీకారంవేదిక నుంచే ముఖ్యమంత్రి జగన్ తన ప్రతికూల మీడియాపై పేర్లతో సహా ధ్వజమెత్తిన తీరు నానాట తీవ్రమవుతున్నదే గాని మార్పు లేదు. ఎంపి రఘురామకృష్ణం రాజు అరెస్టు ఉదంతం వీటన్నిటికీ అద్దం పట్టేలా తయారైంది. మీడియాస్వేచ్చపట్ల ప్రభుత్వం సంయమ నంలోపించడం ఒకటైతే కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షం గా కథనాలు గుప్పించడం కూడా వాతావరణం కలుషితం చేస్తున్నది. ఆలయాలపై దాడుల పేరిట మతవివాదాలు రెచ్చగొట్టడానికి బిజెపి జనసేన చేసిన ప్రయత్నాలను టీడీపీ దూకుడును ప్రజలు ఆమోదించలేదు కాని ఇప్పటికీ రాష్ర్టంలో కుల మత బాషలోనే వివాదాలు నడుస్తున్నాయి. సినీయర్ నేతలు కొందరు మంత్రులు కూడా అసభ్య భాషలో మాట్లాడటం దుర్భరంగా సాగుతున్నది.
కరోనా సవాలు, కేంద్రంపై ఒత్తిడి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తాకిడిలోనూ ఏపీలో వివాదాలకు తెరిపిలేకపోవడం విపరీత పరిణామమే. టీడీపీ కూడా రాజకీయంగా ఎదుర్కొవడం ప్రజల సమస్యలపై ఉద్యమించడం, గతంలో తప్పులనూ గుర్తించడం జరగాలి తప్ప ఈ సర్కారు ఉనికినే సహించలేనట్టు ముఖ్యమంత్రినే ఫేక్‌గా భావించడం అవాస్తవికతే అవుతుంది.
రాష్ట్రంలో అంతా అరాచకమేనని చిత్రించడం ప్రజలు ఎలా తీసుకుం టారో కూడా చూడాలి. చివరగా జగన్ ప్రభుత్వం సాధా రణ పథకాలతో పాటు కరోనా నిరోధానికి బాధితుల సహాయానికి చికిత్సకు ప్రత్యేకచర్యలు తీసుకోవడం తక్షణఅవసరం. నాడు నేడు పేరుతో బళ్లను బాగా అభివృద్ధి చేశారు గాని కరోనా తాకిడికి అవి జరిగే పరిస్తితి లేకపోవడం ఇందుకో ఉదాహరణ.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో సహా కేంద్రం ప్రతికూల చర్యలే తీసుకుంటున్నప్పుడు బిజెపి రాజకీయంగా దాగుడు మూతలు ఆడుతున్నప్పుడు వారినే నిరంతరం బలపరుస్తూ పోవడం అర్థం లేని విషయం. మూడో ఏడాదిలోనైనా ముఖ్యమంత్రి జగన్ రాష్ర్టం హక్కుల కోసం అందరినీ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవడం అవసరం.విభజన సమస్యలు పోలవరం నిధుల వంటివి కూడా సమస్యగా వున్నాయి. రెండేళ్ల తీరును సమీక్షించుకుని తప్పొప్పులు సరిచేసుకుంటే మిగిలిన మూడేళ్ల కాలంలో మరిన్ని మంచిఫలితాలు అందించడం సాధ్యమవుతుంది.