నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కాళ్లు వాచిపోయేలా పోలీసులు కొట్టారని ముఖ్యంగా టీడీపీ నేతలు , ఆయన అను కూల చానళ్ల ప్రతినిధులు తెగ బాధపడిపోతున్నారు. చివరికి హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు మాత్రం గాయాలున్నాయనేందుకు ఆధారాలు లేవని, కాళ్లలో నీరు చేరడం వల్లే ..కాళ్లు రంగు మారి కనిపిస్తున్నాయని తేల్చి చెప్పింది. ఎక్కువ సేపు కూర్చున్నా, ప్రయాణిం చినా కాళ్లు రంగు మారుతాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ నేతృత్వం లోని మెడికల్ బోర్డు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
ఎంపీనే కాదు, ఎవరిని కొట్టినా చట్ట ప్రకారం నేరమే. ఎంపీ ఒంటిపై గాయాలున్నాయని, బాగా కొట్టారని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇటు కుటుంబం, అటు టీడీపీ, ఎల్లో మీడియా పదేపదే రఘురామకృష్ణంరాజు కాళ్ల గాయాల గురించి ఫొటోలు చూపుతూ… జరగరానిదేదో జరిగిందని తీవ్ర ఆగ్రహం, ఆక్కోశం వెళ్లగక్కుతూనే ఉన్నాయి.
ఎంతసేపూ రఘురామ కృష్ణంరాజు కాళ్లకు అయిన గాయం గురించే ఆలోచిస్తున్నారే తప్ప, ఆయన కొంత మంది మనసులకు చేసిన గాయాలను విస్మరిస్తున్నారు. ఎందుకంటే ఈ తప్పుడు పనిలో తాము కూడా భాగస్వామ్యం వహించాల్సి ఉంటుంది కాబట్టి, ఆ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.
శారీరక గాయాలను కాలం మాన్పిస్తుంది. కానీ మనసుకు అయ్యే గాయాలు ఎప్పటికీ మానిపోవు. ఇదే అత్యంత ప్రమాదకరమైంది. మనం ఎదుటి వాళ్లకు మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ, చెడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే చెడు చేసిన సంగతిని తాను మరిచిపోవచ్చు. దాని వల్ల నష్టపోయిన వారెవరూ ఎప్పటికీ మరిచిపోరు. మనసును గాయపరిస్తే అది జీవితాం తం నీడలా వెంటాడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించిన వారెవరైనా ఇతరులకు నష్టం కలిగించే పని చేయరు.
శుక్రవారం రాత్రి తన కాళ్లను తాళ్లతో కట్టేసి కొందరు ముసుగేసుకుని చితకబాదారని వాపోతున్న రఘురామకృష్ణంరాజు … ఈ దుస్థితికి కారణం ఏంటో ఇప్పటికైనా కనీసం తన అంతరాత్మకు సమాధానం చెప్పుకున్నారా? నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చి, గెలిపించి, సమాజంలో ప్రజాప్రతినిధిగా గుర్తింపు, గౌరవం పొందడానికి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
అలాంటి నేతను పట్టుకుని నీచంగా దూషించడం సంస్కారమేనా? అలాగే సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడితే …అది మానసిక దాడి చేయడం కాదా? ఆ దూషణలు చేసిన మానసిక గాయాల తీవ్రత ఎంతో మీరెంతో ఇష్టపడే రమేశ్ ఆస్పత్రి వైద్యులేమైనా తేల్చగలరా?
జగన్‌ను, సజ్జలను అభిమానించే లక్షలాది మంది పార్టీ శ్రేణుల మనసులను గాయపరుస్తున్న స్పృహ రఘురామకృష్ణంరాజులో ఎందుకు కొరవడింది. గత కొంత కాలంగా రఘురామకృష్ణంరాజు ప్రవర్తన … చివరికి ఆయన్ను ఎన్నుకున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడేలా ఉందని చెబుతున్నారు. కనీసం తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు ఏం సాధించినట్టు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపై రఘురామకృష్ణంరాజు నోటికి అడ్డూఅదుపూ లేకుండా పత్రికల్లో రాయడానికి వీల్లేని, చానల్స్‌లో బీప్ సౌండ్ వేసుకోవాల్సిన దుస్థితి. ఇంతకంటే ఆయన అసభ్య పదజాలం వాడారని చెప్పడానికి నిదర్శనం ఏం కావాలి? ఇదే టీడీపీ , ఎల్లో మీడియా చెబుతున్న భావప్రకటనా స్వేచ్ఛకు అర్థం? ఇదేనా నచ్చని నేతలపై విమర్శించే హక్కు అంటే? ఈ స్వేచ్ఛ కోసమేనా తమరి పోరాటాలు, ఆరాటాలు?
తాము మాత్రం ప్రత్యర్థులను ఏమైనా తిట్టొచ్చు, మానసికంగా దాడి చేయొచ్చు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అన్నింటిని భరిస్తూ, చేతులు కట్టుకుని, నోర్మూసుకుని కూచ్చోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలను నరికేస్తామని లైవ్‌లో చెబితే, ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలకు తమ చానల్ వేదిక కాదని చెప్పడానికి నోరు రాని వారంతా ఈ రోజు ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ అంటూ రంకెలేయడం విచిత్రంగా, విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డాక్టర్ వైఎస్సార్ కాపు అయితే, మరి ఆయన తనయుడు రెడ్డి ఎలా అవుతాడని ప్రశ్నించడాన్ని అహంకారం అనాలా? వినాశ కాలంలో వచ్చే విపరీత ధోరణులని అర్థం చేసుకోవాలా? అలాగే రెడ్లు, క్రిస్టియన్, దళిత సామాజిక వర్గాలపై అవాకులు చెవాకులు పేలి వారి మనసులను గాయపరిచిన నేరం కింద ఏ శిక్ష విధించవచ్చో న్యాయకోవిదులు తేల్చి చెప్పాల్సి ఉంది.
ఈ రోజు రఘురా మకృష్ణంరాజు జైలుపాలైనా, కొట్టారనే ప్రచారం జరుగుతున్నా ….పౌర సమాజం నుంచి కనీస సానుభూతి రాకపోగా, తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటే … ఇంతకంటే ఒక మనిషికి ఇంకేం శిక్ష కావాలి? అందుకే రఘురామకృష్ణం రాజు గాయాల గురించి రచ్చ చేసే వాళ్లు …. ఆయన చేసిన మానసిక గాయాల గురించి గుర్తు పెట్టుకుంటే మంచిది.
సొదుం రమణ