మళ్లీ ఎన్టీఆర్ జెండా ఎగిరితే ఏం చేస్తావ్ బాబూ!

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగారు. ఓ వైపు ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనిపించినా చూసీచూడనట్టు జారుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు వినిపించినా చెవిన పడనట్టే వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి…

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగారు. ఓ వైపు ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనిపించినా చూసీచూడనట్టు జారుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు వినిపించినా చెవిన పడనట్టే వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తప్పించుకునేలా లేదు. ఈసారి చంద్రబాబు, ఎన్టీఆర్ పై క్లారిటీ ఇవ్వాల్సిందే. 

తెలుగుదేశం పార్టీకి, తారక్ కు ఉన్న సంబంధం గురించి మాట్లాడాల్సిందే. ఎందుకంటే, కుప్పంతో చంద్రబాబు పరిస్థితే అటుఇటుగా ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన బాబు, ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ కుప్పంలో తన ప్రభావం చూపించలేకపోయారు.

ఇప్పుడు ఎన్టీఆర్ విషయంపై స్పందించకపోతే, భవిష్యత్తులో కుప్పంపై ఆశ వదులుకోవాల్సిందే. కేవలం కుప్పం అనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్టీఆర్ నినాదం వినిపిస్తోంది. కుప్పం వేదికగా చంద్రబాబు ఓ ప్రకటన ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ క్యాడర్ కు ఓ సందేశం ఇచ్చినట్టవుతుంది. లేదంటే రాబోయే రోజల్లో అచ్చెన్నాయుడిలా కార్యకర్తలు కూడా పార్టీ లేదు బొక్కా లేదు అంటారు.

ఈరోజు, రేపు చంద్రబాబు కుప్పంలోనే ఉంటారు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో చంద్రబాబు వెళ్లగా జై ఎన్టీఆర్ నినాదాలు వినిపించాయి. వాటిని పట్టించుకోని బాబు చక్కా వచ్చేశారు. 

కట్ చేస్తే.. ఆ తర్వాత  టీడీపీ జెండా దిమ్మెపై ఎన్టీఆర్ బొమ్మ ఎగిరింది. అది కూడా పట్టించుకోనట్టే ఉన్నారు. ఆ తర్వాత ఫలితం అనుభవించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలంలోనే బాబుకి చుక్కెదురైంది. ఆ పరాభవం తర్వాత ఆయన తొలిసారిగా కుప్పం వెళ్తున్నారు. మరి ఈసారి నినాదాలు, జెండాలు రెండూ ఒకేసారి ఎదురైతే బాబు ఏం చేస్తారో చూడాలి.

కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారంటే అదో లెక్క, కానీ కుప్పంలో చంద్రబాబు ఉన్నప్పటికీ.. మరోవైపు ఎన్టీఆర్ కి మాత్రమే జై కొట్టే అభిమానులున్నారంటే ఆలోచించాల్సిన విషయమే. అందులోనూ వారు భయపడేవారు కాదు, దాక్కునేవారు కాదు. 

నేరుగా బాబు ముందే ఎన్టీఆర్ కి జేజేలు పలికే రకం. అందుకే బాబు భయపడుతున్నారు. భయం భయంగానే కుప్పంలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు వెనకడుగేసినా 2024 నాటికి మరోసారి మొహం చూపించాల్సిందే అనే లెక్కలో ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

గతంలో కనీసం నామినేషన్ వేసేందుకు సైతం చంద్రబాబు కుప్పం వెళ్లేవారు కాదు. అలాంటిది ఈ దఫా కచ్చితంగా నామినేషన్ తోపాటు ఎన్నికల ప్రచారం చేయాల్సిన పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది. 

బాబు కంచుకోటలో వైసీపీ అభ్యర్థులు జెండా ఎగరేశారు. ఇటు ఎన్టీఆర్ తలనొప్పి ఉండనే ఉంది. ఈ టైమ్ లో చంద్రబాబు ముందుగానే ఎన్టీఆర్ పేరు జపిస్తున్న కార్యకర్తల్ని బుజ్జగించే అవకాశం ఉంది. అలా 2024 నాటికి తనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవాలనుకుంటున్నారు.