ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన పవన్ కల్యాణ్ ఇప్పుడు మరోసారి జన బాహుళ్యంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనసేన కార్యాచరణ సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా నుంచి జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుందని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
నిజానికి ఎన్నికల ప్రాసెస్ ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జనాల్లోకి రావాలనుకున్నారు పవన్. కానీ అప్పట్లో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాబు నుంచి విడిపోయి (పైకి మాత్రమే) బీజేపీతో జతకట్టారు పవన్. జనసేన-బీజేపీ కలిసిన వెంటనే ఈ రెండు పార్టీలు సంయుక్తంగా రోడ్డెక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ అప్పట్లో బాబు మనిషి కన్నా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండడం.. కరోనా తదితర పరిస్థితుల వల్ల పవన్ కు అవకాశం చిక్కలేదు.
ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నరకు పవన్ కు ఆ అవకాశం రానే వచ్చింది. సోము వీర్రాజు రాకతో పవన్ తన ప్రణాళికను మరోసారి బయటకు తీశారు. జనం మధ్యలోకి వెళ్లి పొలిటికల్ మైలేజీ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ జనాల్లోకి వెళ్లిన పవన్ ఏం మాట్లాడతారు..?
ఎన్నికల సమయంలో పూర్తిగా జగన్ ను తిట్టడానికే తన ప్రచారం మొత్తాన్ని కేటాయించారు పవన్. చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇప్పుడు కూడా అదే పంథాను ఆయన కొనసాగిస్తారేమో చూడాలి. అదే కనుక జరిగితే జనాల మధ్య, జనాల చేత ఆయన ఛీత్కారాలు ఎదుర్కోవడం మినహా మరే ఉపయోగం ఉండదు.
ఇక నివృత్తి కావాల్సిన మరో సందేహం ఇంకోటి ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు చంద్రబాబును ఇప్పటివరకు పల్లెత్తు మాట అనని పవన్ కల్యాణ్.. ఇప్పుడు బాబును విమర్శిస్తారా, లేక సైలెంట్ గా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు, బాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కూడా బాబును ఇప్పుడు చెడుగుడు ఆడాల్సిందే. ఆ ముచ్చట తీరుతుందా లేదా అనేది చూడాలి.
మొత్తమ్మీద పవన్ ఎట్టకేలకు తన అజ్ఞాతవాసం వీడి జనం మధ్యలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇకపై పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఆయన కృషి చేస్తారట. అంతేకాదు.. పార్లమెంట్ నియోజకవర్గాల్ని కేంద్రాలుగా చేసుకొని పార్టీ ఆఫీసులు కూడా తెరుస్తారట. ప్రతి ఆఫీస్ లో అవసరమైన సిబ్బంది తో పాటు సోషల్ మీడియా ఇంచార్జీల్ని నియమిస్తారట.