వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి ఇకపై నగదు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షాల విమర్శలను పక్కనపెట్టినా.. రైతుల్లో సవాలక్ష సందేహాలున్నాయి. ఈ సందేహాలు తీర్చకుండానే ప్రభుత్వం హడావిడిగా నిర్ణయం తీసుకోవడం, దాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం, అన్నీ జరిగిపోయాయి. అయితే ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చే విషయంలో నేతల ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఇబ్బంది పడతారని, ఉచిత విద్యుత్ ఆగిపోతుందని, ప్రభుత్వ ఆలస్యం చేస్తే రైతులే కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందని, లేకపోతే కరెంట్ ఆగిపోతుందని సవాలక్ష సందేహాలు లేవనెత్తి దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాయి ప్రతిపక్షాలు.
ప్రభుత్వం తరపున ముఖ్య నాయకులు ఇస్తున్న వివరణలతో రైతులు సంతృప్తి చెందడంలేదనే మాట వాస్తవం. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వివరణలో కేంద్రం ఒత్తిడితో రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే విషయం బైటపడింది. తప్పంతా కేంద్రంపై నెట్టాలని చూశారంటే.. అందులో ఎంతో కొంత తప్పు జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది.
కొడాలి నాని నగదు బదిలీ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి.. సంబంధం లేకుండా చంద్రబాబుని చెడామడా తిట్టేసి ఊరుకున్నారు. ఇక విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కానీ, మా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదు అని భరోసా ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ మీడియా కూడా ఈ విషయాలపై సమగ్ర అవగాహన కల్పించడంలో విఫలమైంది.
దీంతో ప్రతిరోజూ నగదు బదిలీపై వివరణ ఇచ్చుకుంటూ ఫుల్ పేజీ ప్రకటనలు విడుదల చేయాల్సి వస్తోంది. ఒకరోజు ఇచ్చారంటే సరే, వరుసగా రెండోరోజు కూడా ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందంటే.. దీనివల్ల ఏదో ఇబ్బంది జరగబోతోందనే సందేహం రైతుల్లో బలంగా నాటుకుపోయే అవకాశం ఉంది. చేతులు కాలకముందే ప్రభుత్వం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వీలైతే రైతు సంఘాల నేతలతో మాట్లాడాలి, వారితో ప్రెస్ మీట్ పెట్టించాలి. ఎక్కడికక్కడ స్థానిక నేతలు రైతులతో మమేకమై వారి సందేహాలు నివృత్తి చేయాలి. ఇలా ప్రకటనలతో కాలం సరిపెడితే అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది.