పెగాసస్ సాఫ్ట్‌వేర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం సదరు సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని విమర్శించిన వ్యక్తి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. పైగా ఆమె పేర్కొన్న కాలంలో చంద్రబాబు, మమతాబెనర్జీ రాజకీయంగా సన్నిహితంగా మెలిగేవారు. ప్రధాని మోదీని గద్దె దింపేందుకు దేశ వ్యాప్తంగా ఇద్దరూ కలియతిరగడం అందరికీ తెలిసిందే.
గతంలో తమ ఫోన్లను చంద్రబాబు ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించడంతో పాటు న్యాయస్థానంలో కేసు కూడా వేశారు. ఒకానొక సందర్భంలో బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు మాట్లాడుతూ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ చేసి ఓ టీడీపీ నాయకుడితో ఎక్కువగా మాట్లాడుతున్నావని చెప్పారన్నారు. అప్పటి నుంచి సదరు నాయకుడు, తాను మరో ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పడం తెలిసిందే.
టీడీపీ నాయకుడితో సోము వీర్రాజు మాట్లాడే విషయాలు ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలా తెలిసింది? నాడు ప్రతిపక్షాలు ఆందోళన చెందినట్టు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు ఇంతకంటే నిదర్శనం కావాలా?
అసలు నిజాలు ఇలా వుంటే… ఏబీ వెంకటేశ్వరావు మీడియా ముందుకొచ్చి తాజాగా మాట్లాడిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే…
‘పెగాసస్ అనే స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను నిఘా విభాగం అధిపతిగా నేను ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగానీ, ప్రైవేటు సంస్థ కానీ కొనుగోలు చేయలేదు. రాష్ట్రంలో 2019 మే వరకూ ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఏదీ ఉపయోగించలేదని వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్పష్టతని ఇస్తున్నాను’ అని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
అసలు వివాదానికి మూల కారణమే ఏబీ వెంకటేశ్వరరావు అని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతోంది. తననెందుకు సస్పెండ్ చేశారో ఏబీవీ చెబితే… ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్‌గా ఉండి, వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వడం ఏంటి? గతంలో చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తన పనులతో పాటు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకోవడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు చేయడం తెలిసిందే. అందరిపై నిఘా పెట్టి, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించి, ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చిన ఘనత ఎవరిదో తాను చెబితేనే జనానికి తెలిసిందా అనే విషయమై ఏబీ ఆలోచిస్తే మంచిది.
పెగాసస్ వ్యవహారంపై తప్పు చేయనప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు భుజాలు తడుముకోవాల్సిన పనిలేదనే వాదన వినిపిస్తోంది. పెగాసస్ వ్యవహారంపై ఏబీ వ్యక్తిగత భరోసా ఇవ్వడం బరితెగింపే అని వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఫోన్లలోకి పెగాసస్ ప్రవేశించిందా? లేదా? అనే అభద్రతా భావాన్ని తొలగించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమే తప్ప తాను కాదని ఏబీ వెంకటేశ్వర రావుకు తెలియదా? ఈ వ్యవహారంపై ఆగమేఘాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏబీకి ఏమొచ్చింది? అందులోనూ స్వయంగా తానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదంపై ఏబీ మాట్లాడ్డం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.