మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ విషయంలో మరెవరూ సాటి రారనే చెప్పాలి. స్థాయి దిగజార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు వుండరని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందుకు భిన్నం.
ఇక్కడ అంత ఉన్నత విలువలు, సంప్రదాయాలతో రాజకీయాలు నడిపే వారెవరూ లేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏ మాత్రం హూందాగా ప్రవర్తించినా ఏపీ రాజకీయాలు ఇంత అధ్వానంగా వుండేవి కావనే అభిప్రాయాలున్నాయి.
ఏపీలో చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి ఎవరని అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా వైఎస్ జగన్ అని చిన్నపిల్లాడైనా చెబుతాడు. చంద్రబాబుకు శత్రువు ఎవరని అడిగితే కూడా అదే సమాధానం వస్తుంది. కానీ కాస్తా లోతుల్లోకి వెళ్లి విశ్లేషిస్తే … చంద్రబాబుకు చంద్రబాబే శత్రువని చెప్పక తప్పదు. ఇటీవల ఆయన ఏపీ డీజీపీకి రాస్తున్న లేఖలే ఇందుకు నిదర్శనం. తన స్థాయిని తాను దిగజార్చుకోవడం తప్ప మరేమీ కాదనే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.
ఇటీవల చిత్తూరు జిల్లాలో దళితుడిపై దాడికి సంబంధించి కూడా డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. లేఖ అందుకున్న డీజీపీ… బాబుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో తనకు డీజీపీ లేఖ రాయడం ఏంటని బాబు చిన్నపిల్లల్లా రాష్ట్ర పోలీస్ బాస్‌తో కయ్యానికి దిగారు. ఇలాంటి ఘటనలు బాబు గౌరవాన్ని పెంచుతాయా? తగ్గిస్తాయా? అసలు తన స్థాయి ఏంటి? తాను చేస్తున్నదేంటో ఒక్కసారి చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇంతగా దిగజారే అవకాశం వుండదు.
తాజాగా మరోసారి డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. శాంతిభద్రతలు క్షీణించడం , ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు ఏపీ వేదికగా మారిందని ఆ లేఖలో బాబు ప్రస్తావించారు. వాక్ స్వాతంత్ర్యం , భావ ప్రకటన స్వేచ్ఛలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. బాబు ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలు, ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛలపై దాడుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.
ఎందుకంటే 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం కంటే రాజ్యాంగ ఉల్లంఘన వుంటుందా? అంతటితో ఆగకుండా, ఏకంగా నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి … రాజ్యాంగ ఉల్లంఘనుడిగా రికార్డులకెక్కారు.
ఈ నేపథ్యంలో బాబు లేఖపై ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. సమస్యలపై ముఖ్యమంత్రికి వామపక్షాలు, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు లేఖలు రాసేవని, కానీ అజ్ఞాత వాసిగా పక్క రాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు డీజీపీకి ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. చంద్రబాబును తిరిగి ఆ అధికారి ప్రశ్నించడం చూసే వాళ్లకు బాగుండందన్నారు.
అంతకు ముందు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారని, ఈ లేఖలను తీసుకుని లిటిగెంట్ మనస్తత్వం తో కోర్టులకు వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నట్టుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. పది, పదిహేను లేఖలు రాస్తే ఇది విఫలమైన వ్యవస్థ అని ప్రజలు అనుకుంటారని బాబు భావిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు మాట ఆయనే వినరనుకుంటానని సజ్జల వ్యంగ్యంగా అన్నారు. రేపు ఆర్డీవో లు, ఎమ్మార్వోలకు రాసినా ఆశ్చర్యపో వాల్సిన పని లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
ఇప్పటికే చంద్రబాబు ఆరోపణలకు ముఖ్యమంత్రి స్పందించడం మానేశారు. దీంతో బాబు స్థాయి ఏంటో జగన్ చెప్పకనే చెప్పారు. మరోవైపు తనకు తానుగా స్థాయి దిగజార్చుకుని లేఖల పర్వాన్ని బాబు కొనసాగిస్తున్నారు. అధికారంలో లేకపోవడం, మరోవైపు భవిష్యత్‌లో పార్టీ పరిస్థితిపై బెంగ పట్టుకున్న నేపథ్యంలో …అసలు తానేం చేస్తున్నారో ఆయనకే స్పృహ లేనట్టుంది. అందుకే ఇలాంటి విపరీత పోకడలనే విమర్శలు.