వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో నాలుగు రాజ్యసభ సీట్లు చేరనున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడానికి ఇంకా సమయం అయితే ఉంది. కానీ ఇప్పటికే వివిధ పేర్లు అయితే ఈ విషయంలో వినిపిస్తూ ఉన్నాయి. మండలి రద్దు నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలో మరింత పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగు రాజ్యసభ సీట్ల విషంయలో గట్టి పోటీ అయితే కనిపిస్తూ ఉంది.
ప్రస్తుతానికి రాజ్యసభ రేసులో ఉన్న నేతల పేర్ల జాబితా ఇలా ఉంది..ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, ఈయనకు రాజ్యసభ సీటు ఖరారు అయ్యిందని ప్రచారం సాగుతూ ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన వారిలో ఆళ్ల ఒకరు. ఇక ఇటీవలి ఎన్నికల్లో అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సమీప బంధువు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి రాజ్యసభ సీటు విషయంలో భరోసా లభించిందని, ఆళ్లకు రాజ్యసభ నామినేషన్ ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతూ ఉంది.
ఇక మిగిలిన మూడు సీట్ల విషయంలో మాత్రం చాలా పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి దక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. గత ఏడాది ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ ను త్యాగం చేశారు. అత్యంత సులువుగా నెగ్గగల సీటును త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ అవకాశం లభిస్తుందనే మాట వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆయనకు టీటీడీ చైర్మన్ హోదా ఉంది. కాబట్టి.. ఈ దఫా అవకాశం ఉంటుందా? అనేది కొశ్చన్ మార్కే!
బీద మస్తాన్ రావు పేరు రాజ్యసభ రేసులో వినిపిస్తూ ఉంది. అయితే ఉన్నట్టుండి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఒకరికి రాజ్యసభ సీటు లభిస్తుందనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా ఈ జాబితాలో మరింత మంది నేతలున్నారు. కిల్లి కృపారాణి తదితరులు ఆశావహులుగా ఉన్నారట!
ఇక నాలుగో సీటు విషయంలో బీజేపీ ప్రస్తావన వస్తూ ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ ను ఒక రాజ్యసభ సీటు విషయంలో అమిత్ షా అడిగారనే టాక్ నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే 4 సీట్లలో ఒకటి తమకు కేటాయించాలని షా అడిగారని ప్రచారం జరుగుతూ ఉంది. రాజ్యసభలో బీజేపీ ఆకలి ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రచారానం నమ్మశక్యంగా ఉంది. ఒకవేళ అడిగి ఉంటే జగన్ కాదనకపోయి ఉండవచ్చనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
ఇక చిరంజీవి, వైఎస్ షర్మిల.. ఈ పేర్లు కూడా రాజ్యసభ సీట్ల విషయంలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే అవి కొసరు పేర్లు మాత్రమేనేమో!