ఖమ్మం మీద షర్మిలకు అభిమానం ఎందుకు ?

వైఎస్ షర్మిల పార్టీ పేరును ప్రకటించే డేట్ నిర్ణయమైపోయింది. ఆమె ఏ ఊళ్ళో సభ పెట్టి పార్టీ పేరును ప్రకటిస్తుందో అదీ నిర్ణయమైపోయింది. ఏప్రిల్ 9 న ఖమ్మంలో సభ పెట్టి పార్టీ పేరును…

వైఎస్ షర్మిల పార్టీ పేరును ప్రకటించే డేట్ నిర్ణయమైపోయింది. ఆమె ఏ ఊళ్ళో సభ పెట్టి పార్టీ పేరును ప్రకటిస్తుందో అదీ నిర్ణయమైపోయింది. ఏప్రిల్ 9 న ఖమ్మంలో సభ పెట్టి పార్టీ పేరును ప్రకటించబోతోంది. లక్ష మందితో సభ నిర్వహిస్తామని ఆమె ప్రకటించింది. 

లక్ష మందితో సభ జరుగుతుందా లేదా చెప్పలేం. కానీ భారీగా సభ జరుగుతుండొచ్చు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పార్టీ పేరును ప్రకటించకుండా ఆమె ఖమ్మాన్ని ఎందుకు ఎంచుకుంది ? ఆమె ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిందో అప్పటి నుంచి ఆమె దృష్టి ఖమ్మం మీదనే ఉంది. 

ఆమెకు ఖమ్మం అంటే అంత అభిమానం, ప్రేమ ఎందుకు ? కేసీఆర్ పగ్గాలు చేపట్టాక అన్ని జిల్లాలతోపాటు ఖమ్మం రెండు ముక్కలైంది. ఒకటి ఖమ్మం జిల్లా, మరోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కానీ షర్మిల ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే సమావేశాలు నిర్వహిస్తోంది. ఆమె ఖమ్మంలో సభ నిర్వహిస్తోందంటే కొత్తగూడెం జిల్లాను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లే. 

2014 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ప్రకటించినప్పుడు ఎన్నికలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. అప్పట్లో ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో మూడు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అంతేకాకుండా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కూడా ఆ పార్టీయే కైవసం చేసుకుంది. 

ఎస్టీ నియోజకవర్గాలైన పినపాక, వైరా వాటితోపాటు అశ్వారావు పేటను వైసీపీ గెలుచుకుంది. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, వైరాలో బానోత్ మదన్ లాల్, అశ్వరావు పేటలో తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలిచాడు. పార్టీ తెలంగాణా శాఖకు ఆయనే అధ్యక్షుడు. 

అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముగ్గురు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు. అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లా మీద బాగా ఫోకస్ చేశారు. ఖమ్మం జిల్లా కూడా గులాబీమయం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారు అనుకున్నట్లే ముగ్గురు ఎమ్మెల్యేలను, ఎంపీని లాగేశారు. 

అప్పట్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఇప్పటి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను, టీడీపీకి పట్టుగొమ్మగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావును టీఆర్ఎస్ లోకి రప్పించారు. అధికారపార్టీలోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టారు. కానీ ఆయనకు మొండి చెయ్యే మిగిలింది. 

ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా ఇతర జిల్లాల్లో జరిగినంత ఉధృతంగా ఖమ్మం జిల్లాలో జరగలేదనే చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు వైసీపీని ఆదరించిన కారణంగానే తన పార్టీ ప్రారంభానికి షర్మిల ఆ జిల్లాను ఎంపిక చేసుకుందేమో అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ మహానేతపై ఆదరణ ఉందా? అయితే ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్న గట్టి నేతలు ఉన్నారు.

ప్రజలను ప్రభావితం చేసే నాయకులు ఉన్నారు. వైఎస్సార్ కు సన్నిహితుడు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ షర్మిల పార్టీవైపు చూస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఆయన పాలేరు ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు. ఆయనలాంటివారు షర్మిల పార్టీలో చేరితే పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా షర్మిల పార్టీ వైపు చూస్తున్నాడని తెలుస్తోంది. 

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు 

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్