టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గతంకంటే కొంత మెరుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో సోషల్ మీడియాకే పరిమితమై జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ టీడీపీ శ్రేణులకు కొంత మేరకు భరోసా కల్పిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్‌పై అధికార పార్టీ నేతలు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. లోకేశ్ హడావుడి అంతా దేనికోసమే మంత్రి కురసాల కన్నబాబు విపులంగా చెప్పారు. ఎలా అల్లరి చేయాలో లోకేశ్‌కు చంద్రబాబునాయుడు శిక్షణ ఇస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఏడునెలల క్రితం జరిగిన సంఘటనలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నారు.
ప్రజలపై నారా లోకేశ్‌కు ప్రేమ లేదన్నారు. తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేశ్ నటిస్తున్నాడని కన్నబాబు అవహేళన చేశారు. మహిళల భద్రతపై ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదం జరిగితే తమ నాయకుడు వెళితే కేసులు పెట్టింది ఏ ప్రభుత్వం..? రన్ వేపై నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు? ఏం తప్పు చేశారని ఆ రోజు కాపులు కంచాలు కొట్టారని వేల మందిపై కేసులు పెట్టారు? అని కన్నబాబు టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
టీడీపీలో కూడా లోకేశ్ నాయకత్వాన్ని ఎవరూ అంగీకరించలేదన్నారు. రాజకీయంగా లోకేశ్‌ని టీడీపీలో యాక్సెప్టెన్సీ కోసమే ఈ డ్రామాలన్నీ అని మంత్రి కన్నబాబు వ్యంగ్యంగా అన్నారు. ఈ విషయం ప్రజలకు బాగా తెలుసన్నారు.