ఓవైపు సమంత-నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు. మరోవైపు వాటికి ఊతమిచ్చేలా సమంత పెడుతున్న పోస్టులు. ఈ రెండింటి మధ్య అక్కినేని అభిమానులు నలిగిపోతున్నారు. దాదాపు వారం రోజుగా నర్మగర్బంగా సమంత పెడుతున్న పోస్టులు చూస్తుంటే.. ఏదో జరుగుతోందనే అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి.
తాజాగా సమంత మరో కొటేషన్ షేర్ చేసింది. పైపైన చూస్తే అందులో తప్పేం కనిపించదు కానీ, అందులో ఇంకేదో అర్థం దాగుందని, సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని ఆ కొటేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిందని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ కొటేషన్ ఏంటంటే…
“నీ చుట్టూ ఉండేవాళ్లపై నువ్వు ఎంత ప్రభావం చూపిస్తున్నావో నిజంగా నీకు తెలియదు. నువ్విచ్చే ఒక చిన్న చిరునవ్వు ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు. నువ్వు చూపించే దయ, మరో వ్యక్తి జీవితం మొత్తాన్ని ఎంతలా మార్చేస్తుందో నీకు తెలీదు. నువ్విచ్చే ఓ గట్టి కౌగిలింత లేదా లోతైన సంభాషణ ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రేమ కురిపిద్దామా అని ఎదురుచూడకు.ఎవరో ఒకరు నీపై ప్రేమ కురిపిస్తారని ఎదురుచూడకు. మంచి పరిస్థితుల కోసమో లేదా ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనో ఎదురుచూడకు. అందరిపట్ల దయతో ఉండు. ఎందుకంటే, ఎంతమందికి నీ దయ/ప్రేమ అవసరమో తెలియదు కదా.”
సమంత తాజాగా పెట్టిన పోస్ట్ ఇది. ఇప్పటికే ఇలాంటివి ఓ 10 సందేశాల్ని ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ను మాత్రం ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. తమకు తోచినట్టు ఊహాగానాలు అల్లేసుకుంటున్నారు. వారం రోజులుగా నలుగుతున్న ఈ పుకార్లపై సమంత-నాగచైతన్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
మరోవైపు పుకార్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సమంత-నాగచైతన్య ఇద్దరూ విడాకులకు అప్లయ్ చేశారని.. ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టేజ్ లో ఆ విడాకులున్నాయని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం విహార యాత్రలో ఉన్న సమంత, ఈ కౌన్సిలింగ్ కోసమే హైదరాబాద్ వచ్చి వెళ్లిందని కూడా అంటున్నారు. ఇలా సమంత-నాగచైతన్య విడాకుల ఊహాగానాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.