మూవీ రివ్యూ: సీటిమార్

టైటిల్: సీటిమార్ రేటింగ్: 2.75/5 తారాగణం: గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్యవంశి, భూమిక, రెహ్మాన్, తరున్ అరోరా, పోసాని, ప్రీతి అస్రాని తదితరులు కెమెరా: సౌందర రాజన్ ఎడిటింగ్: తమ్మిరాజు  సంగీతం: మణిశర్మ నిర్మాత:శ్రీనివాస.…

టైటిల్: సీటిమార్
రేటింగ్: 2.75/5
తారాగణం: గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్యవంశి, భూమిక, రెహ్మాన్, తరున్ అరోరా, పోసాని, ప్రీతి అస్రాని తదితరులు
కెమెరా: సౌందర రాజన్
ఎడిటింగ్: తమ్మిరాజు 
సంగీతం: మణిశర్మ
నిర్మాత:శ్రీనివాస. సి
కథ-దర్శకత్వం: సంపత్ నంది 
విడుదల తేదీ: 10 సెప్టెంబర్ 2021

ఎప్పుడో కరోనా లేని యుగంలో మొదలైన ఈ సినిమా రెండు వేవ్ లు దాటుకుని ఈ రోజు విడుదలయ్యింది. బాగా మోగిన “జ్వాలా రెడ్డి” పాట ఈ సినిమా ఒకటుందని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంది ఇన్నాళ్లూ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీసిన మాస్ యాక్షన్ సినిమాగా దీనిని ప్రొజెక్ట్ చేసారు. కథలోకి వెళ్తే..

రాజమండ్రి దగ్గరున్న కడియం ఆంధ్రాబ్యాంక్ లో పనిచేస్తుంటాడు కార్తి (గోపిచంద్). మహిళా కబడ్డి టీం కి కోచ్ గా పనిచేయడం అతని మరొక వృత్తి. ఆ పల్లెటూరి ఆడపిల్లలకి కోచింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తరపున నేషనల్స్ లో ఆడడానికి ఢిల్లీ తీసుకెళ్లిపోతాడు. 

అక్కడ మక్కన్ సింగ్ (తరుణ్ అరోరా) అనేవాడు ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తాడు. కబడ్డీ కోచ్ అయిన కార్తి ఆ అమ్మాయిల్ని ఎలా కాపాడుకుంటాడనేది కథ. 

సాధారణంగా సినిమాలో లాజిక్కైనా ఉండాలి, మేజిక్కైనా పండాలి. ఇంటిలిజెంట్ గా రాసుకునే స్క్రిప్ట్ లాజిక్ మీద నడుస్తుంది. ఎమోషనల్ గ్రాఫ్ మీద విపరీతమైన పట్టుతో తీసే సినిమాలు మ్యాజికల్ అవుతాయి. 

ఈ రెండూ కాకుండా ఊర మాస్ గా రాసుకునే సినిమాలు కొన్నుంటాయి. వాటిల్లో లాజిక్కులు, మ్యాజిక్కులు ఉండవు. పక్కా మసాలా దినుసులతో తయారయ్యే మాస్ బిర్యాని టైపులో నాలుగు పాటలు, నాలుగు హై వోల్టెజ్ ఫైట్లు, కంటికింపైన హీరోయిన్ల గ్లామర్..ఇవి పెట్టుకుని వీటి మధ్యన కథ అల్లుకోవాలి. ఈ “సీటిమార్” ఆ టైపు సినిమా. 

ఈ సినిమా చూస్తున్నప్పుడు తలలో పుట్టకూడని ప్రశ్నలు- 

24 గంటల్లో ఫైనల్ మ్యాచ్ ఉందనగా మెడ తెగిపోయి ఐ.సీ.యులో పడున్న ఒక ప్లేయర్ లేచొచ్చి మ్యాచ్ ఆడేయడమేంటి?

ఎంత పోలీసాఫీసరైతే మాత్రం బావగారి పొట్టలోకి దిగిన గునపం వీపులోంచి పొడుచుకొచ్చేసినా సరే ఫైట్ అయ్యేదాకా డయలాగులు చెప్తూ చివరికి బతికి బట్టకట్టడమేంటి?

ఇలాంటి ప్రశ్నలొచ్చి నిట్టూర్చినా, చిరాకు పడినా ఈ సినిమాకి మీరు టార్గెట్ ఆడియన్స్ కాదని అర్థం. 

కేవలం బి, సి సెంటర్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. బి, సి సెంటర్ ఆడియన్స్ అంటే వాళ్లు టౌన్స్, విలేజస్ లో మాత్రమే ఉంటారని కాదు. అటువంటి సినిమాలు నచ్చే వాళ్లు ఎక్కడైనా ఉండొచ్చు. ఇది ఆ మైండ్ సెట్స్ ని మాత్రమే టార్గెట్ చేసి తీసిన సినిమా. 

తెలంగాణా ప్లేయర్ “ప్యారడైజ్ బిర్యాని ఇక్కడ” అంటే, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ “ఆంధ్రా ఆవకాయ ఇక్కడ” అని ఎమోషనల్ గా కౌంటర్లు ఇచ్చుకోవడం ఒక వర్గం ప్రేక్షకులకి చిరాకు తెప్పించినా టార్గెట్ ఆడియన్స్ బహుశా “సీటీలు” వేయొచ్చు. 

ఇక ఆర్టిస్టుల విషయానికొస్తే…

గోపీచంద్ లో సిన్సియారిటీ కనిపించింది. తన పాత్ర వరకు చాలా కన్విన్సింగ్ గా కనిపించాడు. 

తమన్నా అందాల డోసు సరిపడా ఉంది. ముఖ్యంగా జ్వాలరెడ్డి పాటలో గ్లామర్ బాంబులా పేలింది. 

దిగంగనా సూర్యవంశి ఇంట్రడక్షన్లో హాట్ గా కనపడింది. తర్వాత పెద్దగా ఆమె గ్లామర్ ని కెమెరా వాడుకోలేదు. 

ప్రీతి అస్రాని కూడా కంటికింపుగా ఉంది. 

ఇంత అందం చాలదన్నట్టు అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణా చేత ఒక ఐటం సాంగ్ కూడా చేయించేసాడు దర్శకుడు. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ కి నచ్చే భాషలో ఊర మాస్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక “గ్లామరు పూల బుట్ట”. 

ఇక రెహ్మాన్ సీరియస్ క్యారక్టర్లో ఓకే. విలన్ గా చేసిన తరుణ్ అరోరా గట్టిగా అరుస్తూ, బేస్ వాయిస్ లో వార్ణింగులిస్తూ క్యారక్టర్ని లాగాడు.

సెకండాఫులో పోసాని హాస్పిటల్లో చెప్పే డయలాగ్ బాగుంది. ఫస్టాఫులో రావు రమేష్ ప్రాస డయలాగులు చెప్తూ కొత్తదనం చూపించాడు. 

మణిశర్మ సంగీతం ఈ సినిమాకి మేజర్ హైలైట్. కథనంలో ఎమోషనల్ కన్సిస్టెన్సీ దెబ్బతిన్నప్పుడల్లా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూడ్ ని నిలబెట్టింది. యాక్షన్ డైరక్టర్ ని మెచ్చుకుని తీరాలి. ప్రొడక్షన్ వేల్యూస్ ఎక్కడా తక్కువ కాలేదు.

కొన్ని మైనస్సులున్నా కరువులో ఉన్న బి,సి సెంటర్స్ ఆకలి తీర్చడానికి వండబడిన ఈ మసాలా సినిమా ఆ థియేటర్స్ కి కాస్త ఎనెర్జీనిస్తుందేమో చూడాలి. 

బాటం లైన్: ఊర మాస్ ఆడియన్స్ కి మాత్రమే