పశ్చిమబెంగాల్‌లో మరోసారి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ ఏడాది మొదట్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. మూడోసారి మమతాబెనర్జీ ఘన విజయం సాధించి ప్రధాని మోడీకి తానే ప్రత్యామ్నాయని దేశానికి ఓ సంకేతం పంపారు. అయితే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌కు బదులుగా నందిగ్రామ్‌లో నిలిచి పోరాడి ఓడారు.
కానీ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. తిరిగి ఆరు నెలల్లోపు ఎన్నిక కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి గెలిచిన తృణమూల్ నేత సోభాందేవ్ ఛటోపాధ్యాయ తమ నాయకురాలి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడి నుంచి దీదీ బరిలో నిలవనున్నారు. గతంలో ఆమె అక్కడి నుంచి రెండుసార్లు గెలుపొందారు.
పశ్చిమబెంగాల్‌లో భవానీపూర్‌తో పాటు సంషేర్‌గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు కూడా ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అందరి దృష్టి భవానీపూర్‌పై పడింది. అక్కడ దీదీని కట్టడి చేసేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ క్రమంలో దీదీపై అభ్యర్థిని బీజేపీ ఇవాళ ప్రకటించింది. భవానీపూర్ నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను నిలిపింది.
కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మమతాబెనర్జీపై పోటీ చేయనున్న ప్రియాంక ఎవరనే విషయమై ఆరా తీస్తున్నారు. 41 ఏళ్ల ప్రియాంక టిబ్రివాల్ కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2014లో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా విభాగ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతాల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.