పవన్ కల్యాణ్ పరపతి తగ్గిపోయిందా..? బీజేపీ నాయకులు పవన్ ని పూర్తిగా పక్కనపెట్టేశారా, పట్టించుకోవడం మానేశారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదే నిజమనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం కోసం వచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన, అక్కడినుంచి శ్రీశైలం వెళ్లి, తిరుగు ప్రయాణంలో మళ్లీ హైదరాబాద్ వచ్చి, ఢిల్లీకి బయలుదేరారు.
ఇంత జరిగినా మరి హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కల్యాణ్, అమిత్ షా ని ఎందుకు కలవలేకపోయారు. పవన్ కి వర్తమానం అందలేదా లేక పవన్ వస్తానన్నా వద్దన్నారా..? సహజంగా కేంద్రంలోని బీజేపీ నేతలు.. ప్రధాని నరేంద్రమోదీతో సహా పవన్ కల్యాణ్ కి ఓ రేంజ్ లో ప్రయారిటీ ఇస్తారని ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు.
ఆమధ్య కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం కూడా పవన్ కల్యాణ్ సలహా, సూచనల ప్రకారమే జరిగిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటి పవన్ కి, ఇప్పుడు కేంద్ర మంత్రి హైదరాబాద్ వచ్చినా కలవడానికి అవకాశమే లేకుండా పోయింది. అమిత్ షా వ్యక్తిగత పర్యటనపైనే రావొచ్చు కానీ మరీ మిత్రపక్ష అధినేత, అందులోనూ పెద్ద హీరో, ఆయనకి టైమ్ ఇవ్వలేకపోవడం మరీ విడ్డూరం.
తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఏం జరిగింది..?
తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ పరపతి ఎంతో తేలిపోయింది. పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చినా కూడా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు డిపాజిట్లు రాలేదు. బీజేపీ సొంతగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అదే వచ్చింది. జనసేన వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేదు. అంటే ఏపీలో పవన్ కి పరపతి లేదు.
జనం గుర్తించని జనసేనానిని బీజేపీ మాత్రం ఎందుకు గుర్తిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ కంటే, రెండు చోట్లా పోడీ చేసి ఓడిపోయిన పవన్ పరిస్థితి మరీ దారుణం.
అందుకే పవన్ ని బీజేపీ పూర్తిగా పక్కనపెట్టేసినట్టు అర్థమవుతోంది. ఊరికే సీఎం సీఎం అంటూ పవన్ డప్పు కొట్టడం కంటే, ఎవరి డబ్బు వాళ్లు కొట్టుకోవడమే మంచిదని అనుకుంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఏపీలో స్థానిక బీజేపీ నేతలు జనసేనని కలుపుకోవాలనుకోవడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలైనా, ఉద్యమాలైనా, ఇతర కార్యక్రమాలైనా బీజేపీ సోలోగా చేసుకుంటూ పోతోంది.
జనం దృష్టిలోనే ఇంకా బీజేపీ, జనసేన కలసి ఉన్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడో మరచిపోయారు. తాజాగా పవన్ కల్యాణ్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో ఈ విషయం మరోసారి రూఢీ అయింది.