“రాజధాని ప్రాంతంలో నెలలో మౌలిక వసతులు కల్పించాలి. ప్లాట్లు అభివృద్ధి చేసి 3 నెలల్లోగా రైతులకు అప్పగించాలి. రాజధాని నగరాన్ని 6 నెలల్లో నిర్మించాలి. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలి.” ఇలా హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది కానీ, దాని అమలు సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
ఇంకా చెప్పాలంటే అసాధ్యం అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై మీడియాలో అప్పుడే చర్చలు కూడా మొదలైపోయాయి. ఎల్లో మీడియా సాధ్యమే అంటోంది. సాక్షి మీడియా అసాధ్యం అంటోంది. అసలు ఎల్లో మీడియా చెప్పినట్టు సాధ్యమే అనుకుంటే.. చంద్రబాబు పాలనలో అది ఎందుకు కార్యరూపం దాల్చలేదు. సాక్షి మీడియా చెప్పినట్టు అసాధ్యం అనుకుంటే దానికి కారణాలేంటి?
ఆరు నెలల్లో లక్ష కోట్లు
మాస్టర్ ప్లాన్ అమలుకు ఉన్నఫళంగా లక్ష కోట్లు కావాల్సిందే. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అమరావతి కోసం లక్ష కోట్లు ఎక్కడ్నుంచి తెస్తుంది..? అలా తీసుకురావాలంటే నవరత్నాల పథకాలతో పాటు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పక్కనపెట్టాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఉద్యోగుల జీతాలు కూడా ఆపేయాలి. ఇది దాదాపుగా అసాధ్యమే.
మరి హైకోర్టు తీర్పులో కంటిన్యూస్ మాండమస్ అనే పదం కూడా ఉంది. దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ అమలుచేయలేకపోతే హైకోర్టు ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాలంటే అదో లెక్క, ఆరు నెలల్లోగా అమలు పూర్తి చేయాలనడం మాత్రం కాస్త అసంబద్ధంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఈ టార్గెట్ ని ప్రభుత్వం రీచ్ అవుతుందో లేదో చూడాలి.
భ్రమరావతిని అమరావతిగా మార్చడం అసాధ్యం..
అదే నిజమైతే ఆ పనేదో చంద్రబాబే చేసేవారు. కేవలం అమరావతి పేరుతో బిల్డప్ ఇచ్చి ఆపేవారు కాదు. మాస్టర్ ప్లాన్ అమలుకి ఆరు నెలలు సరిపోతే చంద్రబాబు దాన్ని కచ్చితంగా పూర్తి చేసేవారే కదా, అమరావతి పేరుతోనే ఓట్లు అడిగేవారు కదా అనేది వైసీపీ లాజిక్. అమరావతి నిర్మాణం అసాధ్యం కాబట్టే చంద్రబాబు ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టారు.
కేవలం ప్రచారంపైనే దృష్టిపెట్టారు. ఆయన చేసిన పాపాలను భరించడం తప్ప ఇప్పుడు వైసీపీ కొత్తగా చేసేదేం లేకుండా పోయింది. చంద్రబాబు మాత్రం కోర్టు కేసుల తర్వాత టపాకాయలు కాల్చుతూ.. తమాషా చూస్తున్నారు.
కోర్ క్యాపిటల్ డెవలప్ మెంట్ కే ఐదేళ్లు పడుతుంది. స్వయంగా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పిన మాట ఇది. సీఆర్డీఏలో కూడా ఇదే ఉంది. అలాంటప్పుడు హైకోర్టు చెప్పినట్టు 6 నెలల్లో పూర్తిచేయడం ఎలా?
సుప్రీంకు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ లేదు..
సుప్రీంకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని, వెళ్తే ఏమవుతుందో తెలుసని వైసీపీ నేతలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో సుప్రీంకు వెళ్లడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదనేది మాత్ర వాస్తవం. సుప్రీంలో అప్పీల్ చేసుకుంటూ.. మరింత గడువు కోరడం మినహా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. ఆరు నెలల టైమ్ బౌండ్ అనేది అసాధ్యమని అందరికీ తెలుసు.
అందుకే వైసీపీ నేతలు ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. వేరేగా వివరించాల్సిన పనిలేకుండా.. వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి కాబట్టి.. ఇక చేసేదేం లేదని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. మొత్తమ్మీద 6 నెలల గడువు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కనిపించినా.. అదే వారికి రక్షణగా మారే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.