ఈ సారైనా మాట మీద నిలబడతావా చంద్రబాబూ!

“రాబోయే ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గడిచిన మూడేళ్లుగా కష్టపడిన వాళ్లకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బస్సు యాత్రల్లో భాగంగా నియోజకవర్గాల వారీగా కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల్ని కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.” గడిచిన…

“రాబోయే ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గడిచిన మూడేళ్లుగా కష్టపడిన వాళ్లకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బస్సు యాత్రల్లో భాగంగా నియోజకవర్గాల వారీగా కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల్ని కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.” గడిచిన 2 రోజులుగా బాబు అనుకూల మీడియాలో కనిపించిన హెడ్ లైన్స్, కథనాలు ఇవి.

అయితే బాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఒకేలా ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. అది పాలనలో అయినా, పార్టీలో టికెట్లు కేటాయింపుల్లో అయినా బాబు బ్రెయిన్ ను అంచనా వేయడం ఎవ్వరితరం కాదు. ఇప్పుడీ కొత్త స్టేట్ మెంట్ పై కూడా టీడీపీ జనాలు ఇలానే గుసగుసలాడుకుంటున్నారు. ఈసారైనా మాట మీద బాబు నిలబడతారా అని చర్చించుకుంటున్నారు. 

ఉదాహరణకు 2019 ఎన్నికల్నే తీసుకుందాం. ఆ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీటీపీలో చేరిన చాలామందికి టిక్కెట్లు ఇచ్చారు. అంతకంటే ముందు వైసీపీ జెండాపై గెలిచి, టీడీపీలోకి వచ్చి పదవులు పొందిన వారు సైతం టిక్కెట్లు అందుకున్నారు. ఇలా ఆఖరి నిమిషంలో మాట మార్చేస్తుంటారు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి నుంచి “వలస నేతలకు టిక్కెట్లు ఇవ్వం” అనే స్టేట్ మెంట్ రావడాన్ని టీడీపీ నేతలు ఆశ్చరంగా చూస్తున్నారు.

క్షేత్రస్థాయిలో కష్టపడే వాళ్లకే ఈసారి టిక్కెట్లు ఇస్తామని, ఆఖరి నిమిషంలో చేరే వాళ్లకు టికెట్లు ఇవ్వమని చంద్రబాబు చెప్పిన మాట నీటమూట అంటున్నారు చాలామంది. ఎందుకంటే, చంద్రబాబుకు ఇప్పుడు కావాల్సింది కష్టపడే అభ్యర్థులు మాత్రమే కాదు, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు కూడా కావాలి. అలాంటి వాళ్లు ఆఖరి నిమిషంలో పార్టీలోకి వస్తానంటే చంద్రబాబు కాదనలేరు. వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిందే.

సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లకు ఓటు బ్యాంక్ కంటే డబ్బుల బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ. సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్లు మరోసారి టీడీపీలోకి వస్తానంటే బాబు కాదనరు. నారాయణ కూడా ఈ కోవలోకే వస్తారు. పార్టీలో ఇన్నాళ్లూ నిష్క్రియాత్మకంగా ఉన్న ఆయన, మరోసారి టికెట్ కావాలని పట్టుబడితే చంద్రబాబు కాదనలేరు.

ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు సగం నియోజకవర్గాల్లో చంద్రబాబు స్టేట్ మెంట్ చెల్లదంటున్నారు స్వయంగా టీడీపీ జనాలు. ఇప్పటికే చంద్రబాబు మాటల్ని జనం నమ్మడం మానేశారు. ఇప్పుడిలా “కష్టపడే తత్వం, అంకితభావం, క్రమశిక్షణ” లాంటి పదాలు వాడితే టీడీపీ నేతలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు.