రాజకీయ సలహాలకు, ఎన్నికల వ్యూహాలకు సెలవు ప్రకటించానన్న ప్రశాంత్ కిషోర్.. ఏపీ సీఎం జగన్ తో ఇంకా టచ్ లోనే ఉన్నారా? వివిధ రాష్ట్రాలకు తన శిష్య బృందాలను పంపించి తన టీమ్ తో ఎన్నికల వ్యూహాలను రచిస్తున్న పీకే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రంగంలో దిగుతారా..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పీకే వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మంత్రి మండలి సమావేశం అనంతరం పీకే గురించి చిన్నపాటి చర్చ జరిగిందని, మంత్రులంతా ముందస్తు వ్యూహాలతో ఉండాలని జగన్ సూచించారని వార్తలొస్తున్నాయి.
పూర్తిగా గాసిప్ అని కొట్టిపారేయలేం కానీ.. జగన్ మాత్రం ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకునేలా లేరు. అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఆగిపోకుండా.. ఎమ్మెల్యేల బలాన్ని మరింత పెంచుకోవడం, ఏపీలో కాంగ్రెస్ తరహాలోనే టీడీపీకి కూడా పాతరేయడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు.
అదే సమయంలో బీజేపీ-జనసేనకి కూడా ఉమ్మడిగా గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. టీడీపీ వ్యూహాలు, టీడీపీ అనుకూల మీడియా కవరింగ్ లు ప్రజల మనసుల్ని ఎంతమాత్రం కలుషితం చేయలేవని 2019 ఎన్నికల్లో రుజువైంది. అయితే 2014లో మాత్రం జగన్ పై చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆయన అసత్య హామీలకు ప్రజలు మోసపోయారనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
సో.. 2024లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను వైసీపీ అంత తేలిగ్గా తీసుకోడానికి లేదు. అందుకే ఇప్పటినుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టేలా జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఏపీలో జగన్ పై కానీ, వైసీపీ ప్రభుత్వంపై కానీ ఎలాంటి కంప్లయింట్లు లేవు. అయితే ఎన్నికల వరకు కూడా ఇదే వేవ్ కంటిన్యూ చేయాల్సిన అవసరాన్ని జగన్ మంత్రులకు గుర్తు చేశారట. ఎక్కడా ఎవరూ ప్రభుత్వంపై ఉన్న మంచిపేరుని చెరిపేసేలా ప్రవర్తించొద్దని అన్నారట. ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పారట.
పీకే సూచనల మేరకే.. జగన్ తన టీమ్ ని ఇలా అలర్ట్ చేశారనే వాదన వినిపిస్తోంది. సీఎం జగన్ తోపాటు, మంత్రులంతా ఇప్పటినుంచే ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని, 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఎలా సన్నద్ధం అయ్యారో, ఇప్పుడు కూడా అదే ఫార్ములా వాడాలని చెప్పారట.