త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా ప్రకటించిన వెంటనే కొంతమంది దర్శకుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఇకపై తాము కూడా మహేష్ తో సినిమా కోసం ప్రయత్నించవచ్చనే కాన్ఫిడెన్స్ వాళ్లలో కనిపిస్తోంది. వీళ్లంతా ఎవరంటే.. గతంలో మహేష్ కు ఫ్లాపులిచ్చిన దర్శకులు.
మహేష్ కు ఓ అలవాటు ఉంది. ఎవరైనా తనకు హిట్టిచ్చారంటే మినిమం గ్యాప్ లోనే వాళ్లకు మరో అవకాశం ఇస్తాడు. కానీ సెకండ్ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకున్నోళ్లు చాలా తక్కువ. కొరటాల శివ తప్పితే ఆల్ మోస్ట్ మిగతా వాళ్లంతా ఫ్లాపులిచ్చినోళ్లే. అలాంటి వాళ్లందర్నీ మహేష్ ఆ తర్వాత పక్కనపెట్టాడు. త్రివిక్రమ్ తో సహా.
అలా ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈమధ్య మళ్లీ కలిశారు. సినిమా కూడా ఎనౌన్స్ చేశారు. దీంతో గతంలో మహేష్ కు ఫ్లాపులిచ్చిన దర్శకుల్లో ఇప్పుడు మరోసారి ఆశలు చిగురించాయి. ఎప్పటికైనా మహేష్ తమకు కూడా ఓ ఛాన్స్ ఇస్తాడని వీళ్లు ఎదురుచూస్తున్నారు.
మహేష్ తో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానని, మంచి కాన్సెప్ట్ ఉందని రీసెంట్ గా గుణశేఖర్ ప్రకటించాడు. దూకుడు, ఆగడులో మహేష్ ను కంప్లీట్ కామెడీ యాంగిల్ లో చూపించిన తను, ఈసారి అవకాశం ఇస్తే అతడ్ని మరో కొత్త కోణంలో చూపిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు శ్రీనువైట్ల. ఇక అడ్డాల సంగతి సరేసరి.
వీళ్లంతా ఇప్పుడు మహేష్ వైపు మరోసారి ఆశగా చూడ్డానికి కారణం త్రివిక్రమ్ తో అతడు సినిమాకు సిద్ధమవ్వడమే. అయితే ఇలాంటి దర్శకులంతా ఓ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. త్రివిక్రమ్ తననుతాను నిరూపించుకున్నాడు. అల వైకుంఠపురములో లాంటి పెద్ద హిట్ కొట్టాడు. అందుకే మహేష్ ఛాన్స్ ఇచ్చాడు.
కానీ గతంలో మహేష్ కు ఫ్లాపులిచ్చిన దర్శకులెవరూ రీసెంట్ గా తమ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించలేకపోయారు. నిజంగా గుణశేఖర్ లేదా వైట్లలో ఒకరికి మహేష్ మళ్లీ ఛాన్స్ ఇస్తే.. వైవీఎస్ చౌదరి, జయంత్ సి పరాన్జీ కూడా మహేష్ ఇంటికొస్తారు. సినిమా చేస్తామని అడుగుతారు. నౌ డౌట్.