ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులుంటారు. కానీ ఆ ప్రజల్ని నడిపే మహాశక్తి మీడియా. ఇక్కడ పైకి రెండు మూడు పార్టీలు కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి. కానీ అసలా యుద్ధాన్ని నడిపించే ఆయుధం పట్టని రథసారధి మీడియా.
చరిత్ర చూసినా, వర్తమానం చూసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. మీడియా అభయం లేని ఏ పార్టీ అయినా ఉన్నా లేనట్టే. మనుగడ సాగించాలంటే ప్రతి పార్టీకి మీడియా కటాక్షం ఉండాల్సిందే.
1983లో ఒక సినిమా నటుడు అప్రతిహతమైన విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రి సింహాసమెక్కాడు. ఆ విజయానికి గల కారణం ఏది చెప్పుకున్నా అదంతా మీడియా చలవే. అప్పటి వార్తాపత్రికలు రాసింది జనం నమ్మారు. తెరమీదున్నవాడిని రాజుని చేసారు.
1996లో అదే జనాకర్షణగల ముఖ్యమంత్రిని ఏ మాత్రం ఆకర్షణ గానీ, వక్తృత్వ శక్తిగానీ లేని తన అల్లుడుగారు పడకొట్టి ముఖ్యమంత్రయ్యాడు. అది కూడా మీడియా అభయం తప్ప మరొకటి కాదు. అది అందరికీ తెలుసు. ఆ సమయంలో మీడియా ఏ మాత్రం ప్లేటు తిప్పినా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని అల్లుడుగారి రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుండేది. అలా కాకుండా వెన్నంటి నడిపి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది.
2004లో ఒక నాయకుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేసాడు. ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ముఖ్యమంత్రయ్యాడు. ఆ పాదయాత్ర విషయాలు మీడియా రాయకపోతే ఆయన పాదయత్రలో వ్యక్తిగతంగా కలిసిన జనాభాకి తప్ప మిగతా ఓటర్లకి ఆయన శ్రమ తెలిసేదే కాదు.
2014లో జగన్ లక్ష కోట్లు కాజేసాడన్న మీడియా స్మియర్ కాంపైన్ విజయవంతం కావడం వల్ల ఎన్నికల్లో గెలవలేకపోయాడు.
2019లో చంద్రబాబు లోపాలను మీడియా విజయవంతంగా జనాలకి చేరవేయడం వల్ల ఆయన దారుణంగా ఓడిపోయాడు.
పవర్ రావాలన్నా, పోవాలన్నా మీడియానే కారణం. ఒక వర్గం మీడియాకి మరొక వర్గం మీడియాకి మధ్యన జరిగే యుద్ధాన్ని బట్టి ఏ వర్గానికి పవరొస్తుందనేది ఆధారపడి ఉంటుంది.
కమ్యూనిష్ట్ పార్టీ కనుమరుగైపోవడానికి కారణం అందులో నాయకులు లేక కాదు, వాళ్లకి రాజకీయం తెలియకా కాదు- కేవలం బలమైన మీడియా దన్ను లేకపోవడమే ప్రధాన కారణం.
జనసేన పార్టీని ఓటర్లు ఇంకా సీరియస్ గా తీసుకోకపోవడానికి గల ప్రధాన కారణం మీడియాబలం పెంచుకోకపోవడమే.
తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి గల ప్రధాన కారణం ముఖ్యమైన మీడియా చానల్స్ ని, వార్తా పత్రికల్ని ఆ పార్టీ సొంతం చేసుకోవడమే.
ప్రజలకేం తెలుస్తుంది? వారి రాజకీయ విజ్ఞానమంతా మీడియా ద్వారా సంక్రమించేదే. నచ్చిన పార్టీకి చెందిన మీడియాని ఫాలో అవుతూ అదే నిజమనే భావనలో ఉంటారు. వారిలో చాలామంది ఓపెన్ మైండ్ తో ఆలోచించరు. అలా ఆలోచించనీయకుండా చెసే శక్తే మీడియా. అలా ఆలోచించకుండా కరడుకట్టిన పార్టీవాదులుగా తయారయ్యి సొషల్ మీడియాలో పొస్టులు పెడుతున్న అటువంటి సామాన్యులను చూస్తే జాలేస్తుంది. పాపం వెర్రి గొర్రెలు అనిపిస్తుంది.
నచ్చిన పార్టీ చేస్తున్న మంచిని గట్టిగా చెప్పడం, చెడుని దాచడం లేదా వెనకేసుకురావడం ఇక్కడ మామూలే. అయితే మితిమీరిన పుత్రప్రేమ ఎలా అయితే పుత్రుడిని నాశనం చేసే అవకాశముంటుందో అలాగే మితిమీరిన సొంత పార్టీ వ్యామోహం కూడా ఆ పార్టీని, ఆ మీడియాని కూడా నిలువునా ముంచుతుంది.
నచ్చిన పార్టీపై ప్రేమ చూపిస్తూనే, తప్పున్నప్పుడు నిర్మొహమాటంగా వేలెత్తి చూపే గుండె ఉన్న మీడియా సంస్థలెక్కడ? రెడ్ లైట్ పడినప్పుడు రాతల్ని న్యూట్రల్ గేరులోకి మార్చి బ్రేక్ వేయగలిగే మీడియా గ్రూపులెక్కడ? ఆ కాలిక్యులేషన్ ఉన్న మీడియాకి ఆయుష్షు ఎక్కువుంటుంది. ప్రజాదరణ కూడా మెండుగా ఉంటుంది.
– అన్ని పార్టీల మీడియా సంస్థల్లోనూ పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్