మంచి అనేది ఎక్కడున్నా నేర్చుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ప్రత్యర్థులంటే వ్యక్తుల్ని, విధానాల్నింటిని వ్యతిరేకించడమే అనే కోణంలో ఎప్పుడూ చూడకూడదు. అసలు ఆ భావనే సరైంది కాదు. ప్రత్యర్థులు, శత్రువులకు మధ్య చాలా తేడా ఉంటుంది.
రాజకీయాల్లో ప్రత్యర్థుల్లే తప్ప శత్రువులు ఉండరంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ సంస్కారం ఎప్పుడో కొరవడిందనేది బహిరంగ రహస్యమే.
టీడీపీని నడిపే తీరు నిర్మాణాత్మకంగా ఉంటుంది. అందుకే ఈ రోజుకూ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్, ఓటు బ్యాంకు ఉంది. కానీ ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీలో డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉండడం వల్ల లోపాలు పైకి కనిపించకపోవచ్చు. అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ పార్టీగా, అది ఎప్పుడూ తన కార్యవర్గంతో మీటింగ్‌లు జరపడం, నాయకుల అభిప్రాయాలు తీసుకున్న దాఖలాలు లేవనే అభిప్రాయాలున్నాయి.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వద్దాం. పంచాయతీ ఎన్నికలకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరోసారి ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు.
అధికార పార్టీ వైసీపీ మాత్రం ఎస్ఈసీపై విమర్శలు, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఎన్నికల్లో అభ్యర్థుల నిలుపుదలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.
ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలో దిగారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోటీ చేసే అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని, 24 గంటలూ పని చేస్తుందని, ఎన్నికల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఆ సమాచారాన్ని వెంటనే చేరవేయాలని ఆయన సూచించారు. అలాగే లీగల్ సెల్ న్యాయవాదులంతా ఎన్నికలపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అభ్యర్థులంతా సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అధికార పార్టీగా వైసీపీ ఇలాంటి కేంద్రాన్ని ఏదైనా ఏర్పాటు చేసిందా? అంటే లేదనే చెప్పాలి. అభ్యర్థులకు న్యాయ సలహాలు, ఇతర అంశాల్లో మార్గనిర్దేశం చేసే ఏర్పాట్లు వైసీపీలో మచ్చుకైనా కనిపించవు. తాము అధికార పార్టీ కావడంతో ఇలాంటివేవీ అక్కర్లేదనే భావన ఆ పార్టీ పెద్దల్లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక కేంద్రంగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీలో తమ బాధలు చెప్పుకోడానికి ఓ వేదిక ఉంది. కానీ వైసీపీలో అలాంటి ఏర్పాటేదీ లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వైసీపీ ఫంక్షనింగ్ ఉంటోందని అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.