ఊడలమర్రిలా విస్తరిస్తున్న డిజిటల్ వ్యవహారాలు చూస్తుంటే భవిష్యత్ లో థియేటర్లకు ఇంకా కష్టం అయ్యేలా వుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్, థియేటర్ ఎక్స్ పీరియన్స్ అంటూ ఒక పక్క ఊదరగొడుతున్నారు. కానీ అదే టైమ్ లో డిజిటల్ ద్వారా వచ్చే ఆదాయం ఊరిస్తోంది.
డిజిటల్ వ్యవహారం కూడా అరేబియా ఒంటె మాదిరిగా వుంది. ఆరంభంలో ఇన్ని వారాల తరువాత ఓటిటిలో వేసేందుకు అగ్రిమెంట్ లు వుండేవి. ఇప్పుడు అది కాస్తా ఇన్ని రోజుల తరువాత అన్నట్లుగా తయారవుతోంది.
అదే సమయంలో థియేటర్ లో జనాలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనే అనుమానం వున్న సినిమాలు, థియేటర్ విడుదల బాధలు పడలేని సినిమాలు, థియేటర్ విడుదల ప్రాసెస్ కష్టం అనుకునే సినిమాలు నేరుగా ఓటిటికి వెళ్లిపోతున్నాయి.
కరోనా టైమ్ లో ఓటిటిలకు అలవాటు పడుతున్నారు. థియేటర్లు కష్టం అనుకున్నారు. కానీ థియేటర్లు తెరుచుకున్నాక ఇక ఓటిటిలకు కష్టం అనుకున్నారు. అందుకే తమ మనుగడ కోసం ఓటిటి లు కొత్త దారి తొక్కాయి. వీలయినంత త్వరగా ఓటిటిలో సినిమా వేసుకునే మార్గాలు వెదుకుతున్నాయి. దీని కోసం కాస్త అదనపు పేమెంట్ ఇవ్వడానికి సిద్దం అవుతున్నాయి.
నాలుగు వారాలు కాకుండా క్రాక్, మాస్టర్ లాంటి పెద్ద సినిమాలు ఓటిటి లోకి వస్తున్నాయి. ఇది అలవాటు అయితే మూడు వారాల తరువాత మెల్లగా సినిమా చూడవచ్చు అనుకునే బాపతు జనాలు ఇక థియేటర్ కు దూరం అయ్యే ప్రమాదం వుంది. పైగా కంటెంట్ కన్నా బజ్, స్టార్ కాస్ట్, హడావుడి ఎక్కువగా వుంటేనే థియేటర్లకు జనం వస్తున్నారు.
టాక్ తో సంబంధం లేకుండా పండగ సినిమాలు వసూళ్లు చేసాయి. కానీ అదే బంగారు బుల్లోడు దగ్గరకు వచ్చేసరికి అసలు వసూళ్లే కరువయ్యాయి. ఈ లెక్కన ఇక చిన్న, మీడియం సినిమాల థియేటర్ రన్ అన్నది అనుమానంగానే వుంది.
ఈ ఏడాది సమ్మర్ లోపు చాలా సినిమాలు వున్నాయి. అప్పటికి థియేటర్ల వ్యవహారం ఓ అంచనాకు అందే అవకాశం వుంది. ఏమైనా ఇమ్మీడియట్ గా కాకున్నా మెలమెల్లగా థియేటర్లకు సమస్యలు చుట్టుముట్టేలాగే వుంది డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల పరిస్థితి చూస్తుంటే.
అయితే ఈ పరిస్థితి మేకర్లకు మాత్రం మాంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. సినిమాకు అన్ని వైపుల నుంచి ఆదాయం పెరగడం, డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు పెరగడంతో నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. టాలీవుడ్ లో ఉపాథి పొందేవారి సంఖ్య త్వరలో మరింతగా పెరిగిపోయే అవకాశం వుంది.