వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర ఏడాది దాటిపోయింది. ఇంత వరకూ ఇసుక సరఫరాపై ఒక పాలసీ లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. జగన్ ప్రభుత్వ అనాలోచిత, అసంబద్ధ చర్యల కారణంగా సామాన్యులకు ఇసుక దొరకడం గగనమైంది. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇసుక, లేనివాళ్లకు ఎన్నాళ్లకు దొరుకుతుందో చెప్పడం ఎవరి వల్లా కాదు.
ఇంత వరకూ వాన రాక, ప్రాణం పోవడం ఎవరికీ తెలియదనే నానుడి గురించి విన్నాం. ఇప్పుడు ఆ సామెతకు అదనంగా ఇసుక దొరకడం అనేది కూడా చేర్చాల్సిన పరిస్థితి. సామాన్యులకు ఇసుక అందని ద్రాక్షలా మిగిలిందనే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ సామాన్యుల ఇసుక బాధల్ని జగన్ సొంత పత్రిక సాక్షి ఆవిష్కరించింది. “ఇబ్బంది లేకుండా ఇసుక” శీర్షికతో నేడు ఆ పత్రికలో ఓ కథనం వచ్చింది.
ఈ కథనంలో మొట్ట మొదటి వాక్యాలే ఇసుక సరఫరాలో జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కట్టాయి.
“ఇసుక కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా కోరినంత సరఫరా చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలాఖరు నుంచి ఎక్కడా ఇసుక లేదనే మాట లేకుండా అడిగినంత అందించాలని నిర్ణయించింది.
రాజకీయ జోక్యానికి ఏమాత్రం తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక అందించనుంది. అనుభవం, అర్హత కలిగిన పెద్ద సంస్థలకు ఇసుక నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది” …ఇలా సాగింది సాక్షి కథనం.
అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కోరినంత సరఫరా చేసేలా ప్రభుత్వం ఇంకా కసరత్తు చేయడం ఏంటి? వచ్చే నెల నుంచి అడిగినంత అందించాలని నిర్ణయం తీసుకుందంటే …ఇంత వరకూ లేదనే వాస్తవాన్ని జగన్ సొంత పత్రికే చెప్పడం గమనార్హం. రాజకీయ జోక్యానికి తావు లేకుండా అనే మాట కేవలం కాగితాలకే పరిమితమైంది.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇసుకను ఎక్కడికక్కడ దొరికిన కాడికి దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షి కథనంలోనే జవాబుదారీతనంతో ఇసుక అందించనుంది అని రాశారంటే… ఇంత వరకూ లేదనే కదా అర్థం.
జగన్ సర్కార్‌కు బాగా చెడ్డ పేరు తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉందా? అంటే అది ఇసుక అనే చెప్పాలి. చంద్రబాబు పాలనలో ఇసుక సులభంగా దొరికేది. పైగా ఇప్పుడు నిబంధనలు పెరిగి, అసలుకే మోసం వచ్చిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. జగన్ పాలనలో ఇసుక తెచ్చుకోవాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు అది ఎప్పుడొస్తుందో ఆ దేవునికే తెలియని పరిస్థితి.
గత ప్రభుత్వంలోని పథకానికి సంస్కరణ చేయడం అంటే, అది మరింత మెరుగ్గా ఉండి, ప్రజలకు సులభంగా చేరువయ్యేలా ఉండాలి. అయితే ఇసుక పాలసీ విషయానికి వస్తే …జగన్ సర్కార్‌కు ఒక విజన్ లేకపోవడంతో అది ఒక గుదిబండగా మారిందనే విమర్శలు లేకపోలేదు.
నదీ పరిసర ప్రాంతాల ప్రజలు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం చెబుతున్నా … క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు సీఎం సొంత జిల్లాలో పెన్నా నుంచి ప్రొద్దుటూరుకు ఇసుకను ఎడ్ల బండ్లపై తరలిస్తూ వందలాది మంది గతంలో ఉపాధి పొందేవారు.
ఇప్పుడు కనీసం పెన్నా నదిని ఊరికే చూద్దామన్నా చూడ నివ్వని దుస్థితి. ఇసుకో రామచంద్రా అని సామాన్యులు మొరపెట్టుకుంటున్నా …ఆలకించే పాలకులు కరువైన పరిస్థితి. ఈ విషయాలు సీఎంకు తెలిసి జరుగుతున్నాయని ఎవరూ అనుకోవడం లేదు. కానీ సీఎం జగన్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.