అసెంబ్లీకి టీడీపీ హాజరుపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకున్నారు. నిన్నటి మొన్నటి వరకూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ఊదరగొట్టిన టీడీపీ… తాజాగా నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశమైంది.
ఏపీ అసెంబ్లీని కౌరవ సభగా చంద్రబాబు అభివర్ణించారు. తామే కౌరవసభగా విమర్శించిన సభకు వెళితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ సమావేశంలో టీడీపీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలి సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సూచనతో మిగిలిన సభ్యులు ఏకీభవించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో చట్టసభల సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై ఉత్కంఠకు తెరపడింది. శాసనసభ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వర్చువల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నామని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని చెప్పారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలపై చర్చించే వాళ్లన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గత మూడేళ్లలో విపక్షాలతో ప్రభుత్వం చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.