ఉక్రెయిన్ లోని పలు పట్టణాలు, నగరాలపై పట్టును సాధిస్తున్న రష్యన్ బలగాలు అక్కడ అత్యాచారాలకు తెగబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి బాధిత దేశం నుంచి. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. రష్యన్ సైనికులు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలను చేస్తున్నారని ఆరోపించారు.
రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్ పట్టణాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. జనావాసాలపై రష్యన్ సైన్యాల దాడి పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మంది ప్రజలను రష్యన్ సైనికులు కాల్చి చంపుతున్నారని కూడా యుద్ధ వార్తల్లో పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్ లో రష్యా అకృత్యాలు రానున్న రోజుల్లో మరింత తీవ్రం కావొచ్చని అమెరికా అంటోంది. ఉక్రెయిన్ పై రష్యాకు ఇప్పటి వరకూ పూర్తిగా పట్టు చిక్కని నేపథ్యంలో.. ఈ అసహనంలో రష్యన్ బలగాలు మరిన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చనే అభిప్రాయాలు అమెరికా వైపు నుంచి వినిపిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు ఉక్రెయిన్ మంత్రి తమ దేశ మహిళలపై రష్యన్ బలగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారని మరో తీవ్రమైన అంశాన్ని ప్రస్తావించారు. అయితే రష్యా మాత్రం జనసామాన్యాన్ని తాము దృష్టిలో పెట్టుకున్నట్టుగా చెబుతోంది. జనావాసాల ప్రాంతాల్లో ప్రజలు ఎటు వారు అటు సర్దుకోవడానికి ఐదు గంటల పాటు కాల్పుల విరమణను ప్రకటించింది రష్యా.