35 ఏళ్ల భర్త, 33 ఏళ్ల భార్య, 12 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు. వాళ్లతో బాటు యింకో ఏడుగురు. అందర్నీ కెనడాలోని మనిటోబా ప్రాతం నుంచి స్టీవ్ షాండ్ అనే అమెరికాలోని ఫ్లారిడా నివాసి 15 సీటరు వ్యాన్‌లో ఎక్కించుకుని జనవరి 18 రాత్రి అమెరికా సరిహద్దు వరకు తీసుకెళ్లాడు. ఒక పాయింటు దగ్గరకు వెళ్లాక ‘ఇంతకంటె ముందుకు తీసుకుని వెళ్లడం కుదరదు. ఇక్కడ దిగిపోయి, ఎముకలు కొరికే యీ చలిలో, యీ చీకటిలో, యీ మంచులో 11 గంటల పాటు నడిస్తే అమెరికాలోని ఎమర్సన్ గ్రామానికి చేరగలరు. వెళ్లగలరా?’ అని అడిగాడు. ‘ఎక్కడో ఇండియాలోని గుజరాత్ నుంచి యింతదూరం వచ్చి, ఎలాగోలా వెళ్లకపోతే యింకెందుకు? మమ్మల్ని దింపేసి నువ్వు వెళ్లిపో. పగలైతే పట్టుబడతాం కదా! చీకట్లో, యిలాటి వాతావరణంలో సెక్యూరిటీ గార్డులు కూడా బయటకు రారు. ఇప్పుడైతేనే సులభంగా బోర్డరు దాటగలం’ అన్నారు. అతను వెళ్లిపోయాడు. మర్నాడు జనవరి 19న, కెనడా అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ వ్యాన్‌లో ఇద్దరు ఇండియన్ ప్రయాణికులు ఉన్నారు. అతనిచ్చిన సమాచారం ప్రకారం ఈ 11 మందిని వెతకబోయారు.
అవేళ రాత్రి ఈ 11 మంది గుంపుగా నడుస్తూ వెళ్లారు. మైనస్ 35 డిగ్రీల చలిలో అష్టకష్టాలు పడుతూ నడిచారు. కానీ ఎక్కడో కానీ జగదీశ్ కుటుంబం దారి తప్పారు. దారి అడుగుదామన్నా కనుచూపు మేరలో ఎవరూ లేరు. చలికి గడ్డకట్టుకుని పోతూ నడిచారు, నడిచారు. చాలా సేపటికి యిక నడవలేకపోయారు. కుప్పకూలి అసువులు బాసారు. మర్నాడు రాత్రి కెనడా అధికారులు వాళ్ల శవాలను కనుగొన్నారు. అవి అమెరికా సరిహద్దులకు జస్ట్ 30 అడుగుల దూరంలో ఉన్నాయి, సినిమాల్లో చూపించినట్లే! ఆ శవాలను గుర్తుపట్టే ప్రక్రియ మొదలుపెడితే భర్త పేరు జగదీశ్ పటేల్ అని భార్య పేరు వైశాలి అని, పిల్లల పేర్లు విహంగీ, ధార్మిక్ అనీ గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలోని డింగుచా గ్రామానికి చెందినవారని తెలిసింది. ఎక్కడ పుట్టారు! ఎక్కడ ఏ పరిస్థితుల్లో మరణించారు! వినగానే కళ్లు చెమరుస్తాయి. మరుక్షణంలోనే పెద్దవాళ్లను తలుచుకుని చికాకు, కోపం వస్తాయి. పిల్లల్ని తలచుకుని వెక్కివెక్కి ఏడవబుద్ధవుతుంది.
జీవితంలో పైకి రావాలనీ, దూరతీరాలకైనా వెళ్లి కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనీ ఆశయం ఉండడంలో తప్పు లేదు. మానవప్రగతికి అది అవసరం కూడా! కానీ క్రమపద్ధతుల్లో కాకుండా అక్రమపద్ధతుల్లో వెళ్లాలనుకోవడం తప్పే. మనిషన్నాక తప్పులు చేయకుండా వుండడు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేశాడన్నది కోర్టు సైతం పరిగణనలోకి తీసుకునే అంశం. కూటికోసం, కూలికోసం గల్ఫ్‌కి వెళ్లి అక్కడ జైల్లో పడినవాళ్ల వార్తలు విన్నాం, గాథలు చదివాం. ఇప్పుడీ జగదీశ్ సంగతి వినగానే నాకు మొదటగా తట్టినది, ఎప్పుడో చదివిన కథ. గల్ఫ్‌కి దొంగ వీసాలపై వెళ్లిన కొందరు తెలుగు కార్మికులు, ఒక దేశం నుంచి మరొక దేశానికి పారిపోవడానికి కాంక్రీట్ మిక్సర్ వ్యాన్‌లో దాక్కుని, ఆ వాసన భరిస్తూ వెళుతూంటారు. పెద్ద పొట్టతో వుంటుంది కాబట్టి ఎవరూ కనుక్కోలేరని వాళ్ల అంచనా. ‘‘పుష్ప’’ సినిమాలో మిల్క్ వ్యాన్ పైన సౌండు, కింద సౌండు తేడా రావడంతో పోలీసులకు అనుమానం వచ్చినట్లే, అక్కడి పోలీసులకు అనుమానం తగిలి, మిక్సర్‌ను ఆన్ చేయమంటారు. ఇంకేముంది? ఆ బ్లేడులు మనుష్యులను ఖండఖండాలుగా నరికేస్తాయి. రక్తం కిందకు పారుతుంది.
ఆ కథలో బీభత్సాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రచయిత కల్పనో, లేక నిజంగా జరిగితే కథలా చెప్పారో నాకు తెలియదు. ఈ జగదీశ్‌ది మాత్రం వాస్తవం. అలాటి ఘోరపరిస్థితుల్లో మరణాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రయాణిస్తున్న విమానం కూలినా దిక్కుమాలిన చావు రావచ్చు. కానీ యిది కోరి తెచ్చుకున్న చావు. గల్ఫ్ కూలీలైతే పొట్ట గడవక ఎడారికి వెళ్లి దుర్మరణం పాలయ్యారు. కానీ ఈ జగదీశ్ కేసు అలాటిది కాదే! వాళ్లది భూమీపుట్రా ఉన్న కుటుంబం. ధనికులు కాదు కానీ, ఎగువ మధ్యతరగతి కుటుంబమే! అతను చదువుకున్నవాడు. టీచరుగా ఉద్యోగం చేశాడు. అతని భార్యా టీచరుగా చేసింది. వేరేవేరే ఊళ్లలో ఉద్యోగం చేయాల్సి వస్తోందని, మూడేళ్ల క్రితం జగదీశ్ టీచరు ఉద్యోగం మానేసి, భార్య ఉద్యోగం చేస్తున్న కలోల్ అనే వూళ్లో అన్నగారితో కలిసి బట్టల వ్యాపారం చేశాడు. తర్వాత అది వదిలేసి వచ్చి కుటుంబానికి 15 ఎకరాల భూమి వుంటే వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వూళ్లో గోధుమ, జొన్న, యితర పంటలు బాగా పండుతాయి. మరి ఇలాటివాడికి వీసా లేకుండా అక్రమంగా అమెరికా వెళ్లాలన్న కోరిక ఎందుకు పుట్టింది?
ఎందుకంటే ఆ వూరి నీటి మహిమ అలాటిది. అది గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు 3,600 జనాభా ఉన్న చిన్న పల్లెటూరు. అయినా తరతరాలుగా విదేశాలకు వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. 1950, 60ల నుంచి ఆ వూరి నుంచి స్టడీ వీసాపై అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడసాగారు. సుమారు 70 కుటుంబాలలో ఎవరో ఒకరు ఫారిన్‌లో వున్నారు, ముఖ్యంగా పటేల్ కులస్తుల కుటుంబాల నుంచి! ఇంత చిన్న వూళ్లో, గోడల మీద వీసా ఏజంట్ల యాడ్స్ రాసి వుంటాయి. ‘యుకె, కెనడా యూనివర్శిటీలలో చదువుకై వీసాలు ఏర్పాటు చేస్తాం. ఇంగ్లీషు ప్రావీణ్యం పరీక్షించే ఐఇఎల్‌టిఎస్ పరీక్ష పాసు కానక్కరలేదు’ అంటూ. వీళ్లు వెళ్లేది చదువు, చట్టుబండల కోసం కాదని అందరికీ తెలుసు. వెళ్లి అక్కడి గుజరాతీల షాపుల్లో చవకగా చాకిరీ చేయడానికే!
1950ల నుంచి అమెరికా వెళుతున్న గుజరాతీ పటేళ్లలో అక్కడ ఉన్నత ప్రభుత్వోద్యోగాలేమీ చేయడం లేదు. సూపర్ మార్కెట్, పెట్రోలు బంకు, మోటెల్ (మెయిన్ రోడ్డు మీద కారులో ప్రయాణం చేసేవారు రాత్రి పూట బస చేసేందుకు అట్టహాసాలేమీ లేకుండా కట్టిన వసతిగృహం) యిలాటి బిజినెస్సుల్లో కష్టపడి రాణించారు. ముఖ్యంగా మోటెల్ అనేదానికి పటేల్ పర్యాయపదంగా మారింది. అమెరికాలోని హాస్పిటాలిటీ యిండస్ట్రీలో 40% గుజరాతీలదే అంటే వారి కున్న ఆర్థికశక్తి ఎలాటిదో ఊహించుకోండి. ప్రభుత్వనియమాలు అధిగమించడానికి అడ్డదారులు ఎలా కనిపెట్టాలో, స్థానిక అధికారులను డబ్బుతో ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలిసినవారిలో గుజరాతీలు ప్రథమ లేదా ద్వితీయ స్థానాల్లో వుంటారు. అమెరికాలోనైనా వాళ్లు అదే చేయగలుగుతున్నారు.
అంతేకాదు, గుజరాతీలు ఎక్కడికి వెళ్లినా సంఘటితంగా ఉండి ‘గుజరాతీ సమాజ్’ ఏర్పాటు చేసుకుని, ఒకరికి మరొకరు సాయం చేసుకుంటూ స్థానికంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతూ, ప్రభుత్వాన్ని, రాజకీయనాయకులను, వ్యాపారవేత్తలను, సంఘప్రముఖులను ఒత్తిడి చేయగల సామర్థ్యం సంపాదించుకుంటారు. ఇది యిప్పుడు వచ్చినది కాదు, దక్షిణాఫ్రికాలో స్థిరపడిన గుజరాతీలు తమ తరఫున కోర్టులో వాదించడానికి గాంధీని పిలిపించారని గుర్తు చేసుకోండి. అలాగే ఉగాండాలో గుజరాతీల ప్రాబల్యం మరీ ఎక్కువై పోయిందనే ఈదీ అమీన్ వాళ్లను తరిమివేశాడు. ఉగాండా నిర్వాసితులు యుకెలో స్థిరపడి ఎంత వర్ధిల్లారో చాలా ఏళ్ల క్రితం ఆర్టికల్ రాశాను కూడా. ఇప్పటికీ ఆఫ్రికాలోని అనేక దేశాల్లో గుజరాతీలు బలీయమైన శక్తి.
గుజరాతీ వ్యాపారస్తులు తమ వ్యాపారసంస్థల్లో ఉద్యోగులుగా స్థానికులను తీసుకోవడానికి యిష్టపడరు. గుజరాత్‌లోని తమ బంధువులు, గ్రామస్తులు, తెలిసినవారిని మాత్రమే రప్పించి, వాళ్లను ఉద్యోగులుగా పెట్టుకుంటారు. అందరూ బాగా కష్టపడతారు కాబట్టి, జీవితంలో పైకి రావడంలో వింతేమీ లేదు. వీళ్ల అభివృద్ధి చూసి, స్థానికులకు కన్నుకుట్టి, వీళ్లు రాకుండా చేయమని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూంటారు. గుజరాతీ యింటిపేరు వుంటే చాలు, అమెరికా వీసాలు తిరస్కరించడం ఎప్పణ్నుంచో జరుగుతోంది. అయినా గుజరాతీల్లో విదేశీ వ్యామోహం తగ్గటం లేదు. సక్రమ మార్గాలు మూసుకుని పోయాయి కాబట్టి, అక్రమ మార్గాల్లో వెళ్లడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఎలాగోలా అమెరికా చేరిపోతే చాలు, అక్కడ అతనికి ఉద్యోగం యిచ్చిన యజమాని తన పలుకుబడితో యీ చౌక కార్మికుణ్ని కాపాడేస్తాడు. ఇతని మీద ఫిర్యాదు చేసేవాళ్లెవరూ ఉండరు. ఏదైనా తేడా వస్తే ఆదుకోవడానికి గుజరాతీ సమాజ్ వాళ్లున్నారు. ఆ ధైర్యంతోనే అక్రమంగా వెళ్లేందుకు మార్గాలు పట్టేందుకు గుజరాతీలు రకరకాల దారులు వెతుకుతున్నారు.
2007లో అమెరికన్ ప్రభుత్వం ఫిర్యాదుపై విచారణ జరపగా తెరాస ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య అనే అతను డబ్బు తీసుకుని అనూరాధా పటేల్ అనే ఓ గుజరాతీ స్త్రీని తన భార్యగా ప్రకటించి అమెరికా పంపించాడని తేలింది. దానిపై రగడ రావడంతో కెసియార్ తన డిప్యూటీ ఆలె నరేంద్ర కూడా అలాటి హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడని ఆరోపించి, పార్టీలోంచి సస్పెండ్ చేశాడు. దానిపై నరేంద్ర కెసియారే ఐదుగురు గుజరాతీలను దొంగ డాక్యుమెంట్లతో ఫారిన్ పంపించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. లింగయ్యపై కేసు నమోదు చేయడానికి అప్పటి రాష్ట్రప్రభుత్వం అనుమతి యివ్వలేదు. చివరకు 2015లో లింగయ్య బిజెపిలో చేరాక తెరాస ప్రభుత్వం 2016లో అనుమతి యిచ్చింది.. 2021లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు కొట్టేసింది. అనూరాధా పటేల్ ఆనుపానులు తెలియలేదు. ఇలా అక్రమంగా వలస వెళ్లడానికి రాజకీయ నాయకులే తోడ్పడుతున్నపుడు యీ వ్యాపారం వర్ధిల్లక ఏమవుతుంది?
భారత జనాభాలో గుజరాత్ జనాభా 6% మాత్రమే. కానీ అమెరికాలో పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పిఐఓ)లలో గుజరాతీల శాతం 20! ట్రంప్ జమానాలో (2017-21)లో వలసలను నియంత్రించడంతో అక్రమ వలసలు పెరిగాయి. గుజరాత్ పోలీసులు, సామాజిక సంస్థలు కలిసి తయారుచేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు పది రెట్లు పెరిగి 2021-22లో 900కి చేరాయట. అమెరికాలోని న్యూ అమెరికన్ ఎకానమీ అనే సంస్థ అంచనా ప్రకారం 2020లో అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన అక్రమ వలసదారుల సంఖ్య 5 లక్షలట! వాళ్ల ఆదాయం మొత్తం కలిపితే రూ.1.20 లక్షల కోట్లట!
గుజరాత్ నుంచి అమెరికాకు అక్రమ రవాణా మూడు మార్గాల్లో జరుగుతోందిట. మొదటిది అహ్మదాబాద్-దిల్లీ- కెనడాలోని టొరెంటో- అమెరికా రూటు. కెనడా యూనివర్శీటీల్లో భారతీయ విద్యార్థులకు సులభంగా స్టూడెంటు వీసాలు దొరుకుతున్నాయి. చదువు పేరు చెప్పి కెనడాకు చెక్కేయడం. అక్కణ్నుంచి సందు చూసుకుని అమెరికాలోకి దూరడం. ఇక రెండో రూటు అహ్మదాబాద్-దిల్లీ-టర్కీ-మెక్సికో-అమెరికా. ఇది చాలా పాప్యులర్. మెక్సికో, అమెరికా బోర్డు అతి సులభంగా దాటేయవచ్చు. అందుకే ట్రంప్ గోడ కడతానన్నాడు. మెక్సికోకు వీసా దొరకడం కష్టమేమీ కాదు. ఇక మూడోది అహ్మదాబాద్-ముంబయ్-ఉగాండా-కీన్యా- మెక్సికో-అమెరికా రూటు. ఉగాండాలో, కీన్యాలో గుజరాతీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాజకీయంగా చాలా పలుకుబడి కలిగివున్నారు. అక్కణ్నుంచి మెక్సికోకు వెళ్లి అమెరికాలో చొరబడతారు.
అమెరికాకే కాదు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు కూడా గుజరాత్‌లోని పల్లెటూళ్ల నుంచి అక్రమవలసలు జరుగుతున్నాయి. వీసా ఏజంట్లు చాలా తెలివిగా వ్యవహరిస్తూ వలసదారుణ్ని మొదట శ్రీలంక, సింగపూరు లాటి వాటికి టూరిస్టులుగా పంపి, వెనక్కి రప్పిస్తారు. కెనడాకు కూడా టూరిజం గురించే వెళ్తున్నారని నమ్మించి వీసా తీసుకుని, పంపించేస్తారు. అక్కణ్నుంచి అమెరికాకు జంప్. అమెరికాకు పంపాలంటే సాధారణంగా పెద్దవాళ్లకు తలకు రూ.75 లక్షలు, పిల్లలకు రూ. 25 లక్షలు తీసుకుంటారు. ముందు కొంత అడ్వాన్సు తీసుకుని, సదరు వ్యక్తి అడంగు చేరానని కుటుంబసభ్యులకు తెలపగానే, తక్కిన డబ్బు వసూలు చేస్తారు.
ఈ పద్ధతిని ఆసరా చేసుకుని మోసం చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఈ మధ్య వీసా ఏజంట్లు యిలాటి 15 మందిని (అందరూ పటేళ్లే) దిల్లీ దాకా తీసుకెళ్లి ఓ గదిలో పెట్టి బంధించి, పీక మీద కత్తి పెట్టి, యింటికి ఫోన్ చేసి గమ్యం చేరామని చెప్పమని బలవంత పెట్టారు. వాళ్లలా చెప్పాక వెళ్లి రూ. 3.50 కోట్ల డబ్బు వసూలు చేసుకుని మాయమై పోయారు. ఆశావహులు యింటికి తిరిగి వెళ్లి లబోదిబో మంటూ ఫిబ్రవరి 13న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యిది బయటకు వచ్చింది. 39 ఏళ్ల మితేశ్ పటేల్‌దీ యిలాటి కథే. రూ.1.11 కోట్లు యిస్తే అతన్నీ, భార్యనీ, యిద్దరు పిల్లల్ని కెనడా పంపేస్తామని చెప్పి ఓ ఏజంటు 2021 నవంబరులో కలకత్తా తీసుకెళ్లి ఓ హోటల్‌లో బంధించాడు. మితేశ్ కూతుర్ని తీసుకెళ్లి వేరే రూములో బంధించి రూ.25 లక్షలు అదనంగా యిస్తే తప్ప వదలనన్నాడు. అది ఇచ్చాక మీ దగ్గరున్న బంగారం, డాలర్లు యివ్వమన్నాడు. మొత్తం మీద మితేశ్ రూ.1.57 కోట్లు పోగొట్టుకుని యింటికి వచ్చి పోలీసులకు చెప్పుకుని భోరుమన్నాడు.
కలోల్ నివాసి విష్ణు పటేల్ తన మేనల్లుడు విశాల్‌ను, అతని భార్య రూపాణీని దిల్లీ మెక్సికో రూటు ద్వారా అమెరికాకు పంపడానికి అహ్మదాబాదులోని ఏజంటు ఋత్విక్ పటేల్‌తో రూ.1.10 కోట్లకు బేరమాడుకున్నాడు. వాళ్లు ఇండియా నుంచి బయలుదేరడానికి ముందే ఏజంటు రూ. 50 లక్షలిమ్మని డిమాండు చేయడంతో యితను యివ్వనన్నాడు. దాంతో గుర్తు తెలియని వ్యక్తులు విష్ణుపై కాల్పులు జరిపారు. ఋత్వికే దానికి కారణమంటూ అతను ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాటి కేసులు కొన్ని బయటకు వచ్చాయి, మరి కొన్ని రాలేదు. 2019 సెప్టెంబరులో దిల్లీ నుంచి న్యూయార్కు వెళ్లే ఫ్లయిట్ ఎక్కబోతున్న 81 ఏళ్ల వృద్ధుడిపై అనుమానం వచ్చి, అతనున్న వీల్ ఛెయిర్‌లోంచి లేపి ఆపాదమస్తకం పరీక్షించారు. చంకల్లో వెంట్రుకలు నల్లగా వుండడంతో విషయం బయటకు వచ్చింది. అతను 39 ఏళ్ల జయేశ్ పటేల్. అహ్మదాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు.
ఇవన్నీ తెలిశాక జగదీశ్ కుటుంబం చేసిన సాహసం మరీ అంత అరుదైనది కాదని అర్థమవుతుంది. ఇలాటి ప్రమాదాలు ఉన్నాయని తెలిసినా, జగదీశ్ రిస్కు తీసుకున్నాడు. ఏజంటుకు రూ.1.5 కోట్లు చెల్లించాడు. ఇతన్ని పంపించిన ఏజంటుకు గత మూడేళ్లలో 10 గుజరాతీ కుటుంబాలను కెనడానుంచి యుఎస్‌లోకి అక్రమంగా తరలించిన అనుభవం ఉందన్న ధైర్యం అతనిది. జగదీశ్ కుటుంబం జనవరిలో ఇండియా నుంచి బయలుదేరింది. కెనడాకు టూరిస్టు వీసాపై వెళ్లింది. జనవరి 15న జగదీశ్ యింటికి ఫోన్ చేసి గమ్యం చేరాం అని చెప్పాడు. కుటుంబం ఆ విషయం ఊళ్లో ఎవరికీ చెప్పలేదు. సరదాగా ఊళ్లు తిరగడానికి వెళ్లారనే చెప్పారు. సొంత గ్రామానికి 11వేల మైళ్ల దూరంలో భార్య, పిల్లలతో సహా చలికి గడ్డకట్టుకుని చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఊళ్లోవాళ్లకి సర్వం తెలిసిపోయింది. కానీ జగదీశ్ అనుభవంతో తక్కినవారు నేర్చుకుంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. పంజాబ్ నుంచి కెనడాకు, గుజరాత్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేవాళ్లు పెరుగుతూనే వుంటారు.
ఇప్పుడీ సంఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు కొందరు పటేల్ నాయకులు. ‘ప్రాణాలకు తెగించి, పటేల్ యువతీయువకులు ఎందుకు విదేశాలకు వెళుతున్నారు? ఇక్కడ ఉద్యోగావకాశాలు లేకనే! ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు యివ్వటం లేదు, ఉపాధికల్పనకై ఏమీ చేయటం లేదు.’ అని విరుచుకుని పడుతున్నారు. ఇలా పడేవారిలో మొన్నటిదాకా ఉపముఖ్యమంత్రిగా చేసిన బిజెపి నాయకుడు నితిన్ పటేల్ కూడా ఉన్నాడు. జనవరి 21 మెహసాణాలో యీ ప్రకటన చేశాడు. వెంటనే ప్రభుత్వ ప్రతినిథి దాన్ని ఖండిస్తూ గత ఐదేళ్లలో మేం 2 లక్షల ప్రభుత్వోద్యోగాలిచ్చాం. రాబోయే పదేళ్లలో ఉద్యోగకల్పన గురించి ప్రణాళికలు సిద్ధం చేశాం.’ అన్నాడు. ఏది ఏమైనా అత్యాశే జగదీశ్‌ను, అతన్ని కుటుంబాన్ని మృత్యుపరిష్వంగంలోకి పంపిందన్నది నిజం. వలస వెళ్లడం తప్పు కాదు. కానీ అక్రమంగా వెళ్లడమే అన్ని అనర్థాలకూ కారణం. అక్రమంగా యుకెకు వలస వెళ్లినవారు పడే క్షోభ గురించి దేవ్ ఆనంద్ తన దర్శకత్వంలో ‘‘దేశ్ పర్దేశ్’’ (1978) అనే చక్కటి సినిమా తీశాడు.
క్రమపద్ధతిలో వెళ్లినా వలస కార్మికులు విదేశాల్లో పడే క్షోభ గురించి 1974లో తీసిన ‘‘ఫియర్ ఈట్స్ ద సోల్’’ (ఈ ఇంగ్లీషు టైటిల్‌కు ముందు ‘ఆలీ’ అని కూడా అప్పుడప్పుడు పెడుతూంటారు) అనే ఫ్రెంచ్ సినిమా చాలా బాగుంటుంది. ఫాస్‌బైండర్ అనే జర్మన్ దర్శకుడు ఒక వృద్ధ జర్మన్ మహిళకు, మొరాకో నుంచి జర్మనీకి వచ్చి పని చేస్తున్న ఒక 35 ఏళ్ల అతనికి మధ్య ఏర్పడిన వైవాహిక బంధం గురించి చెప్తాడు. ఆమె కుటుంబం, సమాజం అతన్ని ఆమోదించదు. క్రమేపీ ఆ మహిళ యితన్ని చిన్నచూపు చూస్తుంది. నిరాశానిస్పృహలతో యితను ఒక జర్మన్ బార్‌గర్ల్‌తో సంబంధం పెట్టుకుంటాడు. చివరకు వారి కాపురం చక్కబడుతోం దనుకుంటూండగా అతని కడుపులో అల్సర్ పగిలి ఆసుపత్రి పాలవుతాడు. డాక్టరు చెపుతాడు – వలస కార్మికులుగా వచ్చినవారందరికీ మానసిక ఆందోళన కారణంగా యీ అల్సర్ బాధ తప్పదనీ, ఆపరేషన్ చేసినా మళ్లీ వస్తుందనీ వివరిస్తాడు. సినిమా ముగుస్తుంది.
క్రమపద్ధతిలో వెళ్లినా వివక్షత కారణంగా అంతటి ఆందోళన వుంటే, యిక అక్రమంగా చొరబడో, వీసా గడువు పూర్తయిపోయినా అక్కడే వుంటే, ఎప్పుడు పట్టుబడుతామో తెలియక నిత్యం అల్లాడేవారి ఆరోగ్యం ఏమవుతుందో ఊహించుకోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)