ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సాగినట్టుగా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి ముఖ్యమంత్రులు చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇరు రాష్ట్రాలూ పరస్పరం సహకరించుకునే అంశాల గురించి కూడా మాట్లాడుకున్నట్టుగా సమాచారం. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముఖ్యమంత్రులు మాట్లాడినట్టుగా సమాచారం.
అయితే జనాలకు వీటిపై పెద్దగా ఇంట్రస్ట్ లేదు. ఈ సమావేశం బీజేపీని వ్యతిరేకించడానికి అంటూ జాతీయ మీడియా హైలెట్ చేసింది. ఆ మీడియాకు అదే మసాలా. ఇక కేసీర్ వద్దకు జగన్ వెళ్లాడు కాబట్టి.. దీన్నో
రాజకీయాంశంగా మలుచుకోవడానికి టీడీపీ, దాని మీడియా వర్గాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి.
ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా గోదావరి, కృష్ణానదులు అనుసంధానం గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రతిష్టాత్మక ప్రయత్నాన్ని ఫలప్రదం చేయడానికి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైనం స్పష్టం అవుతోంది.
అలాగే ఈ సమావేశం సందర్భంగా కేసీఆర్ ను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా జగన్ వెంట ఉన్నారు. టీటీడీలో ప్రస్తుతం వచ్చిన మార్పులను కేసీఆర్ ప్రశంసించినట్టుగా సమాచారం.
ఇక కేంద్రం రాష్ట్రాలకు సాయం చేయడం లేదని, రాకీయం దృష్ట్యా.. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అలాగే రివర్స్ టెండరింగ్, తెలుగుదేశం పార్టీ పట్ల జగన్ అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ ప్రశంసించినట్టుగా సమాచారం.