తిరుపతి లోక్ సభ సీటు ఉప ఎన్నిక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ స్పష్టతను ఇచ్చింది. మరణించిన ఎంపీ దుర్గాప్రసాదరావు కుటుంబీకులెవరికీ తిరుపతి ఎంపీ టికెట్ దక్కడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కల్యాణ్ కు ఎమ్మెల్సీ నామినేషన్ ఇవ్వబోతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయంలపై సదరు కల్యాణ్ కూడా స్పందించారు.
తమ కుటుంబం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు అండగా నిలిచారన్నారు. తనకు ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తున్నందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞత వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో పార్టీ తరఫున ఎవరు నిలిచినా వారితో కలిసి ప్రచారం చేసి పార్టీని గెలిపించుకునేందుకు పని చేయబోతున్నట్టుగా కల్యాణ్ ప్రకటించారు.
ఇలా తిరుపతి బైపోల్ అభ్యర్థిత్వం విషయంలో సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకోలేదని స్పష్టం అవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక కొత్త వ్యక్తి తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ రిజర్వడ్ నియోజకవర్గంలో ఒక డాక్టర్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టబోతోందని సమాచారం. ఇప్పటి వరకూ ఆయన ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని కూడా స్పష్టం అవుతోంది.
ఇప్పటికే టీడీపీ ఈ సీటుకు అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ పోటీకి బీజేపీ కూడా ఉబలాటంతో ఉంది. జనసేన ఏం చేస్తుందో.. ఇంకా డిసైడ్ చేసుకున్నట్టుగా లేదు. ఇప్పుడు బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబానికి వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించడం లేదనే స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. తిరుపతి బైపోల్ సానుభూతుల లెక్కల్లో కాకుండా.. ప్రజల వేవ్ ఎలా ఉందో పూర్తి స్పష్టతను ఇచ్చేలా సాగేలా ఉంది!