గత కొన్నేళ్లుగా ప్రజలను తిట్టడం అలవాటుగా మారింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం కోల్పోయాకా మరో రకంగా ఆయన ప్రజలను నిందిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మరోసారి ఆయన ప్రజలపై విరుచుకుపడ్డారు. వరద బాధిత ప్రాంతాలకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఆప్యాయంగా పలకరించారంటూ చంద్రబాబు నాయుడు వారిని నిందించడం విశేషం!
వరదలు వస్తే అలా స్పందిస్తారా? అన్నట్టుగా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. మరి ఫ్రస్ట్రేషన్ తోనే చంద్రబాబు నాయుడు ఇలా స్పందించారా, లేక ఆయన మానసిక స్థితి ప్రకారమే ప్రజలను నిందించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోందిప్పుడు.
ఓట్లు తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయండి.. అంటూ కొన్నాళ్ల కిందట పబ్లిక్ ను చంద్రబాబు నాయుడు నిందించారు. అలాగే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓటేశారంటూ కూడా నిందించారు. ఇక తను ఎవరి కోసం పోరాడుతున్నట్టు? అంటూ కూడా కొన్ని సార్లు ప్రజలను నిలదీశారు.
తను తన కోసం కాదని.. వాళ్ల కోసం పోరాడుతున్నట్టుగా చెప్పుకున్నారు. ఇక గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమరావతిని ఎక్కడైనా తీసుకెళ్లిపోవచ్చని రాసినచ్చేసినట్టే అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో ఆ కార్పొరేషన్లలో టీడీపీ చిత్తయిన సంగతి తెలిసిందే.
చివరకు ప్రజలను నిందించడమే చంద్రబాబుకు మిగిలిన ఏకైక పనిలాగుంది. ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిలదీయాలని చంద్రబాబు ఆశించి ఉండవచ్చు. అయితే ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఎలా స్పందించిందనే అంశం మీద స్పందిస్తారు. జగన్ ను చంద్రబాబు ఆశించినట్టుగా ప్రజలు నిలదీయలేదంటే ప్రభుత్వం సవ్యంగా పని చేసిందని ప్రజలే చెప్పినట్టు.
ఈ నేపథ్యంలో ప్రజలను నిందిస్తూ చంద్రబాబు మాట్లాడటం ఆయననో కామెడీ పీస్ ను చేస్తోంది. చంద్రబాబు మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే విపరీతంగా షేర్ చేస్తోందంటే.. చంద్రబాబు తీరు ఆ పార్టీకి ఎంత సానుకూలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు!