హీరోయిన్లు పోలీస్ పాత్రలు వేయడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఖాకీ ధరించారు. వీళ్లలో కొందరు సీరియస్ రోల్స్ చేస్తే, మరికొందరు ఖాకీతో కూడా కామెడీ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ పోలీస్ గా మారింది. ఈమె అమాయక పోలీస్.
నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆమె పేరు చారులత, ఓ పోలీస్. పాత్రలో ఫిట్ నెస్ ఉంది, ముఖంపై అందమైన చిరునవ్వు ఉంది, ఒంటిపై ఖాకీ డ్రెస్సు కూడా ఉంది. కాకపోతే ఆమె అమాయకురాలు.
‘సరిపోదా శనివారం’ సినిమాలో ప్రియాంక మోహన్ పాత్ర తీరుతెన్నులివి. వివేక్ ఆత్రేయ సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది, ఓ మేనరిజమ్ ఉంటుంది. ఇందులో ప్రియాంక పాత్రలో కూడా అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో లుక్ రిలీజైంది. ఇప్పుడు హీరోయిన్ లుక్ కూడా వచ్చేసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే నెల 29న విడుదల చేయబోతున్నారు. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని-ఆత్రేయ కాంబోలో వస్తున్న మూవీ ఇదే.