కుట్ర చేస్తున్నది ఎవరు సార్?

చంద్రబాబునాయుడు గారికి ఆగ్రహం పొంగుకొచ్చింది. సొంత పార్టీ ఎంపీల పుణ్యమాని… పోరాటాల పేరుతో ఇన్నాళ్లుగా ఇస్తున్న బిల్డప్ మొత్తం గంగలో కలిసిపోయే పరిస్థితి వచ్చేసరికి.. ఇదంతా కుట్ర, పోరాటాలను నీరుగార్చే ప్రయత్నం.. రాష్ట్ర అభివృద్ధిని…

చంద్రబాబునాయుడు గారికి ఆగ్రహం పొంగుకొచ్చింది. సొంత పార్టీ ఎంపీల పుణ్యమాని… పోరాటాల పేరుతో ఇన్నాళ్లుగా ఇస్తున్న బిల్డప్ మొత్తం గంగలో కలిసిపోయే పరిస్థితి వచ్చేసరికి.. ఇదంతా కుట్ర, పోరాటాలను నీరుగార్చే ప్రయత్నం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం అని ఆయన రంకెలు వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న దీక్షలు, పోరాటాలు ఎంత ప్రహసనప్రాయంగా ఉన్నాయో… వారి డిమాండ్ల గురించి వారిలోనే ఎంత చులకన భావం వ్యక్తం అవుతున్నదో.. సాక్షాత్తూ ఎంపీల మాటల్లో వ్యక్తం అయితే.. వీడియో రూపంలో రాష్ట్ర ప్రయోజనాల గురించిన వారి వెటకారపు మాటలు బయటకు వస్తే.. ఇప్పటికీ చంద్రబాబునాయుడు మాత్రం బుకాయించడానికే ప్రయత్నిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అక్కడికేదో రాష్ట్రం కోసం తెగించి పోరాటాలు చేసేస్తున్నట్లుగా అధినేత చంద్రబాబునాయుడు ఎంతగా డబ్బా కొట్టుకుంటున్నారో అందరికీ తెలుసు.

మొన్న మొన్నటి దాకా ఢిల్లీ ప్రభుత్వం స్పందించాల్సిన అంశాల మీద రాష్ట్రంలో పోరాటం చేస్తే ఏమొస్తుంది? అంటూ.. ప్రతిపక్షాలు చేసే దీక్షలను వెటకారం చేసిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వచ్చే సరికి.. పోరాటాల ముసుగులో సర్కారు సొమ్ము తగలేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి కూడా ప్రజలంతా గుర్తిస్తున్నారు.

అయితే వారి డిమాండ్ల విషయంలో ఆ పార్టీ వారికే ఎంత చిత్తశుద్ధి గౌరవం ఉన్నదో వారి మాటల్లోనే బయటపడుతోంది. సీఎం రమేష్ దీక్షకు మద్దతుగా ఢిల్లీలో విన్నపాలు చేయడం అనే మిష మీద హస్తిన కు వెళ్లిన తెదేపా ఎంపీలు, ఏపీ భవన్లో కూర్చుని ఎంత చులకనగా మాట్లాడుకున్నారో.. వీడియో బయటకు వచ్చింది.

‘నాకు ఓ అయిదు కిలోలు బరువు తగ్గాలని ఉంది.. నేను కూడా వారం రోజులు దీక్ష చేస్తా..’ అంటూ మురళీమోహన్ వెటకారం చేస్తే.. జోను లేదు గీను లేదు అంటూ అవంతి  శ్రీనివాస్ మాటలు కూడా వీడియోలో బయటకు వచ్చాయి.

వీరందరికీ పెద్దదిక్కుగా అసలే హోదా, జోన్, ఉక్కు పరిశ్రమ తదితర అన్ని డిమాండ్ల గురించి ప్రతిసారీ చాలా చులకనగా మాట్లాడుతుండే నాయకుడిగా ముద్ర పడిన జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడడం కూడా ఈ వీడియోలో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.

అయితే దీనిమీద చంద్రబాబునాయుడు స్పందించారు. ఆయనకు సంజాయిషీ ఇచ్చుకున్న ఎంపీలు వ్యాఖ్యలను ఎడిట్ చేసి అతికించారంటూ చెప్పుకున్నారు. కానీ వీడియో చూస్తే మాత్రం.. చిన్న కత్తిరింపు కూడా లేకుండా ఒకటే ‘టేక్’ గా కనిపిస్తున్నది.

మరి ఈ బుకాయింపులతో వారు ఎవరిని మభ్యపెట్టదలచుకుంటున్నారో.. ఎవరిని బురిడీ కొట్టించదలచుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు.

రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ల విషయంలో పోరాటాల విషయంలో కుట్ర జరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఆ కుట్ర చేస్తున్నది ఎవరు? చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆయన పోరాటాల మీద కుట్ర జరుగుతోందా? లేదా, ప్రజలను మోసం చేయడానికి పచ్చదళాలే కుట్ర చేస్తున్నాయా?