కమల్ హాసన్, సిద్దార్థ్ హీరోలుగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ సినిమాకు వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి.
తెలంగాణలోని అన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో భారతీయుడు-2 సినిమా కోసం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి జీఎస్టీ అదనం.
నిబంధనలు ఇవి.. టికెట్ ధరల పెంపు కేవలం వారం రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. అది కూడా అన్ని తరగతులకు కాదు. కేవలం హయ్యర్ క్లాస్ సీట్లకు మాత్రమే టికెట్ రేట్లు పెంపు వర్తిస్తుంది. బి-క్లాస్, సి-క్లాస్ టికెట్ రేట్లు యథాతథంగా ఉంటాయి.
వీటితో పాటు మరో కీలక నిబంధన కూడా జతచేశారు. సినిమాలో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రకటనలు జోడించాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి నిబంధన. ఈ రూల్స్ పాటిస్తూ, తెలంగాణలో భారతీయుడు-2 సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం.