Advertisement

Advertisement


Home > Articles - MBS

బాపు గురించి బాలు - 01

బాపు గురించి బాలు - 01

బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ...

నాకు ఊహ తెలిసాక... బాపు, రమణల పరిచయం 'ఆంధ్రపత్రిక' ద్వారా జరిగింది. నాకు పన్నెండు, పదమూడు, సంవత్సరాలున్నప్పుడు పుస్తకాలు బాగా చదివేవాడిని. ఆంధ్రపత్రికలో బాపుగారి బొమ్మలను చూశాక కథను చదవాలి అనిపించేది. ఒక్కోసారి బొమ్మ ఉన్నంత బాగా కథ ఉండేది. మరొకసారి బొమ్మ ఉన్నంత బాగా కథ ఉండేది కాదు. కాని బొమ్మ మాత్రం ఎప్పుడూ బాగానే ఉండేది. 'బుడుగు' ద్వారా నాకు బాపుగారు, రమణగారు ఇంకా బాగా దగ్గరయ్యారు. (అంటే వ్యక్తిగతంగా కాదు.) 'బుడుగు'లో ఉన్న జోకులన్నీ ఈరోజుక్కూడా నాకు గుర్తుకున్నాయి. కుటుంబంలో అందరం కలిసినప్పుడు కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌ అందరం కలిసినప్పుడు కానీ బుడుగు జోకులు మళ్ళీ మళ్ళీ చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాం. బాపుగారి బొమ్మ రమణగారి మాట అంత బాగా మనసులో నాటుకుపోయాయన్నమాట. 

అసలు వీళ్లిద్దరిలో ఏ ఒక్కరి గురించి విడిగా మాట్లాడాలన్నా అది అసంగతం... ధర్మం కూడా కాదు. ఎందుకంటే త్యాగరాజ కీర్తనని ఒక అద్భుతమైన గాయకుడు పాడుతుంటే విని ఆస్వాదిస్తూ కేవలం సంగీతాన్ని  గురించే మాట్లాడి సాహిత్యాన్ని గురించి మాట్లాడకపోవడం ఎంత నేరమో... అలాగే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి గురించి మాత్రమే ప్రస్తావించినా కూడా అది అంత పెద్ద నేరం అవుతుందన్నమాట. 

కారణజన్ములు అంటూ ఉంటారు ఆ మాట వీరికి సరిగ్గా సరిపోతుంది. బహుశా వీళ్లిద్దరూ గత జన్మలో తుంబుర నారదులు అయి వుంటారు. కలిసి జీవనయానం సాగిస్తూ... కలిసి సినిమాలు తీస్తూ... కలిసి స్నేహాన్ని పంచుకుంటూ... కలిసి కీర్తిని పంచుకుంటూ... కలిసి కష్టాన్ని పంచుకుంటూ... ఉన్నారంటే మరి ఇది పూర్వజన్మ సుకృతం కాకపోతే మరి ఏమంటారు!? 

స్నేహమంటే నాకు చాలా ఇష్టం. స్నేహితులంటే మరీ మరీ ఇష్టం. ఎందుకంటే ప్రపంచంలో అమ్మానాన్నల తరువాత... గురువు తరువాత... దేవుడికంటే ముందుకూడ - నేను ఎక్కువగా గౌరవించేది, ప్రేమించేది స్నేహితాన్నే. అలాంటి స్నేహానికి ఒక ప్రతీకగా, ఒక తార్కాణంగా అలా నిలిచిపోయేటటువంటి వ్యక్తుల గురించి మనం మననం చేసుకుంటే తప్పకుండా మొట్టమొదటి కోవలోకే వస్తారు బాపురమణ.

అలా వాళ్లతో నా మానసిక అనుబంధం బుడుగుతోటి- ఆంధ్రపత్రికలోని బొమ్మలతోటి - ఇంకా కొంచెం ఎదిగాక 'జ్యోతి'తోటి- పెరుగుతూ వచ్చింది.  నేను నా బావమరిది మేమిద్దరం మద్రాసులో చదువుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఇంజనీరింగ్‌  ఫస్ట్‌ ఇయర్‌. వాడు ఆర్‌.ఐ. కాలేజీలో బి.యస్సీ. ఇద్దరం ఎగ్మూర్‌లో ఎలక్ట్రిక్‌ ట్రెయిన్‌ ఎక్కి కోడంబాకంలో దిగాలి. నెలలో మొదటివారం వచ్చిందంటే జ్యోతి పుస్తకం పట్టుకుని ఫ్లాట్‌ఫాం బెంచివిూద కూర్చుని ఆ జోకులు చూస్తూ... అందులో ఉన్న కార్టూన్లు చూస్తూ... చుట్టుప్రక్కల జనం ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయి... పగలబడి నవ్వుకుంటూండే వాళ్లం. ఈ నేపథ్యంలో మాకు జరిగిన ఒక చిన్న అనుభవం చెపుతాను -

ఓసారి స్టేషన్‌లో కూర్చుని ఇద్దరం బాపుగారి జోకులు చదువుకుంటూ పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటున్నాం. ఈలోపల ట్రెయిన్‌ రాబోతోంది. మా పక్కన బెంచివిూద ఒకాయన కూర్చున్నాడు. నేను ఉన్నట్టుండి 'అరేయ్‌... మనం చాలా బిగ్గరగా నవ్వుతున్నాం. అది మర్యాద కాదేమో! అవతలవాళ్లు ఏమన్నా అనుకుంటారు' అని అంటే - 'వాడి బొంద. వాడికి తెలుగు తెలిస్తే... వాడికి బాపురమణల గురించి తెలిస్తే... మనతో కూడా కలిసి నవ్వుతాడు. ఈ అరవ్వాడికి ఏం తెలిసి చచ్చింది' అన్నాడు మా బావమరిది. ఈ లోపల ట్రెయిన్‌ వచ్చింది. మేమిద్దరం కలిసి కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాం. మాతోపాటు అతను కూడా ఎక్కాడు. ట్రయిన్‌ కదిలాక అతను నాదగ్గరకొచ్చి 'మాస్టారూ విూరు ఆ బెంచ్‌ విూద విూ కర్చీఫ్‌ మర్చిపోయారు' అని శుద్ధమైన తెలుగులో మాట్లాడుతూ, నవ్వుతూ నా చేతికి అందించాడు. నేను బిక్కచచ్చిపోయాను. నాకంటే నా బావమరిది ఇంకా బిక్కచచ్చిపోయాడు. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను. 

నేను సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాక - ఇంచుమించు కొన్ని నెలల తేడాతో బాపుగారి ''సాక్షి'' కూడా విడుదలయింది. ''సాక్షి'' సినిమా పోస్టర్లు చూసి దిగ్భ్రాంతి చెందాను. ఎందుకంటే అంతవరకు ఒక మూసలో పోసినట్టున్న పోస్టరు పబ్లిసిటీని చాలా గమ్మత్తుగా ఒక సింగిల్‌ లైన్‌ డ్రాయింగ్‌లాగ తీసుకురావడం అనేటటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది. అంతకు మునుపే చాలా దినపత్రికల్లో వేరే వేరే సినిమాలకు - బాపుగారు చేసిన యాడ్స్‌....  పబ్లిసిటీ... కార్టూన్‌ స్ట్రిప్స్‌లాగ వచ్చేవి. బొమ్మలు, కార్టూన్లు బాపుగారు వేసేవారు. క్యాప్షన్స్‌ రమణగారు వ్రాసేవారు.  సినిమా కథను చెప్పక చెపుతూ దాంట్లో ఉన్నటువంటి గమ్మత్తయిన సన్నివేశాలను చూపిస్తూ పబ్లిసిటీ తమాషాగా చేసేవారు. (సశేషం) 

- ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?