Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: విజయం వెంట పరుగు ...

ఎమ్బీయస్‌: విజయం వెంట పరుగు ...

ఈనాటి సమాజంలో విజయానికి ఉన్న ప్రాధాన్యత మరి దేనీకీ లేదు. విజేత అనిపించుకోవాలని తాపత్రయం లేనివాడు కనబడడు. విజేతల స్వీయచరిత్రలు, జీవితచరిత్రలు హాట్‌ కేక్స్‌లా అమ్ముడుపోతాయి. వాళ్ల కథలు చదివి స్ఫూర్తి పొంది, వాళ్లలాగానే మనమూ విజయం సాధిస్తామని యువతీయువకులు కలలు కంటారు, తమకున్న కుటుంబపరిమితుల ద్వారా అలాటి విజయం సాధించలేకపోయామని మధ్యవయస్కులు నిట్టూర్పులు విడుస్తారు. పరాజితులైన వారి కథలు కూడా యీ స్థాయిలో ప్రాచుర్యం పొందితే మనుషులకు గెలుపు గురించి యింత చింత వుండేది కాదు. తమ జీవితం మరీ అధ్వాన్నంగా లేదని ఊరడిల్లేవారు.

కానీ పరాజితుల చరిత్రలు ఎవరూ రాయరు. భిన్నప్రయోగంలా 'ఫెయిల్యూర్‌ స్టోరీ' అని శీర్షిక నడిపినా చాలా కథనాల్లో నిజాయితీ కనబడదు. తాము నిజంగా ఫెయిల్‌ అయిన ఘట్టాలను ప్రస్తావించకుండా నిర్మొగమాటంగా వుండడం, నిక్కచ్చిగా వ్యవహరించమే తమ ఫెయిల్యూర్‌ అని చెప్పుకుంటారు. లేదా 'నా భావాలను వ్యక్తీకరించడంలో, ఓటర్లను కన్విన్స్‌ చేయడంలో విఫలమయ్యాను' అంటారు తప్ప నేను తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, నా అంచనాలు తప్పు - అని నిజాయితీగా రాయరు. కొంతమంది గడుసుగా ఫెయిల్యూర్‌ అని చెపుతూ దానిలోనూ తమ విజయాన్ని ప్రస్తావిస్తారు.

ఇలా ఎటు చూసినా అందరూ విజయాన్ని గురించే మాట్లాడుతూ, విజయాన్నే కీర్తిస్తూ, విజేతలే మనుషులనీ, తక్కినవారి ఉనికి భూమికి భారమనే భావన కలిగిస్తూ వుండడంతో అందరూ విజయం వెంటే పరుగులు పెడుతున్నారు. దానికి అడ్డదార్లు వున్నాయేమో వెతుకుతున్నారు. అపజయం కలిగినా అది విజయానికి సోపానమని, ఈ సారి విఫలమయ్యాం కాబట్టి వచ్చేసారి సఫలం కావడం కచ్చితమని లెక్కలు వేస్తారు కానీ అసలు యిప్పటికైనా, ఎప్పటికైనా విజయం సాధించకపోతే ఏం? అని ఛస్తే అనుకోరు. జీవితమంతా విజయాన్ని వేటాడుతూనే గడిపేస్తారు. 

విజయం అంటే?

విజయాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం? 50 మంది వున్న క్లాసులో పరీక్షలు జరిగితే నూటికి 35 మార్కులు వచ్చినవారు విజయం సాధించినట్లు, అంతకంటె తక్కువ వచ్చినవారు ఫెయిలన్నట్లు పరిగణించేవారు. ఆ విధంగా హైస్కూలులో చదివేటప్పుడు క్లాసుకి ఐదారుగురు ఫెయిలవుతూ వుండేవారు. నూటికి 50 దాటితే సెకండ్‌ క్లాసు అనీ, 60 దాటితే ఫస్ట్‌ క్లాసు అని లెక్కవేసి మన్నించేవారు. అయితే యీ రోజుల్లో కొలబద్దను మార్చేశారు. ఒక విద్యార్థి నూటికి 70, 80 మార్కులు తెచ్చుకున్నా తలిదండ్రుల దృష్టిలో అతను పరాజితుడే. 90ల్లో వస్తేనే అతనికి గౌరవం. ప్రతీ క్లాసులో, ప్రతి సబ్జక్టులో ఫస్టు ర్యాంక్‌ వచ్చినవాడు విజేత.

తక్కినవాళ్లందరూ పరాజితులే అనే భావన బలపడింది. పదో తరగతి దగ్గర్నుంచి ప్రారంభమయ్యే యీ గుఱ్ఱపు పందెం ఎప్పటికీ మందగించదు. వేగం పెంచుకుంటూనే పోతుంది. ఫస్ట్‌ ర్యాంకు రాకపోయినా, ఫస్ట్‌ క్లాసు రాకపోయినా, అసలు ఏ క్లాసూ రాకుండా జస్ట్‌ పాస్‌ మాత్రమే అయినవాడు పనికి రానివాడేనా? వాడు అన్నిటా ఓడిపోయినట్లేనా? టీచరు ఒకేలా చెప్పినా విద్యార్థుల్లో అందరికీ ఒకేలా చదువు వచ్చేస్తుందన్న గ్యారంటీ లేదు. తమకు చదువు పెద్దగా అంటదని గుర్తించిన కొందరు ఏదో చోట గుమాస్తా ఉద్యోగం తమ లక్ష్యం అనుకునేవారు. ఇప్పుడు అందరి గమ్యం యింజనియరింగే! బియ్యేలు, బియస్సీలు చదివేవారి శాతం తగ్గిపోయింది.

పిల్లలెవరైనా అది చదువుతామన్నా తలిదండ్రులు సిగ్గు పడుతున్నారు. పిల్లాణ్ని చావగొట్టి, చెవులుమూసి, డొనేషన్‌ కట్టి ఇంజనీరింగు కాలేజీలోకి నెడుతున్నారు. నిజానికి ఎకడమిక్‌ బ్రిలియన్స్‌ ఎంతవరకు పనికి వస్తుంది? ఎనిమిదో తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్‌లో చేరిపోయి, కోచింగ్‌ సెంటర్లో సీటు సంపాదించేసుకుని, ఐఐటీ పరీక్షల్లో నెగ్గేసి, సీటు సంపాదించుకున్నవాడు రెండో ఏడాది ఆత్మహత్య చేసుకుంటే దాని అర్థమేమిటి? అతను చదువులో విజేతే కానీ ఎమోషనల్‌గా పరాజితుడన్నట్లేగా? ఐఐటీ ఎంట్రన్సు పాసు కావడానికి పనికి వచ్చిన స్కిల్స్‌, చదవడానికి పనికి రానట్లేగా!

చదువు విషయం బాగానే వున్నా ర్యాగింగ్‌ అనో, కులం పేర వేధించారనో, ప్రేమ అనో, ఉద్యమానికై త్యాగం అనో ఆత్మహత్య చేసుకుంటే అర్థమేమిటి? ఎమోషనల్‌ బాలన్సు మేన్‌టేన్‌ చేయడంలో విఫలమైనట్లేగా? మరి అతన్ని విజేత అనగలమా? పోనీ ఐఐటీ పూర్తి చేసి విదేశాలకు వెళ్లి స్థిరపడిపోయినవాణ్ని విజేత అనగలమా? ప్రజాధనంతో చదువుకుని, తన టాలెంటును మాతృదేశానికి వినియోగించకుండా, తన స్వార్థం చూసుకున్నవాణ్ని మంచి పౌరుడు అనగలమా? ఆ విషయంలో అతను సాధించినది విజయమా?

చదువు వేరు, ఉద్యోగం వేరు - చదువులో ఎంతో బాగా రాణించినవాళ్లు ఉద్యోగంలో రాణిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎంత చదువు వున్నా ఉద్యోగిగా కావలసిన లక్షణాలు వేరే! బాగా చదవనివాళ్లు కూడా మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకుంటారు. నిజానికి ఓ మాదిరి తెలివితేటలున్నవాళ్లే ఉద్యోగాల్లో బాగా కుదురుకోగలరు. మరీ పెద్ద డిగ్రీలున్నవాళ్లు తమకు తగిన ఉద్యోగం రాలేదనో, తమ ప్రతిభకు యజమాని సరైన గుర్తింపు యివ్వటం లేదనో సణుగుతూ, వేరే ఉద్యోగానికై ప్రయత్నిస్తూ, యీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మధ్యస్తంవారు దొరికినదానితో తృప్తి పడి, తమ బాస్‌ను సంతోషపెట్టడానికి కష్టపడి పని చేస్తారు.

ఒక ఉద్యోగికి తనకు సంబంధించిన జాబ్‌ నాలెజ్‌ వుంటే చాలు. టైపిస్టుకి టైపు కొట్టడం వస్తే చాలు, రిసెప్షనిస్టుకు చక్కటి వాయిస్‌ వుండి, మర్యాదగా మెలగడం వస్తే చాలు. షేక్‌స్పియర్‌ గురించి, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం గురించి తెలిసినా అనవసరం. జాబ్‌ నాలెజ్‌ లేకుండా జనరల్‌ నాలెజ్‌ ఎంత వున్నా దండగ. పండితుడు-పడవవాడు కథ వినే వుంటారు. ఒక పండితుడు నావలో నది దాటుతున్నాడు. నీకు తర్కం తెలుసా? అని అడిగాడు పడవవాణ్ని. తెలియదు బాబయ్యా అంటే 'అయితే నీ జీవితంలో పావు వంతు దండగ' అన్నాడు. తర్వాత వ్యాకరణం కూడా తెలియదనగానే సగం జీవితం వృథా అన్నాడు.

వేదాంతం గురించీ అలా అనగానే మూడు వంతులు వేస్టు అన్నాడు. ఇంతలో నది పోటెత్తింది. నీళ్లు నావలోకి వచ్చేశాయి. అప్పుడు పడవవాడు తవఁరికి యీత తెలుసా? అని అడిగాడు. తెలియదు అన్నాడు పండితుడు వణుకుతూ. 'అయితే మీ జీవితంలో నాలుగు వంతులూ దండగే బాబయ్యా' అని చెప్పేసి, నావ నుంచి దూకేసి నదిలో యీదుకుంటూ వెళ్లిపోయాడు. నీతి ఏమిటంటే, నదిలో వున్నపుడు కావలసినది - ఈత రావడం, ఈశానోపనిషత్‌ భాష్యం కాదు. చదువెంత వున్నా ఉద్యోగంలో కావలసినది వినయం, ఒద్దిక, క్రమశిక్షణ. చదువులో విజేత కాలేకపోయినా అతడు ఉద్యోగిగా రాణిస్తాడేమో అని ఎందుకు అనుకోకూడదు?

వ్యాపారంలో విజేతలు - వ్యాపారం విషయానికి వస్తే యింకా ఎక్కువ గుణాలు కావాలి. ఓపిక, కష్టించే స్వభావం, ఒడిదుడుకులు తట్టుకోవడం, కస్టమర్లతో మర్యాదగా మెలగడం, భాగస్వాములతో నిజాయితీగా వర్తించడం, పనివారిని కూడగట్టుకోవడం, ఓర్పు, రేపు బాగుంటుందనే ఆశాభావం, ఒక్కో చోట ఔదార్యం, ఒక్కో చోట కాఠిన్యం.. యిలా ఎన్నో! ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవారికి తన నిజాయితీపై, తన శ్రమపై నమ్మకం కలిగించగలగడం. దానికి ఏ డిగ్రీలూ అక్కరలేదు. మాట నేర్పు వుంటే చాలు. వ్యాపారంలో విజయం సాధిస్తే ఏ మేరకైనా ఎదగవచ్చు. ఒక వ్యాపారం నుంచి మరో దానికి విస్తరించవచ్చు. వ్యాపారస్తులను కూడా రెండుగా చూడవచ్చు.

తను మాత్రమే ఎదిగే వ్యాపారాలు కొన్ని, తనతో పాటు మరో పదిమందికి బతుకు నిచ్చే వ్యాపారాలు కొన్ని, వేలాది, లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్త యింకా గొప్ప. అతనికి పైన చెప్పిన లక్షణాలన్నిటితో పాటు, అధికారులతో, స్థానిక నాయకులతో మెలిగే నేర్పు, యూనియన్‌ లీడర్లతో వేగే ఓర్పు, జాతీయ, అంతర్జాతీయ విషయాలు గమనించి వాటికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించ గలిగే ముందుచూపు.. యిలా యింకా ఎన్నో లక్షణాలు కావాలి. ఇలా చేయగలిగన ఉద్యోగి, వ్యాపారి, పారిశ్రామికవేత్త - వీరందరినీ స్కూలు లేదా కాలేజీ దశలో తెచ్చుకున్న మార్కులను చూసి వారిపై ఫెయిల్యూరు ముద్ర కొట్టినవారిని ఏమనాలి? వీళ్ల కంటె ముందు ఎనాలిసిస్‌ పరంగా, దూరదృష్టి పరంగా వాళ్లు ఫెయిలయ్యారు అనకూడదా? 

టెన్షన్లు, డిప్రెషన్లు

స్కూల్లో వుండగా ఒక కుర్రవాడి మార్కులు చూసి 'వీడు జీవితంలో మరి పైకి రాడు' అని నిర్ధారించి, నువ్వెలా బతుకుతావురా? అడుక్కుని బతుకుతావులే అనుకున్నా భవిష్యత్తులో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తారట అంటూ తిట్టి, తాము బెంబేలు పడి, వాణ్ని టెన్షన్‌ పెట్టి మొత్తమందరూ కలిసి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవారికి కౌన్సిలింగ్‌ చేసేవారెవరు? ఎవరైనా చేయబోయినా వాళ్లు వింటారా? 'మీకేమండి, ఎన్నయినా చెప్తారు. మా వాడికి చదువురాక, ఉద్యోగం రాక, అమెరికా వెళ్లలేక, డాలర్లు పంపలేక, పిల్లలు పుట్టినపుడు మమ్మల్ని తీసుకెళ్లి తిప్పలేక సతమతమవుతూంటే బాధపడేది మేము. వాడు అడిగిన పుస్తకమల్లా కొనిచ్చాం.

వాడి కోసం మేం కేబుల్‌ టీవీ కనక్షన్‌ పీకేశాం. వాడి పరీక్షలకు మేం రాత్రంతా మేలుకున్నాం. మా పేరంట్స్‌ మా మీద యింత శ్రద్ధ పెట్టి వుంటే, నాకవేళ గ్లోబు కొనిపెట్టి వుంటే, స్కూలు ఎక్స్‌కర్షన్‌కు పంపి వుంటే నేను కలక్టర్నయ్యేవాణ్ని. అందుకే మేం కడుపు కట్టుకుని, పిల్లలకు అన్నీ చేసి పెడుతున్నాం. రోజంతా స్కూల్లోనో, ట్యూషన్లోనో వుండేట్లా ఏర్పాటు చేశాం. తక్కినవాళ్ల కంటె ఏమీ తక్కువ చేయలేదు. అయినా ఎందుకీ తక్కువ మార్కులు? దేవుడున్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు?' అని ఆవేశపడతారు.

నిజానికి టెన్తో, ఇంటరో చదివేనాటికి మొత్తం జీవితంలో ఐదో వంతు కాలమే చూసినట్లు, తక్కిన కాలం ఎలా గడుస్తుందో చూడకుండానే తీర్మానించడం, నిరుత్సాహ పరచడం ఎంత తప్పు? దేవుణ్ని నమ్మేవాళ్లు ఆయన నిరర్ధకమైనదేదీ సృష్టించడన్న విషయం అర్థం చేసుకోరా? ఉదాహరణకి, దోమను మనం హీనంగా చూడవచ్చు, దాన్ని సృష్టించడం అనవసరం అనుకోవచ్చు. కానీ అది కప్పకో, బల్లికో ఆహారం అవుతోంది కదా! డాక్టర్లకు, ఫార్మా ఇండస్ట్రీకి, మస్కిటో రిపెల్లర్స్‌కు భుక్తి పెడుతోంది కదా! ప్రతీ మనిషి పుట్టుకకు ఏదో ఒక ప్రయోజనం వుంటుంది.

అది వెంటనే బయటపడవచ్చు, కొంతకాలం ఆగి కనబడవచ్చు. బద్ధకంగా బతుకుతూ వీడిది దండగబతుకురా అనుకున్నవాడు సైతం ఒక మహానుభావుడు పుట్టడానికి కారకుడు కావచ్చు. అందువలన సృష్టిలో ఏ ప్రాణినీ నిరసించడం, చిన్నచూపు చూడడం తగదు. ముఖ్యంగా నైపుణ్యపరంగా, సంస్కారపరంగా ఉత్కృష్టమైనమనుష జన్మ ఎత్తినవాణ్ని పనికిమాలినవాడని, పరాజితుడని తీసిపారేయడం తగదు. 

విజయం వ్యక్తిగతమా?

ఏదైనా విజయాన్ని విశ్లేషించినపుడు అనేక అంశాలు తడతాయి. సాధారణంగా విజేత అని మనం ఒకడిని కీర్తిస్తాం. దాంతో వాడు భుజాలు ఎగరేస్తాడు. కానీ విజేత కావడం ఒక్కడి వలన అవుతుందా? ఎన్ని అంశాలు సహకరించాలి? నువ్వు గొప్పవాడివనుకుందాం. ముందుగా పరిగణించవలసినది - నీ కుటుంబనేపథ్యం, నువ్వు పెరిగిన వాతావరణం. ఎందుకంటే నువ్వు స్వయంభువువి కావు, నీలో నీ పూర్వీకుల అవశేషాలున్నాయి. నీ అందం చూసి కూడా నువ్వు గర్వించనక్కరలేదు. అది మీ అమ్మానాన్నల నుంచి, తాతల నుంచి వచ్చినది. నీ ముక్కు, నీ పలువరస, నీ కళ్లలో మెరుపు, నీ రంగు, నీ ఎత్తు, నీ మాట తీరు .. అన్నీ అటు ఏడు తరాలు, యిటు ఏడుతరాలుగా మోసుకుంటూ వస్తున్న జీన్స్‌ సమకూర్చినవే.

నీ మేధస్సూ, పనిలో సులువు, శారీరక దారుఢ్యం, శ్రమకోర్చే తత్వం, కోపం, శాంతం.. అన్నీ దిగుమతి సరుకే. ఏదీ ఒరిజినల్‌ కాదు. ఇక నీ అభివృద్ధికి లేదా నీ వెనుకబాటు తనానికి, నువ్వు పెరిగిన ప్రాంతం శీతోష్ణస్థితి, నేల సారవంతత, నీటి వసతి, విద్యుత్‌ సరఫరా, చుట్టూ సమాజంలో శాంతిభద్రతలు.. యివన్నీ కారణాలే. అది ఏ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతమా, సకల సౌకర్యాలున్న నగరప్రాంతమా? అనేది కూడా పరిగణించాల్సిన అంశమే. నీ రాష్ట్రప్రభుత్వం సరైన రోడ్డు వేస్తే, స్కూలు పెడితే, దానిలో ఉపాధ్యాయులను టైముకి వచ్చేట్లు చేస్తే, వాళ్లకు జీతాలు యిస్తే అప్పుడు నీకు నాలుగు అక్షరాలు అబ్బుతాయి.

లేకపోతే ఎంత తెలివితేటలున్నా గురువు లేక వెలికి రావు. అందుచేత నీ విజయం నీ ఒక్కడిదే కాదు. అది టీము వర్కు. తెలిసో, తెలియకో ఎందరో చేతులు వేస్తేనే నీకు విజయం సిద్ధించింది. సౌకర్యాలన్నీ సమానంగానే సమకూరినా ఫలాలు అందరూ సమానంగా అందుకోలేరు. దక్కినదానికి స్వయంకృషితో మెరుగులు దిద్దుకోవాలి. ఆ మెరుపులు కూడా ఒకే రకమైన కాంతులు వెదజల్లవు. స్వయంకృషితో పైకి వచ్చినవాడు సైతం కృషి చేసేందుకు ప్రోత్సహించినవారికి, దోహదపడినవారికి కృతజ్ఞుడిగా వుంటూ విజయానికి తనొక్కడే కర్త అనుకోకూడదు. 

విజయం ఆనందాన్ని యిస్తుందా?

ఏ పని చేసినా అల్టిమేట్‌గా మనకు కావలసినది ఆనందమే. విజయం ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి, పరాజయం బాధ కలిగిస్తుంది కాబట్టి మనం విజయాన్ని ఆరాధిస్తాం, అన్వేషిస్తాం. అయితే ఏది విజయం? ఏది పరాజయం? ఈనాటి విజయం రేపటి పరాజయంగా తర్జుమా కావచ్చు. ఎన్నికలలో పార్టీ టిక్కెట్టు కోసం మరొకడితో పోటీ పడి మీరు సాధించారు. అది విజయమని మురిశారు. తీరా చూస్తే ఎన్నికలలో ఓడిపోయారు. మీపై నెగ్గిన ఎదుటి పార్టీవాడూ విజయం అనుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద చూస్తే వాళ్ల పార్టీ ఓడి, మీ పార్టీ నెగ్గింది. సీటు గెలిచినా ఏం లాభం అని అతను కృంగిపోయాడు.

ఏ ఫీలింగూ శాశ్వతం కాదు. పది కోట్ల టర్నోవరు సాధించడమే విజయం అనుకున్నవాడికి ఆ లక్ష్యం సాధించాక అది విజయంగా తోచడం మానేస్తుంది. ఎవడైనా సాధించగలడిది, వంద కోట్ల టర్నోవరు సాధించిననాడే విజేత అనుకుంటాడు. అలా విజయం వెంట పరుగు ఎప్పటికీ ఆగదు. విజయాన్ని మనం మెటీరియలస్టిక్‌గా చూడడంతోనే ఆ యిబ్బంది వస్తుంది. ఆ దృక్పథం కరక్టేనా? మీ జాతకంలో ఫలానా టైముకి ఐశ్వర్యం కలుగుతుంది అని వుంటుంది. డబ్బులు, స్థిరాస్తులు వస్తాయనుకుంటాం. అవేమీ రాకపోవడంతో జ్యోతిష్కుడికి చూపించుకుంటే 'మీరూ, మీ కుటుంబం సుఖసంతోషాలతో ఉన్నారు కదా, మీరు ఆరోగ్యంగా వుంటూ యితరులకు సాయపడుతున్నారు కదా, అదే ఐశ్వర్యం' అని వివరిస్తాడు.

అది మీకు నచ్చదు. వృద్ధాప్యం వచ్చాకనే ఆరోగ్యం విలువ, ఆనందం విలువ తెలిసివస్తాయి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ఐశ్వర్యం, విజయం. ఎంత సంపాదించినా ఆనందం లేకపోతే ఏం లాభం? పాతకాలం కథ వుంది. రాజుగారికి సుస్తీ చేసింది. వైద్యులకు కారణం తెలియటం లేదు. చూడడానికి వచ్చిన యోగికి విషయం అర్థమైంది. అన్నీ వున్నా యింకా ఎక్కువ సంపాదించలేకపోతున్నానన్న దిగులుతో మంచమెక్కాడని గ్రహించి 'ఆనందంగా వున్నవాడి చొక్కా వేసుకుంటే జబ్బు పోతుంది' అన్నాడు. సైన్యాన్ని పంపి రాజ్యమంతా వెతికించారు. ఎవ్వడూ ఆనందంగా లేడు. అందరికీ ఏదో ఒక రకమైన అసంతృప్తే. చివరకు ఒకడు దొరికాడు. వాడు ఆనందంగా వున్నాడు కానీ వాడికి ఒంటి మీద చొక్కాయే లేదు. దరిద్రంలో వున్నా, కప్పుకోవడానికి చొక్కా లేకపోయినా వాడు ఆనందంగా వుంటున్నాడు. అన్నీ ఉన్నా తను ఉండలేకపోతున్నాడు అనే గ్రహింపు రాజుకి కలిగింది.

అన్నిటా విజయం సాధ్యమా?

ఒక రంగంలో విజయం సాధించగానే ఆశ పెరుగుతుంది. విజేత ఐన నటుడు డైరక్టరు అవుదామనుకుంటాడు, డైరక్టరు నిర్మాత అవుదామనుకుంటాడు,  నిర్మాత బాలీవుడ్‌లోనూ జండా ఎగరేయాలనుకుంటాడు. రెండో దానిలో వాళ్లు విఫలమైతే వాళ్లను విజేతలనాలా? పరాజితులనాలా? సినిమాల్లో ఫెయిలైనవాడు రాజకీయాల్లో రాణించవచ్చు, రాజకీయాల్లో ఫెయిలయినవాడు వ్యాపారంలో రాణించవచ్చు. చేపట్టిన ప్రతిరంగంలోను విజయం అసాధ్యం. ఒకవేళ మీరు రచ్చ గెలిచినా యింట ఓడిపోవచ్చు. మీ భార్యతో లేక భర్తతో నిత్యం ఘర్షణ పడుతూ వుండవచ్చు, గొడవలు పెరిగి విడిపోవచ్చు. భార్య లేక భర్త దుష్ప్రవర్తన లేదా పిల్లల దుడుకు ప్రవర్తన వలన బాడ్‌ పబ్లిసిటీ వచ్చి తలకాయనొప్పులు రావచ్చు.

వృత్తిపరంగా మీరు విజేతలైనా భర్తగా, తండ్రిగా, కొడుకుగా మీరు పరాజితులు కావచ్చు. అది గమనించినపుడు ప్రతీవాడూ ఏదో ఒక రకంగా విజేతే, ఏదో ఒకరకంగా పరాజితుడే! పైగా విజయానికి కొలబద్ద లేదు. మీరు పరిధిని విస్తరించుకుంటూ పోయి, అలవికాని లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఓడిపోయానని కుమిలిపోతే ఎవరూ చేయగలిగేది లేదు. సినిమాల విషయానికి వస్తే, గతంలో అన్ని రకాల బజెట్‌లలో సినిమాలు తయారయ్యేవి. అగ్ర హీరోలు భారీ సినిమాలతో బాటు, మధ్యతరహా సినిమాల్లో కూడా నటించేవారు. మధ్యతరగతి సినిమాలు ఓ మాదిరి బజెట్‌లో తయారై 3, 4 వారాలాడి తమ పెట్టుబడిని దాదాపు రాబట్టుకునేవి. వాటిపై ఆధారపడి ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణులు బతికేవారు.

ఇప్పుడది పోయింది, అందరి చూపూ బ్లాక్‌బస్టర్ల మీదే. టాప్‌ హీరోతో 50 కోట్ల బజెట్‌ సినిమా అంటూ ఏడాదిన్నర తీయడం, అసంఖ్యాకంగా ప్రింట్లు వేసి, పబ్లిసిటీపై విపరీతంగా ఖర్చు పెట్టి, ఊళ్లో సినిమా హాళ్లన్నీ బుక్‌ చేసి, మొదటివారంలోనే పెట్టుబడంతా రాబట్టాలని చూడడం! ఎందుకింత రిస్కు, ఏల యింత రొష్టు, మధ్యతరహా సినిమా తీయవచ్చు కదా అంటే 'అబ్బే నేను అగ్రశ్రేణి నిర్మాతని' అని అనిపించుకోవాలన్న తపన. చూడబోతే ఈ మధ్య జాగ్రత్తగా తీసిన చిన్న సినిమాల్లో రిస్కు చాలా తక్కువ వుంటోంది. కానీ విజేత అనిపించుకోవాలన్న తపనతో శిఖరానికి గురి పెట్టడం, గురి తప్పితే అదే శిఖరం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. 

అబ్సల్యూట్‌ విజయం అనేది లేదు. అది గ్రహించినపుడు విజేత అనిపించుకోవాలనే తాపత్రయం పోతుంది. విజేత కావడానికి ఎన్ని మెట్లు ఎక్కాలి, యిప్పటికి ఎన్ని ఎక్కాం, యింకా ఎన్ని మిగిలిపోయాయి అనే లెక్క వేయడం మానేస్తాం. విజయం అనేది నీ ఒక్కడి చేతిలో లేదు, అనేక పరిస్థితులు సమకూడితేనే అది సాధ్యం. కావలసిన దినుసుల్లో ఏ ఒక్కటి తగ్గినా అది సిద్ధించదు. అది నీ చేతిలో వుండకపోవచ్చు. దానికే కృంగడం, సమకూరితే పొంగడం - రెండూ అనవసరమే. చేసే పనిని శ్రద్ధగా శ్రమ కోర్చి చేయడం, ఫలితం పట్ల పెద్దగా ఆశ పెట్టుకోకుండా వచ్చినదాన్ని ఆస్వాదించడం, జీవితాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా అవలోకించి ఆనందించడం - యివన్నీ విజయసాధనలో భాగమే! 'ఇలా చూస్తే అందరూ విజేతలే అవుతారు, యిక నా గొప్పేముంది' అని నిట్టూరిస్తే అది పరాజయమే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?