Advertisement

Advertisement


Home > Articles - MBS

చిట్టగాంగ్‌ ఆయుధాల కేసులో 14 మందికి ఉరిశిక్ష

ఈశాన్యభారతంలో సాయుధపోరాటం సాగించడానికై పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ చైనాలో ఆయుధాలు కొని బంగ్లాదేశ్‌ ద్వారా ఈశాన్యప్రాంతాలలోని ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపించిన కేసు - చిట్టగాంగు ఆయుధాల కేసు. పదేళ్ల విచారణ తర్వాత ఈ జనవరి 30 న చిట్టగాంగ్‌ సెషన్స్‌ జడ్జి తీర్పు చెపుతూ 14 మందికి ఉరిశిక్ష విధించారు. 2004 ఏప్రిల్‌ 1 రాత్రి చిట్టగాంగ్‌లోని కర్నాఫూలీ పోలీసు స్టేషన్‌కు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది ''చిట్టగాంగ్‌ యూరియా ఫెర్టిలైజర్‌ వారి జెట్టీలో కొన్ని ట్రక్కుల ద్వారా ఆయుధాలు వస్తున్నాయి.'' అని. పేరు అడిగితే చెప్పలేదు. ఇదేదో ఏప్రిల్‌ ఫూల్‌ కాల్‌ అనుకోకుండా కానిస్టేబుల్‌, సార్జంటు అక్కడకి వెళ్లారు. జెట్టీలో 10 ట్రక్కులున్నాయి. మరపడవల్లోంచి పెద్ద పెద్ద క్రేట్స్‌ను క్రేన్‌ సహాయంతో ట్రక్కుల్లోకి ఎక్కిస్తున్నారు. వీళ్లు వెంటనే పోర్టు డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్‌ చేశారు. ''నేను బలగాలను పంపిస్తాను. ట్రక్కులు పారిపోకుండా చూడండి.'' అన్నాడాయన. ఇంతలో హఫీజుర్‌ రహమాన్‌ అనే ఆయుధవ్యాపారి, అబుల్‌ హొసైన్‌ అనే యింకో వ్యక్తి యీ పోలీసువాళ్ల దగ్గరకు వచ్చారు. ''ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి. సెక్యూరిటీ ఏజన్సీస్‌కు కూడా తెలుసు.'' అని వీళ్లతో చెప్పి యింకొకరికి ఫోన్‌ చేసి 'వీళ్లను వెళ్లిపోమని చెప్పండి, సార్‌' అంటూ అడిగారు. ఈ లోపునే పోలీసులు రావడం, ట్రక్కులు చుట్టుముట్టడం జరిగింది. లోడింగు చేస్తున్న పనివాళ్లు పారిపోయారు. అబుల్‌ హొసైన్‌ కూడా చీకట్లో జారుకున్నాడు. 1500 పెట్టెల్లో మారణాయుధాలు, గ్రెనేడ్లు, రాక్‌ట్‌ లాంచర్లు దొరికాయి. కేసు నమోదైంది. విచారణ ప్రారంభమైంది. అనేక విషయాలు బయటకు వచ్చాయి. 

ఆ రోజు అబుల్‌ హొసైన్‌గా చెప్పుకున్న వ్యక్తి నిజానికి మేజర్‌ లియాకత్‌ హొసైన్‌. బంగ్లాదేశ్‌ యింటెలిజెన్సు బ్యూరో (ఎన్‌ఎస్‌ఐ - నేషనల్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్సు అంటారు)లో ఉన్నతాధికారి. ఆనాటి బంగ్లాదేశ్‌ ప్రధాని బేగమ్‌ ఖలీదా జియా, ఆమెతో రాజకీయసాన్నిహిత్యం వున్న జమాతే ఇస్లామీ పార్టీ పాకిస్తాన్‌కు స్నేహం నెరపారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తన గూఢచారి సంస్థల ద్వారా పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్సు)తో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసింది. ఈ ఆపరేషన్‌లో ఎన్‌ఎస్‌ఐతో మిలటరీ ఇంటెలిజెన్సు ఏజన్సీ అయిన డిజిఎఫ్‌ఐ చేతులు కలిపింది. వీరికి మద్దతుగా ఖలీదా జియా కుమారుడు తారీఖ్‌ రహమాన్‌ నడిపే సంస్థ నిలిచింది. దుబాయిలో ఆగా రహమాన్‌ యూసుఫ్‌ అనే వ్యక్తి ఐఎస్‌ఐ కోరికపై యీ ఆయుధాలను చైనాలోని నోరింకో ఆయుధనిర్మాణ సంస్థ నుండి కొనడానికి సిద్ధపడ్డాడు. వీటిని బంగ్లాదేశ్‌ ద్వారా ఆసాంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న ఉల్ఫా సంస్థకు అప్పగించే విధానంపై చర్చించడానికి ఎన్‌ఎస్‌ఐ అధికారులను జూన్‌ 2003లో దుబాయికి రప్పించారు. దానికి దోహదపడినది - బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, అమెరికా రాయబారులు. వాళ్లు ఎన్‌ఎస్‌ఐకు మొబైల్‌ మానిటారింగ్‌ ఎక్విప్‌మెంట్‌ బహుమతిగా యిచ్చి స్నేహం కలుపుకున్నారు.

క్యూటీవీ అనే పాకిస్తాన్‌ టీవీ ప్రారంభోత్సవ సందర్భంగా దుబాయి రావలసినదిగా యూసుఫ్‌ కంపెనీ నుండి అప్పట్లో ఎన్‌ఎస్‌ఐకు అధినేతగా పని చేస్తున్న అబ్దుర్‌ రహీమ్‌కు ఆహ్వానం వచ్చింది. భార్యతో సహా అతను అక్కడికి వెళ్లాడు. క్యూ టీవీని బంగ్లాదేశ్‌కు విస్తరించడానికి మీ సహాయం కావాలని కోరుతూనే వారంతా కలిసి యీ ఆయుధ రవాణా ప్రణాళిక రచించారు. ఇదంతా అబ్దుర్‌ రహీమ్‌ కోర్టులో అంగీకరించాడు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ సహకారంతో యీ ఆయుధాలు ఈశాన్యప్రాంతాలకు చేరి వుండేవి. ఎందుకంటే యీ కుట్రలో మంత్రులు కూడా పాలుపంచుకున్నారు. కానీ ఒక్క ఫోన్‌కాల్‌తో కథ మారింది. బంగ్లాదేశ్‌లో ఖలీదా జియా ప్రభుత్వం మారిపోయి, ప్రస్తుతం ఆమె ప్రత్యర్థి, పాకిస్తాన్‌కు విరోధి అయిన హసీనా ప్రభుత్వం వుండడంతో కేసు కొలిక్కి వచ్చింది. మొత్తం 14 మందికి ఉరిశిక్ష పడింది. వారిలో ఒకడు ఉల్ఫా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పరేష్‌ బరువా. తక్కినవాళ్లందరూ బంగ్లాదేశీయులే - మాజీ పరిశ్రమల మంత్రి, మాజీ హోం మంత్రి, జమాతే ఇస్లామీ నాయకుడు, 8 మంది ఎన్‌ఎస్‌ఐ అధికారులు వున్నారు. ఈ 8 మందిలో అబ్దుర్‌ రహీమ్‌ కూడా వున్నాడు. 

ఇలా పట్టుబడిన తర్వాత ఆయుధరవాణా ఆగిపోలేదు. చిన్న మొత్తాల్లో ఆయుధాలు యింకా సరఫరా అవుతూనే వున్నాయి. ఆ విషయం 2010లో నాగాలాండ్‌కై ఉద్దేశించిన 2 మిలియన్‌ డాలర్ల ఖరీదైన ఆయుధాలు పట్టుబడినపుడు తెలిసింది. 2013 సెప్టెంబరులో థాయ్‌ పౌరుడు అరెస్టయినపుడూ తెలిసింది. ఈ ఆయుధాలలో కొన్ని తమ దేశంలోని తీవ్రవాదుల చేతుల్లో పడుతున్నాయని గ్రహించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే మనకు కావలసినది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?