Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : 55 ఏళ్ల తర్వాత నవలకు సీక్వెల్‌

1960 లో వెలువడి పులిట్జర్‌ బహుమతి పొందిన ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌'' అనే ప్రపంచ ప్రఖ్యాత నవలకు సీక్వెల్‌గా ''గో సెట్‌ ఎ వాచ్‌మన్‌'' అనే నవల రాబోతోంది. మాకింగ్‌ బర్డ్‌ నవల యిప్పటిదాకా 4 కోట్ల ప్రతులు అమ్ముడు పోయిందని అంచనా. ఆ నవలకు నేపథ్యంగా వున్న వూరు యాత్రాస్థలంగా మారిపోయింది. ఇంత పేరు వచ్చిన తర్వాత ఆ గ్రంథరచయిత్రి నెల్లె లీ (ఆమె కలం పేరు హార్పర్‌ లీ) మరో పుస్తకం వెనువెంటనే రాసి వుండాలి కదా! మరి 50 ఏళ్లు ఆలస్యమైందేమిటన్న సందేహం రావడం సహజం. అంతకుముందు ఆ నవల యితివృత్తం గురించి, రచయిత్రి గురించి కొంత తెలుసుకోవాలి. అలబామాలోని మేకోంబ్‌ అనే చిన్నపట్టణంలో 1933-35 మధ్య జరిగినట్లుగా నవల రాయబడింది. అప్పట్లో అక్కడ జాతిభేదాలు విపరీతంగా వుండేవి. తెల్లవారు నల్లవారిని నీచంగా చూసేవారు. ఆ వూళ్లో అటికస్‌ అనే మధ్యవయస్కుడైన ఒక లాయరు వున్నాడు. భార్య పోయింది. పదేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు. ఆ వూల్లో మేయెల్లా అనే తెల్లజాతి అమ్మాయిని టామ్‌ అనే నల్లవాడు చెరిచాడన్న ఆరోపణతో అతనిపై కేసు పెడతారు. జడ్జి అటికస్‌ను డిఫెన్సు లాయరుగా వుండమంటాడు. ఊళ్లో అందరూ వారించినా నిజం వెలికితీయడానికి అటికస్‌ అంగీకరిస్తాడు. విచారణ సందర్భంగా మేయెల్లా, ఆమె తాగుబోతు తండ్రి బాబ్‌ అబద్ధాలాడుతున్నారని నిరూపిస్తాడు. జరిగిందేమిటంటే తెల్లజాతి మగాళ్లెవరూ తన వైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదన్న వ్యథతో మేయెల్లా టామ్‌ని ముగ్గులోకి లాగబోయింది. కానీ అతను నిరాకరించాడు. ఈ విషయం తెలిసిన బాబ్‌ ఆమెను చితకబాది, టామ్‌పై కేసు పెట్టాడు. ఇంత తెలిసినా జ్యూరీ సభ్యులు నల్లవాడిపై ద్వేషంతో అతన్ని దోషిగా నిర్ధారించి శిక్ష వేయిస్తారు. టామ్‌ జైల్లోనుంచి పారిపోయడానికి ప్రయత్నించి కాల్పులకు గురై చనిపోతాడు. అటికస్‌కు న్యాయవ్యవస్థపై నమ్మకం సడలుతుంది.

ప్రస్తుతం వెలువడబోతున్న 'వాచ్‌మన్‌' నవల మాకింగ్‌ బర్డ్‌ జరిగిన కథాకాలానికి 20 ఏళ్ల తర్వాత జరుగుతుంది. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారై న్యూయార్క్‌లో నివసిస్తూ తమ తండ్రిని చూడ్డానికి సొంతవూరు వస్తారు. నిజానికి హార్పర్‌ యీ నవలను ముందు రాసింది. ప్రచురణకు పంపితే, దాన్ని చదివిన సంపాదకుడికి ఆ నవల్లో ఫ్లాష్‌బ్యాక్‌లో రాసిన సంఘటనలు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఆరేళ్ల పిల్ల అనుభవాలు ముచ్చట గొలిపాయి. ఆమె దృక్కోణం నుంచి అప్పటి కాలంలో జరిగినట్లుగా నవల రాయమని సలహా యిచ్చాడు. అదే ఆమె ప్రథమప్రయత్నం కావడంతో అతని సలహా మన్నించి చిన్నపిల్లలనే ప్రధానపాత్రలుగా పెట్టి మాకింగ్‌ బర్డ్‌ రాసింది. అది విపరీతంగా పేరు తెచ్చుకుంది.  ఆ పేరు చెడగొట్టుకోకూడదని యీ స్క్రిప్టును మూడు సార్లు తిరగరాసింది. రెండున్నరేళ్లు పట్టింది. మాకింగ్‌ బర్డ్‌ సినిమా హడావుడిలో యీ వాచ్‌మన్‌ నవల మ్యాన్‌స్క్రిప్టు ఎక్కడో పోయింది. మళ్లీ గుర్తు చేసుకుని రాయాలన్న వూహ పోక హార్పర్‌ వూరుకుంది. నిజానికి మాకింగ్‌ బర్డ్‌ తర్వాత ఈమె కొన్ని నవలలు రాద్దామని ప్రయత్నించింది కానీ నచ్చక పక్కన పెట్టేసింది. కథలు కూడా రాయలేదు. చిన్న చిన్న వ్యాసాలు రాసిందంతే. హార్పర్‌ అక్క ఏలిస్‌తో కలిసి పనిచేసిన మరో లాయరు టోంజా కార్టర్‌ యిటీవలి కాలంలో హార్పర్‌కు చేరువై ఆమె వ్యవహారాలు చక్కబెట్ట సాగింది. ఆమె కారణంగా హార్పర్‌ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నా, ఆమెనే నమ్ముకుంది. ఏలిస్‌ వృద్ధాప్యంతో 2014 నవంబరులో 103 వ యేట మరణించాక హార్పర్‌కు వేరే దిక్కు లేదు. ఈ టోంజా యీ 2014లో ఏవో కాగితాలు సర్దుతూంటే మాకింగ్‌ బర్డ్‌ మ్యానుస్క్రిప్టు కనబడింది. దానితో కలిపి కుట్టిన వాచ్‌మన్‌ మ్యానుస్క్రిప్టు కూడా కనబడింది. ఇప్పుడు దాన్ని వెలుగులోకి తెస్తే బాగుంటుందని నిర్ణయించింది. ఈ విషయం తెలియగానే హార్పర్‌ కాలిన్స్‌ వారు అమెరికా హక్కులు, పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ వాళ్లు యుకె కామన్‌వెల్త్‌ దేశాల్లో ప్రచురణ హక్కులు కొనేశారు. ఈ జులైలో పుస్తకం మార్కెట్లోకి రాబోతోంది. ఇవన్నీ హార్పర్‌కు తెలిసే జరుగుతున్నాయా, టోంజా తన యిష్టం వచ్చినట్లు చేసేస్తోందా అన్నది ఎవరికీ తెలియదు. టోంజాను నిలదీసేందుకు హార్పర్‌కు పిల్లలు లేరు. హార్పర్‌ పేర టోంజా పెడుతున్న కేసులు చూసి వూళ్లో వాళ్లందరూ టోంజాపై పగబట్టారు. ఫిర్యాదు చేశారు. అలబామా ప్రభుత్వం హార్పర్‌ విషయంలో 'ఎల్డర్‌ ఎబ్యూజ్‌' (ముసలివాళ్లను మోసగించడం) జరుగుతోందా తెలుసుకోవాలని విచారణకు ఆదేశించారు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?