Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బలాత్కారమంటే...?

2013 ఫిబ్రవరిలో వచ్చిన క్రిమినల్‌ లా (ఎమెండ్‌మెట్‌) ఆర్డినెన్సు తర్వాత బలాత్కారానికి నిర్వచనం బాగా విస్తరించింది. దానితో 498 (ఎ) వరకట్న చట్టం లాగానే యిదీ కొన్ని సందర్భాల్లో దురుపయోగం అవుతోంది. ఈ మధ్య ఆంధ్రలో ఒక విడాకుల కేసులో తన భర్త తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ తన శీలాన్ని అవమానపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ భార్య లాయరుపై కేసు పెట్టింది. ఏ కేసో తెలుసా? వరకట్న నిషేధ (498 ఏ) కేసు! దీనిలో కట్నసమస్య ఎలా వచ్చింది? అయినా ఆ లాయరు తన క్లయింటు ఏం చెపితే అదే చెప్తాడు తప్ప సొంత అభిప్రాయాలు చెప్పడు కదా! కొన్ని చట్టాలను ఎలా వాడుతున్నారో దీనివలన తెలుస్తోంది. ఒక ఎయిర్‌హోస్టెస్‌, ఒక బ్యాంకర్‌ మూడేళ్లపాటు సహజీవనం సాగించారు. తర్వాత  పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. ఇప్పుడామె అతను తనను మూడేళ్లపాటూ 'రేప్‌' చేశాడని కేసు పెట్టింది! 'ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడేళ్లపాటు, యిద్దరూ కలిసి వుంటూనే రేప్‌!! అదెలా సంభవం!?' అంటే 'పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చాడు కాబట్టే అతనితో సెక్స్‌లో పాల్గొన్నాను. లేకపోతే ఒప్పుకునేదాన్ని కాదు. అబద్ధపు వాగ్దానంతో నన్ను అనుభవించాడు కాబట్టి అది బలాత్కారం కిందే లెక్క' అంటోంది ఆమె. 'నేను అప్పటికే వివాహితుణ్ని. ఆ విషయం ఆమెకూ తెలుసు. పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, నువ్వంటే యిష్టం అంటూ నాతో యిన్నాళ్లూ గడిపి, యిప్పుడు నన్ను రేపిస్టు అంటే ఎలా?' అని అతను వాదిస్తున్నాడు.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నాతో శృంగారం నెరపాడు కాబట్టి అది బలాత్కారమే అని కొన్ని కేసుల్లో మహిళలు వాదిస్తున్నారు. 'ఆమె యిష్టపడి కొన్నేళ్లపాటు లేదా కొన్ని నెలలపాటు సంభోగంలో పాల్గొంటే, అది రేప్‌ ఎలా అవుతుంది?' అని మగవాళ్లు తిప్పికొడుతున్నారు. ఆమె యిష్టపడినట్లు రుజువు చూపవలసిన భారాన్ని యీ 2013 నాటి ఆర్డినెన్సు మగవాడిపై పెట్టింది. ఇది ఆచరణలో ఎలా సాధ్యమో అర్థం కాదు. ఎవరైనా స్త్రీ తనంటే యిష్టపడి ముందుకు వస్తే 'ఆగు, నీతో పడుక్కోవడం నాకు యిష్టమే అని కాగితం రాసియ్యి, లేదా వీడియోలో చెప్పు' అని మగవాడు అని, ఆ సాక్ష్యాన్ని ఏళ్ల తరబడి భద్రపరచుకోవాలా? ఇలాటి కేసుల్లో ఏం చేయాలో తెలియక న్యాయాధీశులు కూడా తల పట్టుకుంటున్నారు. ఒక్కో జడ్జి ఒక్కోలా తీర్పు యిస్తున్నారు. ఓ కేసులో 'ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చి, అనుభవించి, ఆ తర్వాత మాట తప్పాడు' అని మహిళ ఆరోపించింది. దానిపై 2003లో సుప్రీం కోర్టు తీర్పు యిస్తూ - 'మోహావేశంలో ఆ క్షణాన పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చినా దాన్ని సీరియస్‌గా తీసుకోనక్కరలేదు' అంది. 2006లో యిలాటి కేసే వచ్చినపుడు యింకో జడ్జి తీర్పు యిస్తూ ముద్దాయికి శిక్ష విధించారు. అదేమంటే 'ఇతనికి పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశం మొదటినుంచీ లేదు' అని జవాబిచ్చారు, అంజనం వేసి కనుక్కున్నట్లు! 2013లో యింకో కేసులో అదే కోర్టులోని మరో జడ్జి 'పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చి పరిస్థితులు అనుకూలించక నిలబెట్టుకోకపోవడం వేరు, కావాలని అబద్ధపు వాగ్దానం చేయడం వేరు' అన్నారు. ఏది ఏ కేటగిరీలోకి వస్తుందో ఎవరి మనసులోకి దూరి చెప్పగలరు? 

2014 ఆగస్టు 27 న కేంద్రమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ కుమారుడి నిశ్చితార్థం జరిగింది. మర్నాడే మైత్రేయ అనే ఒక కన్నడ జూనియర్‌ నటీమణి అతనిపై రేప్‌ కేసు పెట్టింది. 'అతను నన్ను ప్రేమించాడు, నన్ను గుళ్లో పెళ్లి కూడా చేసుకున్నాడు' అని. నవంబరులో బెంగుళూరు ఫ్యామిలీ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. ఆధారాలు చాలలేదో ఏమో అది పెళ్లి కాదని కోర్టు కొట్టి పారేసింది. ఇంకేం, నాపై కేసులు కొట్టేయండి అంటూ అతను హైకోర్టును ఆశ్రయించాడు. జనవరి 29 న తీర్పు చెపుతూ కర్ణాటక హై కోర్టు 'నీపై వున్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా కేసు కొట్టివేయలేం. విచారణ జరగాల్సిందే' అంది. ఏమిటా తీవ్రత? రేప్‌ ఆరోపణ! పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడు అంటే 420 కింద కేసు పెట్టాలి కానీ రేప్‌  చట్టం కింద పెట్టడమేమిటి విడ్డూరం కాకపోతే? సినిమాల్లో రేప్‌లు చూసి స్త్రీపై పడి బట్టలు చింపి, నానా బీభత్సం చేసి, ఆమెను ఏడిపించడం అనుకుంటూ వచ్చాం. ఇప్పుడవేమీ అక్కరలేదు. అది పెళ్లి కాని స్త్రీపురుషుల మధ్య మామూలు శృంగారమే కావచ్చు, దాన్ని రేప్‌గా చిత్రీకరించే హక్కు స్త్రీ చేతుల్లోకి వచ్చింది. 

వివాహాత్పూర్వ శృంగారానికి, వివాహేతర శృంగారానికి ఉబలాటే పడే మగవాళ్లు తమ ఊహలకు కళ్లాలు వేసుకోకపోతే కోర్టుల్లో, జైళ్లల్లో తేలతారని తాత్పర్యం. ఎందుకంటే యిలాటి వ్యవహారాలు ఎప్పుడు బెడిసికొడతాయో తెలియదు. కానూన్‌ డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ఒక ముంబయి అమ్మాయి ఒక ప్రశ్న వేసిందట - 'నాకు ఆరేళ్లగా ఒక అబ్బాయితో రిలేషన్‌షిప్‌ వుంది. అతను శృంగారం కోరితే నేను వద్దన్నాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆరేళ్లయింది. ఐ యామ్‌ ఫీలింగ్‌ ఐ యామ్‌ రేప్‌డ్‌. నేను అతనిపై కేసు  పెడదామనుకుంటున్నాను. ఏమంటారు?' అని. జవాబిచ్చిన ఏడుగురు లాయర్లలో యిద్దరు 'వదిలేయ్‌' అన్నారట, ఒకతను 'అతను పెళ్లిచేసుకుంటానని రాసి యిచ్చాడా?' అని అడిగాడట. తక్కిన నలుగురు 'పోలీసు స్టేషన్‌ కెళ్లి రేప్‌ కేసి పెట్టేయ్‌' అని సలహా యిచ్చారట! 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?