Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? - 4

అసలు హత్య జరిగిన వారం రోజులకే పోలీసు ఐజి గురుదర్శన్‌ సింగ్‌, నిందితుడు రాజేష్‌ తల్వారే అనేశాడు. 'ఆ రోజు రాజేష్‌ తెల్లవారుఝామున 3 గంటల దాకా మేలుకుని యింటర్నెట్‌తో పని చేసుకుంటున్నాడు. ఎందుకంటే యింటర్నెట్‌ రౌటర్‌ 3 గంటలదాకా పని చేస్తూనే వుంది. (12 గంటల తర్వాత యింటర్నెట్‌ వాడలేదని మరో కథనం వుంది) అది కట్టేసేసరికి అతనికి ఆరుషి గదిలో చప్పుళ్లు వినబడ్డాయి. వెళ్లి చూశాడు. హేమరాజ్‌, ఆరుషిని సన్నిహితంగా చూశాడు. విపరీతమైన కోపంతో ఒక దుడ్డుకర్రలాటి (అది రాజేష్‌ గాల్ఫ్‌ క్లబ్‌ కావచ్చు) తో దానితో యిద్దరి తలల మీద బాదాడు. నూపుర్‌ లేచి వచ్చి అతనికి సాయపడింది. డాక్టర్లకుండే సహజమైన లాఘవంతో సన్నటి చాకుతో యిద్దరి గొంతులూ కోసి చంపేశారు. హేమరాజ్‌ శవాన్ని డాబా మీదకు చేర్చి తాళం వేసేశారు. ఇక ఆరుషి శరీరంపై శృంగారానికి సంబంధించిన జాడలు ఏవీ కనబడకుండా శుభ్రం చేసేశారు. ఆ ప్రదేశంలో సాక్ష్యాలు లేకుండా చూసి, ఆమె శవంపై దుప్పటి కప్పేశారు. రాజేష్‌ నెర్వస్‌గా ఫీలయ్యాడు. వెళ్లి బార్‌ తెరిచి విస్కీ బాటిల్‌ తెరిచి కాస్త తాగాడు. దాని మీద హతుల యిద్దరి రక్తపు నమూనాలు వున్నాయి. ఇద్దర్నీ చంపినది ఒక్కరే. అది రాజేష్‌. పరువుకోసం చేసిన హత్య యిది' అని సింగ్‌ కథనం.

చాలామంది దాన్ని విశ్వసించారు. మే 31న సిబిఐకు అప్పగించారు. జులై 11 న రాజేష్‌ బెయిల్‌లో బయటకు వచ్చాడు. ఇక అతన్ని కేసు నుండి తప్పించడానికి సిబిఐ జాయింటు డైరక్టరు అరుణ్‌ కుమార్‌ ప్రయత్నించసాగాడు. హేమరాజ్‌ను ఎవరు ఎందుకు చంపారు? అన్నదానికి సమాధానం చెప్పాలి కాబట్టి, ముగ్గురు పనివాళ్లను వేదికపైకి తీసుకుని వచ్చాడు. రాజేష్‌ వద్ద పనిచేసే కృష్ణ అనే పనివాడు, పక్కింట్లో పని చేసే విజయ్‌ మండల్‌, తల్వార్ల స్నేహితులు దురానీల యింట్లో పనివాడు రాజ్‌కుమార్‌ ముగ్గురు కలిసి హేమరాజ్‌ గదిలో మందు కొట్టారని, హేమరాజ్‌ వారిస్తున్నా ఆరుషిపై బలాత్కారం జరిపి, చంపి, ఆ తర్వాత హేమరాజ్‌ను చంపారని వాదించారు. వాళ్లపై నార్కో టెస్టులు జరిపి నిజాలు రాబట్టామని చెప్పారు. హేమరాజ్‌ శవాన్ని మెట్లమీదకు లాక్కుని వెళ్లిన గుర్తులు లేవని, హేమరాజ్‌, కృష్ణ డాబా మీదనే ఘర్షణ పడ్డారని, అక్కడే హేమరాజ్‌ హత్యకు గురయ్యాడని చెప్పాడు. ఆ కథనంలోనూ చాలా లోపాలున్నాయి. కోర్టులో చెపితే నిలిచేట్లు లేదు. 14 నెలలు గడిచేసరికి అరుణ్‌ కుమార్‌ను తప్పించి కౌల్‌ అనే ఆయన్ని యిన్వెస్టిగేషన్‌ ఆఫీసరుగా తీసుకుని వచ్చారు. 15 రోజుల్లో కేసు స్వరూపం మారిపోయింది. ముగ్గురు పనివాళ్లు నిరపరాధులనీ, రాజేషే ప్రధాన నిందితుడే కానీ నిరూపించేందుకు సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు మూసేయాలని విజ్ఞప్తి చేసింది. 

అయితే రాజేష్‌ యీ మచ్చను సహించలేకపోయాడు. ఎందుకంటే ఆరుషి-హేమరాజ్‌ అక్రమసంబంధం సిద్ధాంతం నమ్మబుద్ధిగా లేదు కాబట్టి, ఆమె క్లాస్‌మేట్స్‌, స్నేహితులు ఎవరూ ధృవీకరించలేదు కాబట్టి, రాజేష్‌కు, అనితా దురానీ అనే డెంటిస్టుకి సంబంధం వుందని, అదే యీ హత్యలకు మూలకారణమనీ మరో పుకారు బయటకు వచ్చింది. అనిత, అతను కలిసి రోజూ ఉదయం నోయిడాలో ఒకే క్లినిక్‌లో పనిచేస్తారు. అదే క్లినిక్‌లో సాయంత్రం అనిత భర్త, రాజేష్‌ భార్య కలిసి పనిచేస్తారు. రెండు జంటలూ చాలా స్నేహంగా వుంటాయి. హేమరాజ్‌ యీ విషయాలు గ్రహించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, అవేళ రాత్రి రాజేష్‌ కోపం పట్టలేక హేమరాజ్‌ తల బద్దలు కొడితే ఆరుషి నిలదీసిందని, అందుకే కోపావేశంలో ఆమెనూ చంపివేశాడనీ అనసాగారు. హేమరాజ్‌ భార్య నేపాల్‌ నుండి వచ్చి 'తమ కుటుంబరహస్యాలు బయట పెడుతున్నందుకు తిడుతున్నాడనీ, బెదిరిస్తున్నాడనీ హేమరాజ్‌ తరచూ వాపోయేవాడ'ని మీడియాతో చెప్పింది. ఈ గొడవల కారణంగా రాజేష్‌ సిబిఐ రిపోర్టును ఛాలెంజ్‌ చేస్తూ పరిశోధన యింకా సాగించాలని కోరాడు. బయట మీడియాలో పరువునష్టం దావా వేస్తానని బెదిరించాడు. ఎందుకంటే బయట ప్రజలు రాజేష్‌, నూపుర్‌లే యీ హత్య చేసి వుంటారని బలంగా నమ్మసాగారు.

అలా కోరడమే రాజేష్‌ కొంప ముంచింది. 2012 జూన్‌ నుండి సిబిఐ కేసుని తిరగదోడింది. పోస్టుమార్టమ్‌ చేసిన డాక్టరును తలమీద గాయాల గురించి ఎందుకు రాయలేదని అడిగింది. అతను తన స్టేటుమెంటు మార్చాడు. చివరకు జడ్జి రాజేష్‌, నూపుర్‌లను హత్య చేసినందుకు గాక, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు శిక్షించారు. ఆ నలుగురు తప్ప ఆ రాత్రి ఆ యింట్లో వేరే ఎవరూ లేరని, ఆరుషి తలుపు తీసి హేమరాజ్‌ను తన గదిలో రప్పించుకుందని కోర్టు అభిప్రాయపడింది.  డిఫెన్సు తరఫున వచ్చిన సాక్ష్యాలను కోర్టు విశ్వసించలేదు. ఆరుషి, హేమరాజ్‌ల సెల్‌ ఫోన్లు మాయం కావడం కూడా మిస్టరీగా వుంది. బయటి హంతకుడు యిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడా అని కోర్టు సందేహం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

Click here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?