Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 2

ఇప్పుడు తెలంగాణ హోం మంత్రిగారు చెప్తున్నారు - గుంజలు పాతితే మావోయిస్టులు ఎత్తుకుపోతారని. వీళ్లేమైనా కొత్తగా వచ్చారా? హామీలు గుప్పించినపుడు యీ విషయం గుర్తుకు రాలేదా? తెరాస ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఛత్తీస్‌గఢ్‌ కరంటు ప్రతిపాదన వచ్చినపుడు ఒక ఉన్నతాధికారి మావోయిస్టు సమస్య ప్రస్తావిస్తే 'ఏవిటీ నస' అంటూ అతన్ని కమిటీలోంచి తొలగించారట. ఇప్పుడు ఈటెలే ఆ మాటలు చెప్తున్నారు. కెసియార్‌ను ఎవరైనా ధైర్యం చేసి అడిగితే 'ఛత్తీస్‌గఢ్‌ కాకపోతే మరో దిక్కుమాలిన గఢ్‌ నుంచి కొంటాం' అని బీరాలు పలుకుతారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలు, ఎంత ఖరీదైనా సరే డబ్బిచ్చి కరంటు కొంటాం అని చెప్పారు కెసియార్‌ ఆనాడు. ఓ సామెత వుంది - దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే 'మా మేనమామ చెవిలో బొచ్చు మొలిపించు చాలు' అన్నాట్ట భక్తుడు. తథాస్తు అన్నాడు దేవుడు. మామకు బొచ్చు మొలిచింది కానీ అల్లుడికి ఐశ్వర్యం పట్టలేదు. అలాగ ప్రత్యేక రాష్ట్రం వెలిసింది కానీ వెలుగులు మాత్రం చేరటం లేదు. 

డబ్బు దేముంది, కుక్కను కొడితే రాలుతుంది అనే స్టయిల్లో మాట్లాడతారు కెసియార్‌. డబ్బు పారేస్తాం, మెట్రో ఎలైన్‌మెంట్‌ మార్పిస్తాం అంటారు, డబ్బు విసిరేసి కేంద్రం నుండి కొత్తగూడెంలో వాటా కొనేస్తాం, కెజి నుంచి పిజి దాకా ఉచిత విద్య చెప్పించేస్తాం, చెఱువులు తవ్వేస్తాం, అంటారు. డబ్బులెలా వస్తాయని అడిగితే కోపం వస్తుంది. అక్రమ నిర్మాణాలు కనిపెట్టేసి, కూలగొడతామని బెదిరించి జరిమానాలు వసూలు చేస్తే కోట్లు కురుస్తాయని చెప్పుకున్నారు. అయ్యప్ప సొసైటీ భవనాల కూల్చివేతతో, నాగార్జున సెంటర్‌తో ఆ పర్వం ఆగిపోయింది. బిల్డింగులపై స్టాంపులూ నిలిచిపోయాయి. ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు ఆపారో వారికే తెలియాలి. ఉద్యమం నడిచినంత కాలం ఐమాక్స్‌పై, రాఘవేంద్రరావు కాంప్లెక్స్‌పై, పద్మాలయపై, అన్నపూర్ణ స్టూడియోలపై ఆరోపణలు గుప్పించారు. అవన్నీ స్వాధీనం చేసుకుంటామన్నారు. స్వాధీనం మాట అటుంచి జరిమానాలు కూడా పడినట్టు లేదు. కృష్ణగారు తెలంగాణ ఫిల్మ్‌సిటీకి కెసియార్‌ పేరు పెట్టాలని సూచించి కెసియార్‌కు ఆత్మీయుడై పోయారు. కెసియార్‌ ఆయనను తెగ ప్రశంసించారు. ఇక అధికారులు ఆ నిర్మాణాలపై ఏ చర్యలు తీసుకుంటారా?

ఇందిరమ్మ యిళ్ల ఎలాట్‌మెంట్‌లో అవినీతిపై విచారణ జరుపుతున్నామన్నారు. అక్రమంగా ఎలాట్‌ అయిన యిళ్లు వెనక్కు లాక్కుని పేదలకిస్తారని ఆ విధంగా డబ్బు మిగులుతుందని, అక్రమాలు చేసినవారి ఆస్తులు జప్తు చేసుకుని ఖజానాకు జమ చేస్తారని అనుకుంటే ఆ విచారణ మధ్యలోనే ఆగిపోయింది. తీగలాగితే కదిలిన డొంక ఎవరిదో మరి! సౌకర్యాలు లేని కాలేజీలను మూసేసి ఫీజుల భారం తగ్గించుకోవడమో, లేక కాలేజీలపై పెనాల్టీలు వేయడమో చేస్తారనుకుంటే, కాలేజీల వాళ్లు అధికార పార్టీలోకి జంపయిపోయి, కాలేజీలు రక్షించుకుంటున్నారు. విభజన తర్వాత రియల్‌ ఎస్టేటు నీరసించింది. ఇప్పటిదాకా కోలుకోలేదు. రిజిస్ట్రేషన్ల పై వచ్చే ఆదాయం దెబ్బ తింది. నిర్మాణకార్యక్రమాలు మందగించాయి. ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్థానికత అంశాలపై నెలకొన్న భయాందోళనల వలన హైదరాబాదు నుండి  కొందరు వెనక్కి వెళ్లిపోయి చిన్న వ్యాపారాల ఆదాయం దెబ్బ తింది. హైదరాబాదువాసులందరికీ యిది అనుభవంలోకి వస్తోంది. ప్రభుత్వాలు పెట్టుబడులు ఆహ్వానించడానికి ఏ దేశవాసులనైనా వాటేసుకుంటాయి. కానీ యిక్కడ ఆంధ్రులపై కక్ష కట్టినట్టు ప్రతీదానికీ వారినే నిందించడం వలన యిక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రులకు సాహసం చాలటం లేదు. వారి స్థానాన్ని తక్కిన రాష్ట్రాల వారు భర్తీ చేయడానికి సమయం పడుతుంది. 

'హైదరాబాదు పరిస్థితి మారింది కాబట్టి మా ప్రొజెక్షన్స్‌ తప్పాయి, మా ఆదాయాలు తగ్గాయి, వడ్డీ తగ్గించి, అప్పు తీర్చే సమయాన్ని పొడిగించండి' అని హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు నడిపే సంస్థలు రియల్‌ ఎస్టేటు, నిర్మాణ రంగాల్లోని అనేక వ్యాపారసంస్థలు తమను కోరుతున్నట్లు బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వాలకు ముఖ్యమైన ఆర్థిక వనరు ఎక్సయిజ్‌. దసరాకు కల్లు కాంపౌండులు తెరిచాక ఆ ఆదాయం ఏ మేరకు ప్రభావితమయ్యిందో త్వరలో తెలుస్తుంది. ఆదాయం యిలా వున్నా కెసియార్‌ గాలిమేడలు కట్టి చూపడం మానలేదు. దళితులకు భూమి, యిల్లు కట్టి యిస్తానని ఢంకా బజాయించి చెప్తున్నారు. అంత భూమి ఎక్కడిది అని అడిగితే అన్యాక్రాంతమైన దేవాలయ, వక్ఫ్‌, చెఱువు భూములను స్వాధీనం చేసుకుని, ఆంధ్రులు ఆక్రమించిన భూములను, ఎలాట్‌ చేయించుకుని పరిశ్రమలు మొదలుపెట్టని భూములను అన్నిటినీ వెనక్కి తీసుకుని దళితులకు పంచుతామని చెప్తూ వచ్చారు. ఇప్పుడు కొని పంచుతామంటున్నారు. విదేశాలలో, నగరాలలో వున్న భూయజమానులు పల్లెల్లోని తమ భూములను తెలంగాణ ప్రభుత్వానికి అమ్మాలట. మార్కెట్‌ రేటుకి కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బుందా? లేక ఆంధ్ర సర్కారును కాపీ కొట్టి బాండ్లు చేతిలో పెడుతుందా? (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?