Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మనం రాసేదే చరిత్ర

ఎమ్బీయస్‌: మనం రాసేదే చరిత్ర

చైనాకు, జపాన్‌కు వైరం అనాదిగా వస్తోంది. ఒక్కోసారి యుద్ధంగా పరిణమిస్తుంది, కొంతకాలం స్తబ్ధత వుంటుంది. ఇటీవలి కాలంలో జపాన్‌ అమెరికాతో జత కట్టి తమకు వ్యతిరేకంగా కూటమి కడుతూండడంతో మంట పుట్టిన చైనా తమ స్కూలు పిల్లలకు జపాన్‌పై ద్వేషాన్ని నూరిపోయడానికి నిశ్చయించుకుంది. దానికి దేశభక్తిపూరితమైన విద్య అనే పేరు పెట్టింది. రెండవ ప్రపంచయుద్ధకాలంలో జపాన్‌ చైనాపై 1937 జులై 7 న దండెత్తిందని ఆ యుద్ధం ఎనిమిదేళ్ల పాటు సాగిందని యిన్నాళ్లూ బోధిస్తూ వచ్చిన చైనా హఠాత్తుగా ఆ యుద్ధకాలాన్ని ఆరేళ్లు పెంచి 14 ఏళ్లు చేసేసింది. 1931 సెప్టెంబరు 18న జరిగిన ముక్‌డెన్‌ సంఘటన దగ్గర్నుంచి యుద్ధాన్ని లెక్క వేయడం వలన ఆరేళ్లు కలిసి వచ్చింది.

ఈశాన్య చైనాలో మంచూరియా వుంది. జపాన్‌ దానిపై కన్నేసింది. అక్కడకు జపాన్‌ వారి సౌత్‌ మంచూరియా రైలును నడుపుతూండేవారు. ఆ రైల్వే లైనుపై చైనా సైన్యానికి సంబంధించిన వారెవరో బాంబుదాడి చేశారనే మిషపై ఆ ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించింది. నిజానికి ఆ బాంబు ఎంత బలహీనంగా పేలిందంటే రైల్వే ట్రాక్‌కి ఏమీ కాలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఒక రైలు దానిపై వెళ్లింది కూడా. కానీ ఆ పేరు చెప్పి జపాన్‌ సైన్యం దాడి చేసింది.

అప్పట్లో చైనాను చాంగ్‌ కై షేక్‌ జాతీయ ప్రభుత్వం తరఫున పాలిస్తూ వుండేవాడు. అతను ఎంతసేపూ మావోకు చెందిన కమ్యూనిస్టు సేనను ఎలా అణచాలా అనే చూసేవాడు తప్ప జపాన్‌తో పేచీ పెట్టుకునే ఉద్దేశంలో వుండేవాడు కాదు. అందువలన మంచూరియా కమాండర్‌కు జపాన్‌తో యుద్ధం చేయవద్దని ఆదేశాలిచ్చాడు. అతను పాటించాడు. ఆ యుద్ధంలో 50 మంది చైనావారు చనిపోగా యిద్దరే యిద్దరు జపానువారు మరణించారు. దీన్ని చైనా ప్రజలు నిరసించడంతో ఆర్నెల్లు పోయిన తర్వాత చైనా ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నానాజాతి సమితి (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌)కు ఫిర్యాదు చేసింది. వారు ఒక కమిషన్‌ వేస్తే యిదంతా జపాన్‌ ఆడిన నాటకమని తేలింది. దానిపై కినిసిన జపాన్‌ సమితిలోంచి 1933లో తప్పుకుంది. మంచూరియా నుంచి తప్పుకోలేదు.

చైనాకు ఆఖరి చక్రవర్తిగా వుండి, ప్రజల తిరుగుబాటుతో అధికారం పోగొట్టుకున్న పూయీని 1934లో పాలకుడిగా పెట్టి అతని ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత కమ్యూనిస్టు విప్లవం వచ్చి మావో అధికారంలోకి వచ్చాక యీ ప్రాంతాన్ని కూడా విముక్తం చేసి పూయీని పదేళ్లపాటు జైలుకి పంపాడు. ముక్‌డెన్‌ సంఘటనకు గుర్తుగా అక్కడ మ్యూజియం కట్టారు. (ఫోటో చూడండి) 

చరిత్రను తమ కనువుగా మలుచుకోవడంలో సిద్ధహస్తులమని ప్రస్తుత చైనా పాలకులు 2015లోనే చూపించుకున్నారు. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్‌ ఓటమికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అంతా వేడుకలు నిర్వహించారు. బీజింగ్‌లో మిలటరీ పెరేడ్‌ జరిపారు. ఆ వేడుకల సందర్భంగా మీడియా చైనా జపాన్‌ను ఓడించిందనే చెప్పారు తప్ప మిత్రదేశాలైన అమెరికా, ఇంగ్లండు, రష్యా కలిసి జర్మనీ-ఇటలీ-జపాన్‌ల అక్షరాజ్య కూటమిని ఓడించాయని చెప్పలేదు. అమెరికా అణుబాంబు వేశాకనే జపాన్‌ ఓటమి అంగీకరించిందని కూడా చెప్పలేదు. 'యుద్ధసమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ దృఢంగా నిలబడి విదేశీ శక్తులను తరిమి కొట్టింది' అనే కథనాలు రాశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?