Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హత్య - 59

జులై 22 -''షణ్ముగం చావు సిట్‌ దర్యాప్తుకి ఎదురుదెబ్బ'' అని హిందూలో కథనం వచ్చింది. సిట్‌ తన పని తను చేసుకుంటూనే పోతోంది. దానికి అనుబంధంగా పనిచేస్తున్న రహస్య సమాచార విభాగం ద్వారా తమిళనాడులో ఎల్‌టిటిఇ రాజకీయ విభాగానికి చెందినవాడిగా చెప్పుకుంటూ, పెద్దమనిషిగా చలామణీ అవుతున్న తిరుచ్చి శంతన్‌ దగ్గర వైర్‌లెస్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న డిక్సన్‌ ఫోటో కూడా దొరికింది. ఇతనికి అసిస్టెంటుగా కాంతన్‌ పనిచేస్తున్నాడని తెలుసు. ఈ కాంతన్‌ నిజానికి ఎల్‌టిటిఇ ఇంటెలిజెన్సు విభాగానికి చెందినవాడని, 1990 సెప్టెంబరులో నిక్సన్‌ (నిశాంతన్‌ అని మారుపేరు) అనే యింటెలిజెన్సు విభాగానికే చెందిన సహచరుడితో కలిసి చెన్నయ్‌లోని గిండీలో ఒక టెక్నికల్‌ యిన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి వైర్‌లెస్‌ ఆపరేషన్‌ కక్షుణ్ణంగా నేర్చుకున్నాడని రాబర్ట్‌ పయాస్‌ సిట్‌కు చెప్పివున్నాడు. ఇన్‌స్టిట్యూట్‌లో రికార్డులు బయటకు లాగితే కాంతన్‌ అప్లికేషన్‌, దానిపై అతని ఫోటో దొరికాయి. శివరాజన్‌, శుభ, నెహ్రూ యింటెలిజెన్సు విభాగానికి చెందినవారు. వారికి తమిళనాడులోని ఎల్‌టిటిఇ రాజకీయవర్గాలకు లింకు లేదు. కానీ కాంతన్‌ ద్వారా, డిక్సన్‌ను సంప్రదించడంతో అతనే వీళ్లను తిరుచ్చి శంతన్‌ వద్దకు తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాడు. ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్‌ చేయాలంటే డిక్సన్‌ దొరకాలి. అందువలన డిక్సన్‌ ఫోటోలను తమిళనాడులోని ట్రాఫిక్‌ పోలీసుల చేతికిచ్చి అనుమానంగా కనబడిన ప్రతీ ఆటోను ఆపి ప్రయాణీకుల్ని తనిఖీ చేయమంది సిట్‌. 

xxxxxxxxxxxxxxxx

శివరాజన్‌ ఎక్కడికి వెళ్లాడన్న సంగతి సిట్‌ తెలుసుకోలేకపోతోందని ఇండియా టుడే జులై 21 సంచికలో రాసింది. ఇంటర్‌పోల్‌, రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌, బ్రిటిష్‌ స్కాట్లండ్‌ యార్డ్‌ల సహాయాన్ని సిబిఐ తీసుకుంటోందని, శివరాజన్‌, శుభలు కలిసి సంచరించటం లేదని సిట్‌ భావిస్తోందనీ కూడా రాసింది. (నిజానికి వాళ్లు కలిసే తిరుగుతున్నారు). ఖట్మండూలో వుంటూ ఎల్‌టిటిఇ తరఫున హవాలా లావాదేవీలు చేసే ఎల్‌టిటిఇ సభ్యుడు త్యాగరాజన్‌ను ఢిల్లీ తీసుకువచ్చారని, అతను సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియాల నుంచి ఎల్‌టిటిఇకి వచ్చే నిధులను పర్యవేక్షించడం అతని పని అనీ తెలియపరిచింది. శివరాజన్‌ నేపాల్‌ గుండా తప్పించుకోదలచాడా? లేక సిట్‌ను మభ్యపెట్టడానికి దాని దృష్టిని నేపాల్‌వైపు మళ్లించాడా అన్నది తెలియటం లేదని అంది. పొట్టు అమ్మన్‌ వైర్‌లైస్‌ ఆపరేటర్‌ శివరూపన్‌ (సురేష్‌ కుమార్‌) జయపూర్‌లో అరెస్టయిన విషయం ప్రస్తావిస్తూ అతను హరిబాబు కెమెరా కోసం మానవబాంబు థాను వెంటనంటి వున్నాడని, ఆనాటి బాంబు పేలుడులో అతని కాలు పోయిందని రాసింది (ఇది తప్పు - అతని కాలు అంతకు ముందే పోయింది. జయపూర్‌లో కాలు పెట్టించుకోవడానికి రాజీవ్‌ హత్య ముఠాతో బాటు దిగాడు. జయపూర్‌ వెళ్లాడు)

జులై 23 - షణ్ముగం మరణం కారణంగా సిట్‌పై కురుస్తున్న విమర్శల వలన వారి ఆత్మస్థయిర్యం చెదిరి వుంటుందని, వెళ్లి వెన్ను తట్టి వస్తే మంచిదని  భావించిన కేంద్ర హోం మంత్రి ఎస్‌బి చవాన్‌ తమిళనాడు వచ్చారు.  తన పర్యటనకు కారణం కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించడం, రాజీవ్‌ హత్య జరిగిన శ్రీపెరంబుదూరును చూడడం అని చెప్పుకున్నారు. కానీ అసలు వుద్దేశం షణ్ముగం హత్య/ఆత్మహత్య జరిగిన వేదారణ్యం అడవులెలా వుంటాయో స్వయంగా పర్యవేక్షించడం. తీరప్రాంతాలను ఆకాశం నుండి చూడగలిగారు కానీ వేదారణ్యంలో దిగలేకపోయారు. సాంకేతిక కారణాలతో.. అని వారన్నా భద్రతా కారణాలేమోనని పత్రికలు అనుమానించాయి. తనతో బాటు సిట్‌ అధినేత కార్తికేయన్‌కు తీసుకెళ్లారు తప్ప తనను తీసుకెళ్లలేదని ముఖ్యమంత్రి జయలలిత అలిగారు. తన గతచరిత్ర కారణంగా తనను కేంద్రం నమ్మటం లేదన్న కినుక ఆమెకు వుందనుకోవాలి. నిష్పక్షపాతంగా చూడాలంటే తమిళ టైగర్లను వెంటాడడంలో జయలలిత ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తోంది అన్న విషయం కూడా గమనించవలసిన అవసరం వుంది. ఎందుకంటే ఎల్‌టిటిఇ పట్ల తమిళనాడు రాజకీయపక్షాల వ్యవహార ధోరణి ఎప్పటికప్పుడు రకరకాలుగా మారుతూ వచ్చింది. 

1987 అక్టోబరులో భారత శాంతిసేనకు, ఎల్‌టిటిఇకి యుద్ధం జరుగుతున్నపుడు 'అది ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ కాదు, ఇన్నోసెంట్‌ పీపుల్స్‌ కిల్లింగ్‌ ఫోర్స్‌' అని తమిళనాడులో ప్రతిపక్షంలో వున్న డిఎంకె నాయకుడు కరుణానిధి విమర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీయార్‌కు ఒకప్పుడు ఎల్‌టిటిఇ అధినేత ప్రభాకరన్‌ వీరాభిమాని. తక్కిన తమిళగ్రూపులకు కరుణానిధి మద్దతు వుండేది. కానీ పోనుపోను ప్రభాకరన్‌ ధోరణి ఎంజీఆర్‌కు నచ్చడం మానేసింది. ఎల్‌టిటిఇని కట్టడి చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కరుణానిధి ఎల్‌టిటిఇని దువ్వ నారంభించాడు. అందుకే అలాటి ప్రకటన చేశాడు. టైగర్ల పట్ల తమిళ ప్రజలకు సానుభూతి వలన కరుణానిధి ప్రకటనకు స్పందన రావడంతో ఎంజీఆర్‌కు భయం వేసింది. యుద్ధవిరమణ చేయమని ప్రధాని రాజీవ్‌ గాంధీకి సూచించాడు. కానీ రాజీవ్‌, అతను రాయబారులు 'కొద్దికాలం ఓర్చుకుంటే యీ సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామ'ని అతనికి నచ్చచెప్పారు.  1987 డిసెంబరులో ఎంజీఆర్‌ హఠాత్తుగా చనిపోవడంతో పార్టీ రెండుగా చీలింది. ఇరుపక్షాలూ యించుమించు కరుణానిధి ధోరణిలోనే, టైగర్లపై కఠినంగా వ్యవహరించడం మంచిది కాదంటూ మాట్లాడసాగాయి. ఎంజీఆర్‌ కాబినెట్‌లో ఫైనాన్సు మంత్రిగా వున్న విఆర్‌ నెడుంజెళియన్‌ మాత్రం ఎల్‌టిటిఇకి మాటపై నిలబడే అలవాటు లేదని, వాళ్లను అదుపు చేయాల్సిందేననీ అంటూ వచ్చాడు. 

డిఎంకె భాగస్వామిగా వున్న నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి - ముఖ్యంగా వాజపేయి కరుణానిధిని సమర్థించాయి. వామపక్షాలు మాత్రం శాంతిసేన ఆపరేషన్స్‌ కొనసాగాలనే అన్నాయి. 1988 జనవరిలో ఆర్మీ చీఫ్‌ కె. సుందర్‌జీ మాట్లాడుతూ యిటువంటి విషయాల్లో జాతీయదృక్పథం అనేది వుండాలనీ, అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా అదే ధోరణిలో మాట్లాడాలనీ, లేకపోతే భారతసైనికుల మనోస్థయిర్యం దెబ్బ తింటుందని హెచ్చరించారు. ఎడిఎంకెలోని ఒక వర్గానికి నేతగా ఎదిగిన జయలలిత 1988 ఫిబ్రవరిలో జర్నలిస్టులతో మాట్లాడుతూ ''తమిళ టైగర్ల భాగస్వామ్యం లేకుండా శ్రీలంక సమస్యపై అర్థవంతమైన చర్చలు జరగవు'' అన్నారు. మార్చి 1న కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ''టైగర్లతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించండి.'' అని ప్రకటన చేశారు. ఆ నెల మూడోవారంలో ''టైగర్లకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలు కట్టిపెట్టి ప్రభాకరన్‌ను చర్చలకు పిలవండి. ఉద్దేశపూర్వకంగానో, పొరపాటునో అతనికి ఏదైనా హాని జరిగితే తమిళనాడులో దాని పరిణామాలు తీవ్రంగా వుంటాయి.'' అని హెచ్చరించారు. కొన్ని రోజులకు నేనిచ్చిన పిలుపుకు కేంద్రం నుంచి స్పందన ఏమీ లేదని వాపోవడం కూడా జరిగింది. ఇలా జయలలిత కూడా ఎల్‌టిటిఇ పట్ల మెతకగానే వ్యవహరిస్తూ వచ్చారు. శాంతిసేన తరఫున వెళ్లిన భారతీయ సైనికులు చనిపోయినా, గాయపడినా వారికి సానుభూతిగా ఒక్క మాట మాట్లాడలేదు. 1991 ఏప్రిల్‌ 29 న ''హిందూ''కి యిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ''బంగ్లాదేశ్‌ ఆవిర్భావ సమయంలో పశ్చిమ పాకిస్తాన్‌ సైనికులు తూర్పు పాకిస్తాన్‌ జాతిని నాశనం చేయబూనినప్పుడు ఇందిరా గాంధీ భారతసైన్యాన్ని పంపి వారిని రక్షించారు. శ్రీలంకలో తమిళులపై జాతిహననం కొనసాగితే మన సైన్యం పంపి సింహళీయుల నుండి తమిళులను రక్షించాలి.'' అంది.

అయితే రాజీవ్‌ హత్య తర్వాత ఆమె ధోరణి మారిపోయింది. ఆమె అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో పోలీసులకు, సిట్‌కు పూర్తిగా సహకరిస్తూ ఎల్‌టిటిఇ పట్ల కాఠిన్యం వహించమని పౌరులకు కూడా విజ్ఞప్తి చేస్తోంది. అయినా చవాన్‌ అది గుర్తించినట్లు లేదు. ఆమెను తన పర్యటనలో తోడుగా తీసుకుని వెళ్లలేదు.(సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives

(ఫోటోలు - శివరాజన్‌ ఏయే రకాల వేషాల్లో వుండవచ్చో వివరించే ప్రకటన, ఎస్‌ బి చవాన్‌, ఎంజీఆర్‌, ప్రభాకరన్‌, జయలలిత, కరుణానిధి) ఫోటో సౌజన్యం - ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?