Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజీవ్‌ హత్య - 72

సెప్టెంబరు 09 - తిరుచ్చి శంతన్‌ యింకా సిట్‌కు పట్టుబడలేదు. అతను పట్టుబడితే హత్యలో ఎల్‌టిటిఇ పాత్రను కోర్టులో సులభంగా నిరూపించవచ్చు. నిజానికి తిరుచ్చి శంతన్‌ ఎల్‌టిటిఇ కి చెందిన రాజకీయ విభాగానికి చెందినవాడు. శివరాజన్‌ యింటెలిజెన్సు విభాగానికి చెందినవాడు. ఈ రెండింటికి లింకు లేకుండా చూస్తుంది ఎల్‌టిటిఇ నాయకత్వం. శివరాజన్‌ను బెంగుళూరు తరలించడానికి శంతన్‌ సాయపడ్డాడంటే సాక్షాత్తూ ప్రభాకరన్‌ నుంచి ఆదేశాలు వచ్చి వుంటాయి. శంతన్‌ను పట్టుకుని ఆ ఆదేశాల గురించి అతని చేత చెప్పించగలిగితే ప్రభాకరన్‌ను కేసులో ముద్దాయిని చేయవచ్చు. 

సిట్‌ తన గురించి వెతుకుతోందని తెలిసి శంతన్‌ కలుగులో ఎలకలా దాగున్నాడు. అతని వెంట యిద్దరు ముగ్గురు ఎల్‌టిటిఇ సహాయకులు తప్ప వేరెవరూ మిగల్లేదు. వాళ్లు బయటకొచ్చి మాట్లాడితే వాళ్ల శ్రీలంక యాసను జనాలు పట్టేసి పోలీసులకు చెప్పేస్తారు. ప్రభాకరన్‌కు తన దుస్థితి మొరపెట్టుకుని రక్షించమని కోరాలని శంతన్‌ అనుకున్నాడు. కానీ సందేశం పంపడం ఎలా? వరదన్‌ అరెస్టు కారణంగా  వైర్‌లెస్‌ సెట్‌ పోలీసుల చేతిలో పడింది. కోడ్‌ షీట్స్‌ డిక్సన్‌ కాల్చేసి వున్నాడు. ఇలాటి స్థితిలో అతను ఒక లేఖ రాసి దాన్ని తన సహాయకుడు ఇరుంబొరై ద్వారా ప్రభాకరన్‌కు పంపుదామని నిశ్చయించుకుని సెప్టెంబరు 9 తేదీతో లేఖ రాశాడు. ''శివరాజన్‌ బృందం చేసిన ఆత్మత్యాగంతో యిక్కడి పరిస్థితులన్నీ మాకు ప్రతికూలంగా మారిపోయాయి. తమిళనాడులో మన ఎల్‌టిటిఇ కార్యక్రమాలు కొనసాగించాలంటే వైర్‌లెస్‌ సెట్‌, ఆపరేటర్‌, డబ్బు కావాలి, వెంటనే పంపండి' అని రాసి కవర్లో పెట్టి దాన్ని ఇరుంబొరైకు పంపాడు. దానితో పాటు ఇరుంబొరైకు ప్రభాకరన్‌ ఎదుట ఎలా మెలగాలో జాగ్రత్తలు చెపుతూ కవరింగ్‌ లెటర్‌ రాసి పంపాడు. 

సెప్టెంబరు 10 - అమ్మన్‌ యిచ్చిన మారణాయుధాలతో రవి తమిళనాడు తీరంలో బోటు దిగాడు. అతని వెంట రెండు సబ్‌మెషిన్‌ గన్‌లు, వందల కొద్దీ బుల్లెట్లు, పది గ్రెనేడ్లు, అయిదు 9 ఎంఎం పిస్టల్స్‌, 12 బంగారం బిస్కెట్లు, రెండు వాకీటాకీ సెట్లు, 15 కోడ్‌ షీట్లు, అనేక సైనైడ్‌ గొట్టాలు వున్నాయి. ముందుగా వైర్‌లెస్‌లో తన రాకను తెలపడం చేత అతని సహచరులు వచ్చి బోటు వద్ద కలిశారు. తీరమంతా భద్రతాదళాలు పహరా కాస్తున్నాయని, పెద్ద పెద్ద మారణాయుధాలను తీసుకెళితే వాళ్ల కళ్లల్లో పడడం ఖాయమని వారు చెప్పారు. దాంతో రవి సబ్‌ మెషిన్‌గన్స్‌ను, కొన్ని గ్రెనేడ్లను సముద్రతీరంలో యిసుక కుప్పల్లో దాచిపెట్టించాడు. ఒక పిస్టల్‌, ఆరు బంగారం బిస్కెట్లు, మిగతా గ్రెనేడ్లు, సైనైడ్‌ గొట్టాలు, వాకీటాకీలు సుశీంద్రన్‌కి యిచ్చి భద్రంగా దాచు అని చెప్పాడు. 

శివరాజన్‌ మరణం తర్వాత కూడా మారణకాండ ఆగకుండా చేసే ఘనత తమకే దక్కుతుందని రవి బృందం గర్వంగా ఫీలైంది. తాము చంపవలసిన రాజకీయ ప్రముఖుడెవరైతే బాగుంటుందా, పోలీసు ఉన్నతాధికారి ఎవరైతా బాగుంటుందా అని చర్చించుకుంటూ హుషారుగా తమ తమ స్థావరాలకు వెళ్లారు. 

సెప్టెంబరు 12 - తమిళనాడు తీరంలో విపరీతంగా వర్షాలు కురిశాయి. ఆ వర్షపునీటికి యిసుక తిన్నెలు కరిగిపోయి రవి బృందం దాచిన సబ్‌ మెషిన్‌గన్‌లు కొంచెం కొంచెం బయటకు కనబడసాగాయి. అది గమనించిన గ్రామస్థులు తీరంలో పహరా కాస్తున్న కస్టమ్స్‌ అధికారులకు చెప్పారు. అంతే వారు అక్కడంతా తవ్వి ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

దిండిగల్‌లో యిళ్ల మధ్యలో రవి దళ సభ్యులు నడుపుతున్న శిబిరం నుంచి వైర్‌లెస్‌ సెట్‌ ఆపరేట్‌ చేశారు. దాని సిగ్నల్స్‌ కారణంగా యిరుగుపొరుగు యిళ్లల్లో టివి సెట్లలో ప్రసారం గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి యిల్లిల్లూ వెతికారు. శిబిరాన్ని పట్టుకున్నారు. దాడి చేసి వైర్‌లెస్‌ సెట్టుతో సహా కొందరు కుర్రాళ్లను అరెస్టు చేశారు

సెప్టెంబరు 13 - కుర్రాళ్లు యిచ్చిన సమాచారంతో సుశీంద్రన్‌, రవి, యితర కుర్రాళ్లు దొరికిపోయారు. వారు జాఫ్నా నుంచి తెచ్చిన మారణాయుధాలన్నీ పోలీసుల చేతిలోకి వచ్చేశాయి. మరొక ప్రముఖుడి హత్యతో తమిళనాడును అతలాకుతలం చేసేయాలనుకున్న ప్రభాకరన్‌, అమ్మన్‌ల వ్యూహానికి పురిట్లోనే సంధి కొట్టింది. 

సెప్టెంబరు 20 - తిరుచ్చి శంతన్‌ తనకు రాసిన లేఖ ఇరుంబొరైకు అందింది. జాఫ్నా వద్దామనుకుంటున్నానని అమ్మన్‌కు కబురు పెట్టాడు. అక్టోబరు 2 న బోటు పంపుతాం రమ్మనమని అమ్మన్‌ జవాబిచ్చాడు.

అక్టోబరు 02 - రాత్రి 11 గం||లు. విలుందితీర్థం రేవులో ఇరుంబొరై, అతని సహచరులు ఎల్‌టిటిఇ పంపిన బోటు ఎక్కారు. బోటు జాఫ్నాకు బయలుదేరింది. వారిలో హుషారు వచ్చింది. పాటలు పాడుతూ, కేరింతలతో ముందుకు సాగారు. ప్రయాణం మొదలై రెండు, మూడు గంటలయ్యేసరికి నిద్రలోకి జారుకోసాగారు. అకస్మాత్తుగా భారత నౌకాదళ భద్రతా సిబ్బంది యీ మరపడవను అడ్డగించి, బోటులోకి దూకింది. కంగారు పడిన ముగ్గురు తీవ్రవాదులు సైనైడ్‌ మింగేశారు. వాళ్లల్లో యిద్దరు అప్పటికప్పుడే చచ్చిపోయారు. తక్కిన వారందరినీ భద్రతాదళం సజీవంగా నిర్బంధంలోకి తీసుకుంది. వారిలో ఇరుంబొరై ఒకడు.

అక్టోబరు 03 - నౌకాదళ సిబ్బంది వీరందరినీ తమిళనాడు పోలీసులకు అప్పగించారు, వారు సిట్‌కు అప్పగించారు. ఇరుంబొరై వద్ద సోదా చేస్తే తిరుచ్చి శంతన్‌ రాసిన ఉత్తరం దొరికింది. ఎల్‌టిటిఇ పాత్రను నిర్ధారించే కీలకసాక్ష్యంగా ఆ లేఖ పనికి వచ్చింది. 

అక్టోబరు 09 - తిరుచ్చి శంతన్‌ వేట కొనసాగుతోంది. అతని ఆదేశాలపై శివరాజన్‌ ముఠాను బెంగుళూరు తరలించిన మెట్టూరు రాజును పట్టుకోవాలని సిట్‌ వెతుకుతోంది. రంగన్‌ వద్ద ఆగస్టు 30 న స్వాధీనం చేసుకున్న మారుతి జిప్సీలో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం, మెట్టూరులోని ధనశేఖరన్‌ అనే వ్యక్తి ఒకేసారి నాలుగు మారుతి జిప్సీలు కొన్నట్టు తెలిసింది. మెట్టూరులోని అతని యింటిపై సిట్‌ అక్టోబరు 9 న దాడి చేసి సోదా చేసింది. ఆ సమయంలో అతను లేడు. ఇంట్లో ట్రక్కుల తాలూకు రికార్డులు, అతని ఫోటోలు దొరికాయి. మెట్టూరు నుంచి వచ్చేటప్పుడు సిట్‌ దళం దారిలో వున్న పూనమల్లి సబ్‌జైలుకి వెళ్లి అక్కడ రిమాండ్‌లో వున్న విక్కీ రంగన్‌లను కలిసి ధనశేఖరన్‌ ఫోటో చూపించి యితనెవరో తెలుసా? అని అడిగారు. వాళ్లు ''రాజు'' అన్నారు. ఓహో ధనశేఖరనే రాజు అనే మారుపేరుతో వ్యవహరిస్తున్నాడన్నమాట అని సిట్‌కు తెలిసింది. వెంటనే అక్టోబరు 11 కల్లా తమ ముందు హాజరు కావాలని ధనశేఖరన్‌కు లీగల్‌ నోటీసు పంపింది.

అక్టోబరు 10 - ధనశేఖరన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. 'సిట్‌దళాలు నన్ను చంపేసే ప్రమాదముంది కాబట్టి, నా న్యాయవాది సమక్షంలో మాత్రమే వారు నన్ను విచారించాలి' అని అభ్యర్థించాడు. కోర్టు 'అతన్ని ఒక ఐజీ స్థాయి అధికారి సమక్షంలో ఎస్‌పి స్థాయి అధికారి మాత్రమే విచారించవచ్చు. అయితే అతను మాత్రం అక్టోబరు 16 కల్లా సిట్‌ ముందు హాజరు కావాల్సిందే' అని హైకోర్టు ఆదేశించింది.

అక్టోబరు 13 - ఏమనుకున్నాడో ఏమో ధనశేఖరన్‌  గడువుకు రెండు రోజుల ముందుగానే మెట్టూరు పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని కూడా ముద్దాయిగా అరెస్టు చేశారు. ట్యాంకరును స్వాధీనం చేసుకున్నారు. 

అక్టోబరు 14 - విచారణలో ధనశేఖరన్‌ చెప్పాడు - ''నాలుగు మారుతీ జిప్సీలను ఎల్‌టిటిఇ అవసరాలకై కొన్నాను. శివరాజన్‌ను కాపాడాలని ప్రభాకరన్‌ చెప్పాడని నాకు తిరుచ్చి శంతన్‌ చెప్పడం చేత శివరాజన్‌, శుభ, నెహ్రూలను ఖాళీ ట్యాంకర్‌లో బెంగుళూరుకు నేనే చేర్చాను. ఒక నెలరోజుల తర్వాత మళ్లీ బెంగుళూరులో శివరాజన్‌తో కలిసి భోజనం చేశాను. మాటల్లో అతను చెప్పాడు - 'రాజీవ్‌ను చంపటం పెద్దన్న ప్రభాకరన్‌ ఆదేశాల మేరకే జరిగింది' అని. 

తిరుచ్చి శంతన్‌ దొరికితేనే కథ ముగింపుకు వస్తుంది అనుకుంది సిట్‌! (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?