Advertisement

Advertisement


Home > Articles - MBS

మీడియాతో మమత యుద్ధం

మీడియాతో మమత యుద్ధం

బెంగాల్‌లో కమ్యూనిస్టులు రాజ్యం చేస్తూండగా సింగూర్‌, నందిగ్రామ్‌ బాధితుల పేర మమతా బెనర్జీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూంటే  స్థానిక, జాతీయ మీడియా ఆమెను సాక్షాత్తూ దుర్గాదేవి అవతారంగా ఆకాశానికి ఎత్తేసింది. ఆమె చర్యల వలన బెంగాల్‌ అంటే పారిశ్రామికవేత్తలు అడలిపోయే పరిస్థితి వస్తుందనే విషయాన్ని వారు పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల కోరలు పీకగలిగిన మహా శక్తి యీవిడే అనుకున్నారు. ఆమె లోపాలేవీ బయటకు రానీయలేదు. 2011లో ఆమె అధికారంలోకి వచ్చింది. ఆమె పార్టీ సభ్యులే నడిపిన శారదా గ్రూపు మీడియాలో కూడా చొచ్చుకుని పోవడంతో వారు ఆ దేవత యిమేజిని కాపాడుకుంటూ, పెంచుకుంటూ వచ్చారు. ఇంతలో శారదా గ్రూపు స్కామ్‌ బయటపడింది. వారి టీవీ ఛానెళ్లు, పత్రికలు మూతపడ్డాయి. అక్కడి నుంచి వచ్చే మద్దతు పోయింది. ఇక మామూలు మీడియాదే పై చేయి అయింది. బెంగాల్‌లో అత్యధిక ప్రజాదరణ కలిగిన ''ఆనంద్‌ బజార్‌'', ద్వితీయ స్థానంలో వున్న ''వర్తమాన్‌'' మమత పాలనలోని లోపాలను ఎత్తి చూపసాగాయి. ఆనంద్‌ బజార్‌ గ్రూపుకి చెందిన  టాప్‌ పాప్యులర్‌ టీవీ ఛానెల్‌ ''ఎబిపి-ఆనందా'' కూడా మమతను ఉతికి పారేస్తోంది. ఏ మాట కా మాట చెప్పాలంటే ఆ టీవీ ఛానెల్‌ ప్రతిరోజు నిర్వహించే ''ప్రతి-పక్ష'' అనే చర్చావేదిక కార్యక్రమంలో తృణమూల్‌ పార్టీ నాయకులను కూడా ఆహ్వానిస్తూ వుంటుంది. కానీ పాల్గొనడానికి పార్టీలో అగ్రనాయకులు జంకుతూంటారు. శారదా గ్రూపు పందికొక్కులు బయటపడుతున్న కొద్దీ మమత యిరకాటంలో పడుతోంది, యీ పత్రికలు చెలరేగిపోతున్నాయి. ఇక 2012లో మమతా బెనర్జీ ప్రభుత్వ గ్రంథాలయాలేవీ  ''ఆనంద్‌ బజార్‌'',''వర్తమాన్‌'' పత్రికలు కొనకూడదని ఆదేశాలిచ్చింది. తన పార్టీ కార్యకర్తలే కాదు, మామూలు ప్రజలు కూడా ''ఎబిపి-ఆనందా'' చూడకూడదని బహిరంగ సభల్లో చెపుతోంది. 

దీనిపై స్పందించమని ఆనంద్‌ బజార్‌ వాళ్లను అడిగితే ''ఏ నాయకుణ్నయినా సృష్టించడమో, అంతర్ధానం చేయడమో మీడియా చేతిలో లేదు. ప్రజాదరణ అనే నిచ్చెనపై నాయకుడు పైకో, కిందకో వెళుతూంటే ఆ వేగాన్ని పెంచడానికి మాత్రమే మీడియా ఉపకరిస్తుంది. మేము అంశాన్ని బట్టి సమర్థించడమో, వ్యతిరేకించడమో చేస్తాం.'' అన్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఓ సారి చెప్పుకున్నాడు - 'రోజు నిద్ర లేవగానే పేపర్లో రేప్‌ కేసుల గురించి వార్తలు కంటపడేవి. నిందితులను పట్టుకున్నారో లేదో రాసేవారు కాదు. ఇది పని కాదని నేను నిందితులు పట్టుబడిన సంగతిని, వాళ్లపై కేసులు పెట్టిన సంగతిని రోజూ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పసాగాను. దానివలన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో కూడా ప్రజలకు తెలిసేది.'' అని. మమతాకు యిలాటి లౌక్యం లేదు. ప్రెస్‌ను ఖాతరు చేయదు. ''మీరు విమర్శలు సహించరెందుకు?'' అని జాతీయ మీడియా అడిగితే ''నేను సహించకపోతే నాపై యిన్ని విమర్శలు ఎలా వస్తున్నాయి?'' అని ఎదురు ప్రశ్నిస్తుందామె. మొన్న బర్ధమాన్‌ పేలుళ్ల విషయంలో చాలా అప్రతిష్ట మూటగట్టుకోవడంతో ఆమె అసహనానికి హద్దులు లేకుండా పోయాయి. డిసెంబరులో జల్పాయిగుడి బహిరంగసభలో మాట్లాడుతూ ''సిపిఎం వాళ్లకు వేరే పని లేదు, తృణమూల్‌ వాళ్లకు కిందనుంచి వెదురుబొంగులు దోపడం తప్ప..'' అని అనడంతో యింత అసభ్యమా? అని గోల చెలరేగింది. అది సద్దు మణగకముందే ఆమె కుడి భుజం అమిత్‌ మిత్రా పోలీసు ఉన్నతాధికారులను పిలిచి 'సెక్రటేరియట్‌లో జర్నలిస్టులు యిష్టం వచ్చినట్లు తిరగకుండా చూడండి' అని ఆదేశించాడు. మర్నాడే సెక్రటేరియట్‌ సెక్యూరిటీ స్టాఫ్‌ జర్నలిస్టులతో 'వెళ్లి ప్రెస్‌ కార్నర్‌లో కూర్చోండి, లేకపోతే అరెస్టు చేస్తాం' అని బెదిరించారు. ఇది ఎమర్జన్సీ రోజులను తలపిస్తున్నాయి అంటూ మీడియా గగ్గోలు పెట్టింది. వారి శాపాలు తగిలాయో ఏమో శారదా స్కామ్‌లో కాబినెట్‌ మంత్రి మదన్‌ మిత్రా అరెస్టయ్యాడు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?