Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: దేశద్రోహానికి నిర్వచనం...?

ఎమ్బీయస్‌: దేశద్రోహానికి నిర్వచనం...?

మన దేశానికి, చైనాకు యుద్ధం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. చైనా ఫర్నిచరును చూసి మురిసి, కొని మనింట్లో పెట్టుకుంటే..? చైనా సంగీతం మనసుకు నచ్చి వాళ్ల పాట వింటే...? వాళ్ల హస్తకళా నైపుణ్యాన్ని మెచ్చో, వాస్తు కోసమో వాళ్లు చేసిన ఫెంగ్‌ షుయి బొమ్మలు యింట్లో షో కేసులో అలంకరించుకుంటే...? వాళ్లు చేసిన ఆటవస్తువులు పిల్లలకు కొని యిస్తే...? ఏ ఆసియా క్రీడల్లోనో చైనా ఆటగాడి నేర్పుకు మురిసి చప్పట్లు కొడితే...? మనకు దేశభక్తి లేనట్లేనా? దేశద్రోహం చేసినట్లేనా? 'నిస్సందేహంగా' అనేయగలరు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లా పోలీసులు.

జూన్‌ 18 ఆదివారం రాత్రి ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్‌ గెలిచాక జిల్లా ముఖ్యకేంద్రం నుంచి 25 కి.మీ.ల దూరంలో వున్న మోహాద్‌ గ్రామంలో బాణసంచా కాల్చినట్లు ఆ వూరి పోలీసులకు వినబడిందట. పొద్దున్నే వెళ్లి  18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో వున్న 15 మంది ముస్లిములను పట్టుకుని షాపూర్‌ పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేసి పడేశారు.

అంతేకాదు, వాళ్లపై సెక్షన్‌ 124-ఎ (దేశద్రోహం), సెక్షన్‌ 120-బి (నేరపూరిత కుట్ర) అనే నేరాలు కూడా మోపేశారు. వీళ్లు చేసిన నేరం ఏమిటి? అని అడిగితే స్టేషన్‌ ఇన్‌స్పెక్టరు సంజయ్‌ పాఠక్‌ మీడియాతో 'పాకిస్తాన్‌ విజయం సాధించగానే వీళ్లు బాణసంచా కాల్చారు, 'పాకిస్తాన్‌ జిందాబాద్‌' అని నినాదాలు చేశారు అన్నాడు. మీ దగ్గర సాక్ష్యం ఏముంది? సెల్‌ఫోన్‌లో ఫోటోలూ అవి తీశారా? అని అడిగితే 'చీకటి కదా, ఫోటోలు రావు' అన్నాడు.

మేం యివి 18 చోట్ల నుంచి ఏరుకుని వచ్చాం అంటూ కాలిపోయిన బాణసంచా ముక్కలు కాసిన్ని గోనెసంచెలో చూపించాడు. అవి వీళ్లే కాల్చారని ఎలా చెప్పగలరు? అని అడిగితే 'వీళ్ల యింటి పక్కనే ఒక హిందువు వున్నాడు. సుభాష్‌ కోలీ అని. వీళ్లు నినాదాలు యిస్తూ వుంటే అతను విని మాకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మీదే మేం చర్య తీసుకున్నాం.' అన్నాడు. 

ఇది వార్తల్లోకి ఎక్కింది. మీడియా ఆ వూరివారిని యింటర్వ్యూ చేశారు. జనపద్‌ పంచాయితీ సభ్యుడిగా చేసిన రంజీత్‌భాయ్‌ అనే అతను ఎవరో కొందరు తాగుబోతు కుర్రాళ్లు బాణసంచా కాల్చారు కానీ నినాదాలు ఎవరూ యివ్వలేదన్నాడు. ఈ అరెస్టయినవారిలో విద్యార్థులు, కార్మికులు, రైతులు వున్నారు. ఈ పదిహేనుమందే బాణసంచా కాల్చారనీ ఎవరు చెప్పగలరని, చీకట్లో ఎవరెవరో ఏం కనబడుతుందని గ్రామస్తులు ప్రశ్నలు సంధించారు.

విచారణ సాగేకొద్దీ యింకా ఎక్కువ మందిని అరెస్టు చేయాల్సి రావచ్చని పాఠక్‌ అనడమే కాక, యిల్లిల్లూ శోధించడం మొదలుపెట్టడంతో చాలామంది ముస్లిములు యిళ్లు విడిచి పారిపోయారని ఎన్‌సిపి మాజీ ఎమ్మెల్యే  చెప్పాడు. పాఠక్‌ అంతటితో ఆగకుండా నిందితులకు సబ్సిడీ బియ్యం వగైరాలు నిలిపివేయమని జిల్లా కలక్టరుకు, ఎస్పీకు లేఖలు రాసి, పైగా ఆ విషయం మీడియాకు చెప్పాడు. అలా రాసే అధికారం మీకుందా? అని అడిగితే నిక్షేపంలా, దానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా వుంది అన్నాడు. ఏదీ చూపించండి అంటే 'దాని కాపీ ప్రస్తుతం నా దగ్గర లేదు' అన్నాడు. 

ఇతన్ని చూసి యిన్‌స్పయిర్‌ అయ్యారో లేక సొంత తెలివితేటలో తెలియదు కానీ ఉజ్జయిని జిల్లాలోని ఖమారియా గ్రామంలో పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. నేరం ఏమిటంటే పాకిస్తాన్‌ గెలవగానే బాణసంచా కాల్చి ఇస్లాం అనుకూల నినాదాలు చేశారట! వాళ్లపై సెక్షన్‌ 153 ఎ కింద, అంటే మత సామరస్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు నేరం మోపారు. నేరం రుజువైతే ఐదేళ్ల శిక్ష పడుతుంది.

'ఇస్లాం అనుకూల నినాదాలు చేసినందుకు అంతటితో సరిపెట్టాం, పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేసి వుంటే దేశద్రోహం కేసు మోపేవాళ్లం. దానికైతే యావజ్జీవమే.' అన్నాడు అక్కడి ఇన్‌స్పెక్టరు దినేశ్‌ వర్మ. గ్వాలియర్‌లో చదువుకుంటున్న ఒక కశ్మీరీ విద్యార్థి ఈ మ్యాచ్‌ తర్వాత పాకిస్తాన్‌కు అనుకూలంగా ఫేస్‌బుక్‌లో ఓ కామెంటు పెడితే గ్వాలియర్‌ పోలీసులు అతనిపై 153-ఏ కింద కేసు పెట్టారు. ఈ కథనాలను జాతీయ మీడియా అందిపుచ్చుకుంది. క్రీడాస్ఫూర్తితో నెగ్గిన టీమును అభినందిస్తూ బాణసంచా కాలిస్తే అది దేశద్రోహమౌతుందా? అని అడగసాగింది.

ఇవన్నీ చూసి మోహాద్‌ యిన్‌స్పెక్టరు కంగారు పడ్డాడు. 'పాకిస్తాన్‌ జిందాబాద్‌' నినాదాలకు సాక్ష్యం సంపాదించడం కష్టం కాబట్టి దినేశ్‌ వర్మ బాటలోనే నడుద్దామనుకున్నాడు. సెక్షన్‌ 124 ఎ, బిలు పక్కన పెట్టి నిందితులను మంగళవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు సెక్షన్‌ 153-ఏ కింద కేసు పెట్టినట్లు మార్చేశాడు. ఈ 'దేశద్రోహుల' మొహాలు చూడడానికి రైటిస్టు సంస్థల కార్యకర్తలు కోర్టు ఆవరణలో పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో సెక్యూరిటీ పెంచాల్సి వచ్చింది. కోర్టు నిందితులను 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించింది.

నాలుగు రోజులు పోయేసరికి కథ మారింది. ఫిర్యాదు చేసిన సుభాష్‌ కోలీ మాట మార్చాడు. నేనసలు ఫిర్యాదే చేయలేదు, పోలీసులు నన్ను ఒత్తిడి చేసి రిపోర్టు రాయించారు అన్నాడు. 'మా ముస్లిము స్నేహితుడొకణ్ని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని విడిపించమని అడగడానికి వెళితే అక్కడ యిదిగో యీ పాఠక్‌ గారు నా దగ్గర ఫోన్‌ లాక్కుని పోలీసు కంట్రోలు రూముకి ఫోన్‌ చేసి 'నా పేరు సుభాష్‌ కోలీ.

ఇక్కడ పాకిస్తాన్‌ గెలుపు సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నారు సార్‌....' అంటూ ఏదో మాట్లాడాడు. తర్వాత ఓ కాగితం మీద ఏదో రాసి నా చేత సంతకం పెట్టించారు. పెట్టకపోతే చితకపొడుస్తానన్నారు. నిజానికి నేను బాణసంచా కాల్చినట్లు గమనించాను కానీ ఏ నినాదాలూ వినలేదు.' అన్నాడు. 'ఇదేమిటండీ, యితనిలా అంటున్నాడు?' అని పాఠక్‌ను అడిగితే 'సంగతేమిటంటే కోలీ డిష్‌ యాంటెనాలు రిపేరు చేస్తాడు. అతని కస్టమర్లందరూ ముస్లిములే. నీ కారణంగా మా వాళ్లందరూ జైల్లో కూర్చున్నారని అందరూ తిట్టడంతో అతను ప్లేటు ఫిరాయించాడు.

నేను యింటరాగేట్‌ చేసినపుడు నినాదాలిచ్చినట్లుగా వీళ్లందరూ ఒప్పుకున్నారు.' అంటున్నాడతను. కోలీ స్టేటుమెంటు మారడంతో దాని ఆధారంగా బెయిలు కోసం అప్లయి చేస్తే కోర్టు జూన్‌ 27 న నిందితులందరికీ బెయిలు యిచ్చి బయటకు విడిచి పెట్టింది. కేసు నడుస్తోంది. సుభాష్‌ కోలీ తన వృత్తితో బాటు పోలీసు ఇన్‌ఫార్మరుగా కూడా పనిచేస్తూ పైన సంపాదిస్తూ వుంటాడట. అందుకే అతన్ని పావుగా పోలీసులు వాడుకున్నారు. అయితే ఈ కేసు సంచలనం సృష్టించడంతో సుభాష్‌ బెదిరిపోయాడు.

మోహాద్‌ గ్రామం రాష్ట్రరాజధాని భోపాల్‌కు 350 కి.మీ.ల దూరంగా మహారాష్ట్ర సరిహద్దులో వుంది. ఆ వూరిలో భిల్లు జాతి నుండి కొన్ని వందల సంవత్సరాల క్రితం మతం మారిన తాడ్‌వీ పఠాన్‌ ముస్లిములు, ఒబిసిలు ఎక్కువ. 'ఈ గ్రామం మతపరంగా చాలా సున్నితమైన గ్రామం. చాలా మతకలహాలు జరిగాయి. అందుకే ప్రతి చిన్న సంఘటనను సీరియస్‌గా తీసుకుని జాగ్రత్తగా డీల్‌ చేస్తున్నాం. ' అంటున్నారు పోలీసులు. 'అంతా అబద్ధం.

చాలాకాలంగా మా దగ్గర గొడవలే లేవు, ముస్లిములు దసరా, దీపావళి జరుపుకుంటారు. హిందువులు ఈద్‌ జరుపుకుంటారు. 1992లో బాబ్రీ మసీదు కూలగొట్టినప్పుడు కూడా మా దగ్గర అల్లర్లు జరగలేదు. 2008లో బుర్‌హాన్‌పూర్‌లో మతకలహాలు జరిగినప్పుడు కూడా మా గ్రామం శాంతంగానే వుంది. నాలుగేళ్ల క్రితం కొందరు కావాలని మసీదుమీద బుక్కా చల్లారు. అయినా మేం కిమ్మనలేదు. ఇప్పుడు కూడా అన్యాయంగా అరెస్టులు జరిగినా నిరసన ప్రదర్శనలకు, గొడవలకు దిగలేదు చూడండి.' అంటున్నారు గ్రామస్తులు.

జిల్లా ముఖ్యకేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో తగిలించిన బోర్డులో యీ గ్రామం పేరు దగ్గర కయ్యాల గ్రామం (ఝగడాలూ గావ్‌) అని రాసి పెట్టారు. 'ముస్లిం మెజారిటీ వున్న గ్రామాలన్నిటికీ అలాగే రాశారు, కానీ మతకలహాలు జరిగే హిందూ మెజారిటీ వున్న గ్రామాలకు అలా రాయలేదు' అని మీడియా ఎత్తి చూపింది. మధ్యప్రదేశ్‌లో 2018లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలను మతపరంగా విడగొట్టి రాజకీయలబ్ధి పొందడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని, దానికి అధికారులు సహకరిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. దానికై క్రీడారంగాన్ని, దేశద్రోహం చట్టాన్ని చిత్తం వచ్చినట్లు వాడుకుంటున్నారనేదే వేదన కలిగించే అంశం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?