Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఐస్‌క్రీమ్‌ లక్ష.. రైతు కష్టానికి శిక్షా.?

ఐస్‌క్రీమ్‌ లక్ష.. రైతు కష్టానికి శిక్షా.?

ఏ రాజకీయ నాయకుడైనా సరే, రైతు పేరు చెబితే చాలు విపరీతమైన మమకారం ప్రదర్శించేస్తాడు. కానీ, ఆ రైతుని ఆదుకునేందుకు మాత్రం దురదృష్టవశాత్తూ దేశంలో ఏ ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించదు. 'మాది రైతు ప్రభుత్వం' అని చెప్పని పార్టీని దేశంలో ఇప్పటిదాకా ఎప్పుడన్నా చూశామా.? ఆఖరికి 'వ్యవసాయం దండగ..' అన్న నోటితోనే, ఓ ప్రబుద్ధుడు.. ఇప్పుడు రైతుల్ని ఉద్ధరించేస్తానంటున్నాడనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర సమితి, తన 16వ పండుగని వరంగల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇందుకోసం, 'గులాబీ కూలీ' అనే కాన్సెప్ట్‌ని తెరపైకి తెచ్చారు కేసీఆర్‌. ఐస్‌క్రీమ్‌ ఖరీదు జస్ట్‌ ఐదు లక్షలు మాత్రమే.. ఎందుకంటే ఓ మంత్రిగారు అమ్మిన ఐస్‌క్రీమ్‌ అది. ఒకాయన దోసె వేస్తే, దాని ఖరీదు లక్ష పలికింది. బజ్జీలు అమ్మినోళ్ళు కొందరు, మూటలు మోసినోళ్ళు ఇంకొందరు.. ఇలా లక్షలకు లక్షలు సంపాదించేశారు. కోటి రూపాయలు, ఆ పైనే కూలీ దక్కి వుండొచ్చు గులాబీ దండుకి. 

అంతా బాగానే వుందిగానీ, ఈ గులాబీ దండు, రైతుల కోసం 'అమ్మకాలు' చేపట్టొచ్చు కదా.? ఆ ఒక్కటీ అడగొద్దు. ఎందుకంటే అది రాజకీయం, ఇది ప్రజాసేవ. దానికీ దీనికీ చాలా తేడా వుంటుంది. సేవ చెయ్యక్కర్లేదు.. బిచ్చం అసలే వెయ్యక్కర్లేదు.. రైతుకి ఊతమిస్తే చాలు.. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు.. మధ్యలో దళారీలు లేకుండా చేస్తే చాలు.! కానీ, అదీ కుదరదన్నట్లు వ్యవహరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

ఖమ్మం మిర్చి మార్కెట్‌ భగ్గుమంది.. ఇంకా సరిగ్గా చెప్పాలంటే తగలబడిపోయింది. కనీ వినీ ఎరుగని రీతిలో విధ్వంసం చోటుచేసుకుందక్కడ. రైతు ఆగ్రహం కారణంగానే ఇదంతా జరిగింది. ఎకరానికి పెట్టిన పెట్టుబడి లక్ష.. దానికి రైతు కష్టం, వడ్డీలు అదనం. మామూలుగా అయితే, పెట్టిన పెట్టుబడికన్నా పది వేలు అయినా ఎక్కువ రావాలి. కానీ, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాని దుస్థితి. ఇంత దారుణానికీ కారణం మిర్చి మార్కెట్‌ మాపియా.. అన్నది రైతుల ఆవేదన. 

ఏ మంత్రీ అటువైపు చూడడు.. ఏ అధికారీ రైతుల ఆవేదనను పట్టించుకోడు.. కానీ, రైతుల్ని అందరూ ఉద్ధరించేస్తారు. ఇది ఒక్క తెలంగాణ పరిస్థితి మాత్రమే కాదు. దేశంలో ఎక్కడ చూసినా రైతు దుస్థితి ఇంచుమించు ఇలాగే తగలడ్తుంది. కానీ, అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలూ రైతుల్ని ఉద్ధరించేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుంటాయి. ఇప్పుడు చెప్పండి, పాలకుల్ని రైతు బాంధవులు అనాలా.? రైతుల్ని పీడించుకు తినే రాబందులనాలా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?