Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మరణమృదంగం.!

మరణమృదంగం.!

ఇదీ తెలంగాణలో మోగుతోన్న మరణమృదంగం తీరు. తెలంగాణ కోసం బలిదానాలకు పాల్పడినవారి కుటుంబాల్ని పరామర్శించడంలో అందరికన్నా ముందున్న తెలంగాణ రాష్ర్ట సమితి, ఇప్పుడు తెలంగాణలో మోగుతోన్న మరణమృదంగం విషయంలో, విపక్షాల ఓవరాక్షన్.. అని తప్పించుకు తిరుగుతోంది. తెలంగాణలో రైతులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం నిజం కాదా? విపక్షాల ఓవరాక్షన్ అన్న అధికార పార్టీ మాటల్లో నిజమెంత.? తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్నవారి కుటుంబాలకు పదేసి లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్, రైతులను ఆదుకునేందుకు మీనమేష్లక్కట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? బాధ్యతల నుంచి తప్పుకుని, విపక్షాలపై బురదజల్లడం ఏ నైతికతకు నిదర్శనం.!

అప్పుడు యువత.. ఇప్పుడు అన్నదాత..

ఉమ్మడి తెలుగు రాష్ర్టం ఉనికిలో ఉన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో యువత ఆత్మ బలిదానాలకు పాల్పడితే, ఇప్పుడు తెలంగాణ రాష్ర్టంలో అన్నదాత ఆత్మహత్యే శరణ్యం అంటున్నాడు. ఉరితాడుకి అప్పుడూ ఇప్పుడూ తీరిక లేకుండా పోయింది. ఉరితాడు.. పురుగుల మందు.. కిరోసిన్.. ఏదైతేనేం, తెలంగాణలో మరణమృదంగం మోగిస్తున్నాయి. ఉద్యమకాలంలోని బలిదానాలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటూ అప్పట్లో ఉద్యమనేతలు రాజకీయ ప్రసంగాలు చేసేశారు. మరిప్పుడేమంటారు?  ఎవరు తెలంగాణలో చోటు చేసుకుంటోన్న రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి? రైతులు మాత్రమే కాదు.. పెన్షన్ల కోసం ఎదురు చూస్తోన్న పండుటాకులూ నేల రాలుతున్నాయి. అవి సర్కారీ హత్యలేనని ఇప్పుడూ విపక్షాలు గొంతెత్తి నినదిస్తున్నాయి. కానీ ఒకప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి అధికార పార్టీ.. ఈ మరణమృదంగంపై పెదవి విప్పలేని పరిస్థితి. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆత్మబలిదానాలతో విలవిల్లాడింది. 

Click Here For Great Andhra E-Paper

రాజకీయ క్రీడలో అమాయక యువత బలైపోయింది. తెలంగాణ రాదేమోనన్న బెంగతో యువత బలిదానాలకు పాల్పడింది. అను నిత్యం బలిదానాలంటూ మీడియాలో వార్తలు దర్శనమిచ్చేవి. ఈ వార్తలు తెలంగాణ ఉద్యమానికి మరింత ఆజ్యం పోశాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సగటు మనిషి ఈ బలిదానాల్ని చూసి ఆవేదన చెందాడు. రాజకీయ పార్టీలు బలిదానాల్ని ఏ స్థాయిలో పబ్లిసిటీకి వాడుకున్నాయంటే, ఒకరు వంద అంటే ఇంకొకరు రెండొందలు అనేంతలా. ఆత్మబలిదానాలకు పాల్పడ్డవారి సంఖ్యను రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రాపకం కోసం పెంచుకుంటూ పోయాయి. 

ఇప్పుడు అధికారంలోకొచ్చిన తెలంగాణ రాష్ర్ట సమితి లెక్కల్నే చూసుకుంటే దాదాపు పదిహేడు వందల మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అమరవీరులకు ఆర్థిక సహాయం అంటూ తేల్చిన లెక్కకీ, అంతకుముందు ఆ పార్టీ చెప్పిన లెక్కకీ అసలు పొంతనే లేదు. అది సరే, రైతుల ఆత్మహత్యల గురించి అసెంబ్లీలో చర్చించడానికే సర్కార్ మొహం చాటేస్తోన్న పరిస్థితి. పెన్షన్ల కోసం ప్రాణాలు కోల్పోతున్నవారి గురించి మాట్లాడలేని దుస్థితి.. ఇదీ అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ఎదుర్కొంటున్న సంకటం.

నేతన్నకి విద్యుత్ షాక్

మేం అధికారంలోకొస్తే ఛత్తీస్‌ఘడ్ నుంచి కరెంటు లైన్లు వేసేస్తాం.. గోదావరికి ఆ ఒడ్డున ఒక స్తంభం.. ఈ ఒడ్డున ఇంకో స్తంభం.. అంతే కరెంటు లాక్కొచ్చేస్తాం.. అని ఉద్యమకాలంలో చెప్పారు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మొన్నటి ఎన్నికల ప్రచారంలో మాత్రం, ‘తెలంగాణలో కరెంటు కష్టాలు తప్పవు.. మూడేళ్ళు ఇబ్బంది పడాల్సిందే..’ అని చెప్పారాయన. అప్పటికి తెలంగాణ బిల్లు పాస్ అయిపోయింది గనుక, అధికారంలోకి తామే వస్తామని పక్కాగా నమ్మకం కలిగాక, కేసీఆర్ వాస్తవాలు మాట్లాడారనే వాదనా లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. 

కోట్లు ఖర్చు చేసి కరెంటును కొనుగోలు చేశాం.. అని తెలంగాణ సర్కార్ చెబుతోందిప్పుడు. భవిష్యత్ అవసరాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలంగాణ మంత్రులు మీడియా ముందుకొచ్చి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే ఏం లాభం.? రైతుల ఆత్మహత్యల పర్వం మాత్రం అలాగే కొనసాగుతోంది. విభజనతో కరెంటు కష్టాలు తెలంగాణలో తీవ్రంగా వుంటుందని సమైక్యవాదులు నెత్తీనోరూ బాదుకున్నారు. ‘మా చావు మేం చస్తం..’ అని మాట్లాడినోళ్ళే, కరెంటు కష్టాలకు ఏపీ సర్కార్ కారణమంటూ పొరుగు రాష్ర్టంపై బురద జల్లే ప్రయత్నం చేసి, చేతులు దులిపేసుకుంటున్నారు తెలంగాణ పాలకులిప్పుడు.

పండుటాకులకి దిక్కు తోచక..

నెలకి రెండొందలు పెన్షన్ వచ్చేది ఒకప్పుడు. అది కాస్తా ఇప్పుడు వెయ్యి రూపాయలు అయ్యింది. ఏం లాభం.? వచ్చే ఆ రెండొందలు కూడా రాకుండా పోయిందంటూ ‘ఏరివేత’ కారణంగా పేర్లు గల్లంతయిన పండుటాకులు తనువు చాలిస్తున్న దుస్థితి నెలకొంది. పెన్షన్ వెయ్యి.. అనగానే ఆనందంతో ఉప్పొంగిపోయిన ముసలి గుండెలకి, ‘మీ పేరు లిస్ట్‌లో లేదు, మీకు పెన్షన్ రాదు’ అనే సమాధానం అధికారులనుంచి వస్తే, వారి పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవడం కష్టం. 

Click Here For Great Andhra E-Paper

కాస్త బలంగా వున్న గుండెలు గాఢంగా నిట్టూరుస్తోంటే, బలహీన గుండెలు బద్దలయిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా పెన్షన్లను ఇస్తోంది తెలంగాణలోని ‘ఆసరా’ పథకం.. అంటూ ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకోవడమే నిజమైతే, తెలంగాణలో పండుటాకులు పెన్షన్లు దక్కక నేల రాలిపోతున్నాయెందుకు.? పత్రిక తిరగేస్తే, పెన్షన్ దక్కక ఆగిన ముసలి గుండె.. అనే వార్తలు నిత్యం దర్శనమిస్తున్నాయి.. దురదృష్టవశాత్తూ ప్రభుత్వానికి ఇవేమీ కన్పించడంలేదు.

అది ఉద్యమం.. ఇది అధికారం

ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ర్ట సమితి విపక్షంలో వుంది. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని తప్పుపట్టడమే విపక్షాల లక్ష్యం. అలా, కాంగ్రెస్ హయాంలో తీసుకున్న చాలా నిర్ణయాల్ని టీఆర్‌ఎస్ తూర్పారబట్టింది. తెలంగాణ రాదేమోనన్న బెంగతో యువత ఆత్మబలిదానాలకు పాల్పడితే, టీఆర్‌ఎస్ నేతలు పరుగు పరుగున వెళ్ళి మృతుల కుటుంబాల్ని ఓదార్చారు. గులాబీ కండువాలు మృతదేహాలకు కప్పి నానా హంగామా చేశారు. ఆర్థిక సహాయం అందిస్తామంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అఫ్‌కోర్స్.. అమరవీరుల కుటుంబాలే ఓ దశలో తెలంగాణ భవన్ వద్ద ధర్నా చేసే పరిస్థితి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. విపక్షంలో వున్నప్పుడు ఎలాగైతే టీఆర్‌ఎస్, ప్రజల పక్షాన నిలబడ్డామని చెప్పుకుందో, ఇప్పుడు అదే పని టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయి. 

రైతన్నల్ని ఓదార్చేందుకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తమకు తోచిన రీతిలో పలు కార్యక్రమాలు చేపట్టాయి. ఇక్కడే టీఆర్‌ఎస్‌కి ఒళ్ళు మండుతోంది. అవన్నీ రైతుల్ని రెచ్చగొట్టడానికే.. అంటూ టీడీపీ, కాంగ్రెస్ సహా విపక్షాలపై అధికార పార్టీ దుమ్మెత్తిపోయడం షురూ చేసింది. ‘తాను చేస్తే సంసారం.. డాష్ డాష్ డాష్..’  అన్న చందాన, అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ తీరు మారిపోయింది. అధికారంలో వున్నప్పుడు విక్షాలపై విరుచుకుపడ్తాం.. విపక్షంలో వున్నప్పుడు అధికారపక్షాన్ని నిలదీస్తాం.. అనే పొలిటికల్ ఫార్ములాన్ని టీఆర్‌ఎస్ పక్కాగా ఫాలో అవుతోందన్న విషయం ఇక్కడ సుస్పష్టం.

అది ఆంధ్రప్రదేశ్ పాపం.. మరి ఇదేమిటి.?

రైతుల ఆత్మహత్యలేకమో కరెంటు కష్టాలు కారణం అని తెలంగాణ ప్రభుత్వమే చెబుతుంది. వ్యవసాయ శాఖ మంత్రిగారేమో, రైతుల ఆత్మహత్యలకు అదొక్కటే కారణం కాదు, వేరే కారణాలున్నాయంటారు. ఇక్కడ స్పష్టత పూర్తిగా కొరవడ్తోంది. పోనీ, తెలంగాణ సర్కార్ చెబుతున్నదే నిజమనుకుందాం. రైతుల ఆత్మహత్యలకు ఏపీ సర్కార్ విద్యుత్ విషయంలో తెలంగాణకు చేస్తోన్న అన్యాయమే కారణమనుకుందాం. మరి, తెలంగాణలో పెన్షన్లు రాక గుండెలు పగులుతోన్న పండుటాకుల మాటేమిటి.? ఇది కూడా ఏపీ సర్కార్ తప్పిదమేనా.? కేంద్రం తెలంగాణకు తగు రీతిలో సహాయ సహకారాలు అందించకపోవడం వల్లేనా.? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి మీదనే వుంది.

అటు నజరానాలు.. ఇటు మీనమేషాలు

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి నజరానాల మీద నజరానాలు ప్రకటించేసింది తెలంగాణ ప్రభుత్వం. మంచిదే క్రీడల్లో రాణించేవారికి తగిన ప్రోత్సాహం అందిస్తేనే కదా, ఏ రాష్ర్టమైనా ఏ దేశమైనా ప్రపంచ పటంలో తనదైన గుర్తింపును సంపాదించుకునేది.! ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టాల్సిన పనిలేదు. అదే సమయంలో, పంటలు పండక, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యతను తెలంగాణ సర్కార్ విస్మరించడాన్ని ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. పెన్షన్ల వ్యవహారంలో వృద్ధుల ప్రాణాలు పోతున్నప్పుడు, తగిన భరోసా పండుటాకులకు కల్పించకపోవడాన్ని తెలంగాణ సర్కార్ వైఫల్యం కిందే పరిగణించాల్సి వుంటుంది. 

Click Here For Great Andhra E-Paper

ఏదిఏమైనా, లక్ష కోట్ల బడ్జెట్ పెట్టామని గొప్పలు చెప్పుకోవడం అటుంచి, పొరుగు రాష్ర్టంపై రాజకీయ విమర్శలు చేయడం మానేసి, తెలంగాణలో సామాజిక పరిస్థితులు తలకిందులైపోతున్నాయన్న తెలంగాణ సర్కార్ ఇప్పటికైనా గుర్తించాల్సి వుంటుంది. చెరువుల పునరుద్ధరణకు వేల కోట్లు.. విద్యుత్ కష్టాలు తగ్గించడానికి వేల కోట్లు.. వాటర్ గ్రిడ్ కోసం వేల కోట్లు.. ఇలా మీడియా ముందు గొప్పల డప్పాలు చెప్పడానికి అన్నీ బాగానే వుంటాయ్‌గానీ, అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది.? అనే విషయమ్మీద తాను తెలుసుకోక.. విపక్షాలు చెబితే చెవిన పడక.. మీడియాలో వస్తున్న కథనాల్ని పట్టించుకోక పరిపాలన సాగిస్తే, ‘నేను హిట్లర్‌నే’ అని కేసీఆర్ పాజిటివ్ సైన్‌లో చెపకున్న విషయమే నెగెటివ్ సైన్‌గా మారిపోయే ప్రమాదముంది. అన్నిటికీ మించి తెలంగాణలో మరణమృదంగం ఆందోళనకర స్థితికి చేరుకునే ప్రమాదం పొంచి వుంది. కాదంటారా.?

సింధు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?