Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బాహుబలుల' లోకం ఇది

'బాహుబలుల' లోకం ఇది

రోడ్డుపక్క కిళ్లీబడ్డీ రాత్రి పదకొండు తరువాత తెరిచివుంటే పోలీసులు వాలిపోతారు. కిళ్లీ బడ్డీ ఆసామీ గజగజలాడుతూ, బతిమలాడుతూ, తలుపులు మూసేస్తాడు. 

టైమ్ దాటినా వైన్ షాపులు తీసే వుంటాయి. మామూళ్లు జేబుల్లోకి చేరుకుంటాయి. సమస్యేలేదు.

కిళ్లీబడ్డీ వాడు ఎమ్మార్పీపై అర్థరూపాయి ఎక్కువ తీసుకుంటే గగ్గోలు. 

మాల్స్ , మల్టీ ఫ్లెక్స్ లు దోచుకుంటున్నా అడిగే దిక్కేలేదు.

చిన్న సినిమా అయినా సరే, థియేటర్ అద్దె అదే. రూపాయి తేడా వుండదు. పైగా పెద్ద సినిమా వస్తే, దాన్ని మెడబట్టుకు బయటకు తోసేస్తారు. చిన్న సినిమా నిర్మాతకు ప్రభుత్వం దగ్గర నోఎంట్రీ. అదే పెద్ద సినిమా అయితే రెడ్ కార్పెట్.

తెలుగువాడు, ప్రపంచం గర్వించదగ్గ.. ఇలాంటివి అన్నీ పక్కనపెడితే, బాహుబలి కూడా ఓ సినిమా. అది కూడా ఓ వ్యాపారం. మిగిలిన వారికన్నా భారీ స్థాయిలో తీసిన సినిమా. అంతేకదా? 

పోనీ నిర్మాత అంతరిస్క్ తీసుకున్నారు. అంత భారీ పెట్టుబడి పెట్టారు అని, రాజమౌళి ఏమన్నా తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకున్నారా? ప్రభాస్ ఏమన్నా కన్సెషన్ ఇచ్చారా? వారి శ్రమకు తగినట్లు వారు వీరలెవెల్లో తీసుకున్నారనేగా వార్తలు వినవస్తున్నాయి. పోనీ లాభం చేసుకోలేదా నిర్మాతలు అంటే, వందల కోట్ల లాభం చేసుకున్నారనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

పోనీ థియేటర్ల వాళ్లుకు ఏమన్నా కష్టమా అంటే.. 10 రూపాయల కూల్ డ్రింక్ ఇరవై రూపాయిల నుంచి ఇరవై అయిదు రూపాయిలు. సైకిల్ కయినా, బైక్ కయినా ఇరవై రూపాయిలు. ఇలా అన్నీ అధికమే. ఇక కోర్టుఆర్డర్లు అడ్డం పెట్టుకుని నేల టికెట్ కూడా 200 రూపాయిల నుంచి 400 రూపాయిలు. సంబంధిత శాఖలు ఏవయితే వున్నాయో వాళ్లందరికీ వీకెండ్ కు పదివేల వంతున మామూళ్లు. మళ్లీ వారం పొడిగిస్తే మరో పదివేలు. దాంతో ఎక్కడి వారు అక్కడ గప్ చుప్.

మరి ఎందుకు ఇవ్వాలి మినహాయింపులు. ఎక్కువ షోలు వేసుకోమని? అంత సరదా వుంటే, జనం అంతా తొలివారంలోనే బాహుబలి చూడాలని అనుకుంటే, విశాఖ బీచ్ లోనో, కృష్ణా తీరంలోనో బిగ్ స్క్రీన్ పెట్టి చూపించేస్తే పోలా?

ఇది క్విడ్ ప్రో కో కాదా?

బాహుబలి సమర్పకుడు కె రాఘవేంద్రరావు తెలుగుదేశం సభ్యుడు. ఆ పార్టీకి ఆయన అనేక విధాలైన సేవలు అందిస్తున్నారు. అవి ఉచితమో, ఆర్జితమో వాళ్లకే తెలియాలి. బాహుబలి నిర్మాతలు కె. రాఘవేంద్రరావు అత్యంత సన్నిహిత బంధువులు.  మరి తెలుగుదేశం పార్టీకి రాఘవేంద్రరావు అందించిన సేవలకు బదులుగా బాహుబలికి అనుమతులు ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? ఇలాంటి వాటినే కదా క్విడ్ ప్రోకో అంటున్నారు? పైగా బాహుబలి నిర్మాణానికి మీడియా జెయింట్ రామోజీరావు ఆర్థిక రుణ సహాయం అందించారని బోగట్టా. సినిమా తొంభైశాతం ఆయన స్టూడియోలోనే నిర్మాణం జరిగింది. ఇదంతా ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటి వాయినం టైపులో అనిపించడం లేదా?

మరి అలాంటపుడు ఇదంతా ఓ పేద్దగూడు పుఠాణీ అని అనుకోవడానికి లేదా? ఎందుకంటే ఎక్కడో బీరకాయ పీచు చుట్టం అనో, చివర్న రెండక్షరాల తోక వుందనో గతంలో జగన్ ను క్విడ్ కో ప్రోను ఆపాదిస్తూ ఎన్ని కథనాలు వండి వార్చలేదు. బాహుబలికి ఇచ్చినట్లు మరి ఇతర సినిమాలకు సదుపాయాలు ఎందుకు ఇవ్వడంలేదు? చిరంజీవి సినిమా, పవన్ సినిమాలకు స్పెషల్ ప్రదర్శన సదుపాయాలు ఎందుకు ఇవ్వలేదు.

చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం

ఇప్పుడు ఇదే విషయం మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అవుతోంది. తొలివారం రోజుల పాటు మెగాఫ్యాన్స్ అనేవారు ఎవరూ కూడా బాహుబలి చూడకూడదంటూ ఫేస్ బుక్ పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. తొలివారం మెగా ఫ్యామిలీ నటుల ఫ్యాన్స్ ఎవరూ కూడా బాహుబలి చూడకుండా వుండి, కాటమరాయుడు, ఖైదీ నెం 150పై వివక్షకు బదులు చెప్పాలని ఆ పోస్టింగ్ ల్లో కోరుతున్నారు. 

మరోపక్క అడ్డగోలుగా రేట్లు పెంచడం, అదనపు ఆటలు ఇవ్వడం అన్నీ నిబంధనలకు వ్యతిరేకం అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏమయితేనేం ఇవన్నీ ఇప్పుడు గట్టిగా వినపడనివ్వదు అధికశాతం తెలుగు మీడియా. ఎందుకంటే అధికశాతం తెలుగు మీడియాకు బాహుబలి ఇంటి బిడ్డతో సమానం కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?